ములుగు, వెలుగు : ఎన్నికల నిర్వహణకు ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ములుగు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో రిటర్నింగ్ ఆఫీసర్, ఐటీడీఏ పీవో అంకిత్‌తో కలిసి ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా త్రిపాఠి మాట్లాడుతూ ఎలక్షన్ డ్యూటీపై సిబ్బందికి అవగాహన కల్పించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో టాయిలెట్స్, ర్యాంపులు, విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు.
ప్రచార సామగ్రి, ఫ్లెక్సీల కోసం క్యాండిడేట్లు ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాలని చెప్పారు. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ వెంకన్న, ఆర్డీవో సత్యపాల్‌రెడ్డి, డీఆర్డీవో నాగ పద్మజ, సీఈవో ప్రసూనరాణి, డీపీవో వెంకయ్య, కలెక్టరేట్ ఏవో ప్రసాద్, ములుగు తహసీల్దార్ విజయ భాస్కర్ పాల్గొన్నారు.
ఇబ్బందులు లేకుండా చూడాలి
పాలకుర్తి/జనగామ అర్బన్, వెలుగు : ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జనగామ కలెక్టర్ శివలింగయ్య ఆదేశించారు. పాలకుర్తిలోని సాంఘిక సంక్షేమ స్కూల్, జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేయనున్న ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిస్ట్రిబ్యూషన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం తొర్రూరులో పోలింగ్ సెంటర్‌ను పరిశీలించి మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. ఆయన వెంట రిటర్నింగ్ ఆఫీసర్ రోహిత్ సింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అనంతరం జనగామ కలెక్టరేట్‌లో నోడల్ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు.