
ములుగు, వెలుగు : వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పెండెన్సీ లేకుండా ఎలక్టోరల్ రోల్స్‌ను రెడీ చేయాలని ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ములుగు తహసీల్దార్ ఆఫీస్‌ను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసి ఓటర్ లిస్ట్, పేర్ల నమోదు, సవరణ, తొలగింపులకు సంబంధించిన తీరును పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఓటర్ లిస్ట్‌లో మార్పులు చేసే టైంలో జాగ్రత్తగా ఉండాలని, లిస్ట్‌ను పారదర్శకంగా ప్రిపేర్ చేయాలని సూచించారు. ఇంటింటి సర్వే ద్వారా లిస్ట్‌ను రెడీ చేయాలని, గరుడ యాప్‌లో వివరాలు సక్రమంగా నమోదు చేయాలని చెప్పారు. ప్రతీ పోలింగ్ స్టేషన్‌ను సందర్శించి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. పొలిటికల్ పార్టీ ఆఫీసులకు 2 కిలోమీటర్ల దూరంలో, ఓటర్లను అందుబాటులో పోలింగ్ సెంటర్లు ఉండేలా చూడాలన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో విజయ భాస్కర్, తహసీల్దార్ మధురకవి సత్యనారాయణస్వామి పాల్గొన్నారు.
ములుగులో ఓటు హక్కు నమోదు చేసుకున్న కలెక్టర్
కలెక్టర్ ఇలా త్రిపాఠి ములుగులో ఓటు హక్కు నమోదును చేసుకున్నారు. గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పనిచేసిన టైంలో అక్కడ ఉన్న తన ఓటు హక్కును ములుగు జిల్లాకు మార్చుకునేందుకు అప్లై చేశారు. దీంతో 136వ పోలింగ్ బూత్ అధికారి లత శనివారం కలెక్టర్ ఇంటికి వెళ్లి విచారణ చేశారు.
ఓటర్ లిస్ట్‌లో తప్పులు ఉండొద్దు
కురవి, వెలుగు : ఓటర్ లిస్ట్‌లో తప్పులు లేకుండా సరిచేయాలని మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్ డేవిడ్ చెప్పారు. కురవి మండల కేంద్రంలోని రైతు వేదికలో తహసీల్దార్ షఫి అధ్యక్షత శనివారం నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. బూత్‌ల వారీగా ఓటర్ల వివరాలు ఉండాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందేలా అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఆర్డీవో అలివేలు, ఎంపీడీవో సరస్వతి, ఏవో మంజుఖాన్ పాల్గొన్నారు..
ఈవీఎంలపై అవగాహన
వర్ధన్నపేట/స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు : వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో ఏర్పాటు చేసిన ఈవీఎం అవగాహన సెంటర్‌ను శనివారం తహసీల్దార్ రవిచంద్రారెడ్డి పరిశీలించారు. ఈ సెంటర్ల ద్వారా ఓటర్లు తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. ప్రలోభాలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అలాగే జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం తాటికొండలోని ఈవీఎం సెంటర్‌లో ఆర్‌ఐ రవీందర్ అవగాహన కల్పించారు.