- డాక్టర్‌పై రేప్, మర్డర్ కేసులో బెంగాల్ ప్రభుత్వ తీరుకు నిరసన
- రాజకీయాలకూ జవహర్ గుడ్ బై
- సీఎం మమతా బెనర్జీకి లేఖ
- ఇంతటి నిరసన ఎన్నడూ చూడలేదన్న జవహర్ సర్కార్
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్ కతా డాక్టర్ రేప్, మర్డర్ కేసులో రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా టీఎంసీ రాజ్యసభ సభ్యుడు, మాజీ ఐఏఎస్ జవహర్ సర్కార్ తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. అలాగే రాజకీయాల నుంచి కూడా శాశ్వతంగా తప్పుకుంటానని ఆయన తెలిపారు. డాక్టర్ పై అత్యాచారం, హత్య కేసులో మమతా బెనర్జీ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆలస్యంగా స్పందించిందని, దోషులను శిక్షించడంలో విఫలం అయిందని ఆయన మండిపడ్డారు.
ఈ ఘటనకు నిరసనగా త్వరలోనే తన రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తానని ఆయన తెలిపారు. ఈ మేరకు సీఎం మమతా బెనర్జీకి సర్కార్ లేఖ రాశారు. ‘‘డాక్టర్ పై రేప్, మర్డర్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూసి దిగ్భ్రాంతి చెందా. రాష్ట్ర ప్రభుత్వానికి అసలు ఆందోళనే ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ కేసులో న్యాయం చేయాలని డాక్టర్లు గత కొద్ది రోజులుగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నా మమత సర్కారుకు కనీసం చీమ కుట్టినట్లయినా లేదు. తమకు న్యాయం చేయాలని మాత్రమే డాక్టర్లు అడుగుతున్నారు. అయినా, ప్రభుత్వ చర్యలు శూన్యం. మమత సర్కారు తీరు చూస్తే దోషులను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు ఉంది. దీంతో విసిగి వేసారి పార్టీతో పాటు నా రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యా. త్వరలోనే ఢిల్లీ వెళ్లి రాజ్యసభ చైర్మన్ ను కలిసి రాజీనామా లేఖ అందిస్తా” అని సర్కార్ వెల్లడించారు.
దేశమంతా ఉలిక్కిపడ్డది..
రాష్ట్ర ప్రభుత్వంపై ఇంతటి స్థాయిలో నిరసనలు, ప్రదర్శనలు ఎన్నడూ చూడలేదని జవహర్ సర్కార్ తెలిపారు. డాక్టర్ పై హత్యాచారం ఘటనతో రాష్ట్రంతో పాటు దేశమంతా ఉలిక్కిపడిందని, దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయన్నారు. వాస్తవానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా గళం ఎత్తేందుకు రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ మతపరమైన రాజకీయాలపై పోరాడేందుకు రాజకీయాలను వేదికను ఎంచుకున్నానని వెల్లడించారు. ఆ దిశగా పార్లమెంటులో గళం ఎత్తానని చెప్పారు. కానీ, మమత సర్కారు అవినీతిని చూసి దిగ్ర్భాంతి చెందానని పేర్కొన్నారు. ‘‘విద్యాశాఖ మాజీ మంత్రి పార్థచటర్జీతో పాటు ఎంతోమంది నేతలు తీవ్రంగా అవినీతిలో కూరుకుపోయారు. వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పినా పెడచెవిన పెట్టారు. పైగా.. సీనియర్ నాయకులు కొంతమంది ఎగతాళి చేశారు.
దీంతో రిజైన్ చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నా. కానీ, నా శ్రేయోభిలాషులు వద్దని చెప్పడంతో ఆ ఆలోచనను విరమించుకున్నా. కేంద్రంపై పోరు కొనసాగించాలనుకున్నా. మరోవైపు మమత సర్కారులో మంత్రులు, ఎమ్మెల్యేలు అదేపనిగా అవినీతికి పాల్పడుతూనే ఉన్నారు. పంచాయతీ, మునిసిపల్ నాయకులు అక్రమంగా ఎన్నో ఆస్తులు సంపాదించారు. ఖరీదైన కార్లలో తిరుగుతున్నారు. అలాంటి విలాస జీవితం చూసి నాకు చాలా బాధనిపించింది” అని సర్కార్ తన లేఖలో వ్యాఖ్యానించారు. అభయ (హత్యాచార బాధితురాలు) కుటుంబానికి న్యాయం చేయాలని డాక్టర్లు చేస్తున్న నిరసన ప్రదర్శనలు రాజకీయపరమైనవి కావని, ఆ ప్రదర్శనలకు రాజకీయాలను ఆపాదించకూడదని ఆయన పేర్కొన్నారు. ఇక, రాజ్యసభ సభ్యుడిగా తనకు అవకాశం ఇచ్చినందుకు మమతకు కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాల నుంచి తప్పుకున్నా అవినీతి, మత రాజకీయాలపై తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని సర్కార్ చెప్పారు.