- ఖమ్మం జిల్లాలో దారుణం
- ఆస్తిని తన పేరిట రాయాలని తల్లికి వేధింపులు
- ఆమె ఒప్పుకోకపోవడంతో ముగ్గుర్ని చంపి పరారైన నిందితుడు
తల్లాడ, వెలుగు : ఆస్తి కోసం కన్నతల్లిని, కడుపున పుట్టిన ఇద్దరు ఆడపిల్లలను ఓ వ్యక్తి పొట్టనబెట్టుకున్నాడు. తల్లి ఆస్తిని తన పేరుమీద రాయకపోవడంతో ముగ్గురిని హత్యచేసి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని గోపాలపేటలో శనివారం జరిగింది. పిట్టల పిచ్చమ్మ (60) తన రెండో కొడుకు పిట్టల వెంకటేశ్వరరావుకు జన్మించిన ఇద్దరు కూతుళ్లు నీరజ(10) , ఝాన్సీ మోహిని (5)తో కలిసి జీవనం సాగిస్తోంది. వెంకటేశ్వరరావు భార్య రెండేండ్ల క్రితం మృతిచెందడంతో అప్పటినుంచి ఇద్దరు పిల్లలు నానమ్మ దగ్గరే ఉంటున్నారు. పిచ్చమ్మ తనకున్న ఎకరం పొలంలో 10 గుంటల చొప్పున మనవరాళ్లు నీరజ, ఝాన్సీ పేర్లమీద రాసి మరో అరెకరం తన వద్దే ఉంచుకున్నది. వెంకటేశ్వరరావు తల్లాడకు చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని, ఖమ్మంలో ఉంటున్నాడు. ఈ క్రమంలో తనకు ఆర్థికంగా ఇబ్బంది అవుతుందని అరెకరం భూమి, వారు నివసిస్తున్న రేకుల షెడ్డును తన పేరుమీద రాయాలని కొద్దిరోజులుగా తల్లిపై ఒత్తిడి తెస్తున్నాడు.
శుక్రవారం సాయంత్రం మాట్లాడేందుకు ఇంటికి వస్తున్నానని చెప్పడంతో తల్లి తినేందుకు గారెలు కూడా చేసింది. రాత్రి అయినా రాకపోవడంతో ఇద్దరు పిల్లలు, అతని తల్లి ఎదురుచూసి నిద్రపోయారు. అర్ధరాత్రి దాటిన తర్వాత వెంకటేశ్వరరావు ఇంట్లో చొరబడి మొదట తన తల్లిని ముఖంపై దిండుతో అదుముతూ.. గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపాడు. తర్వాత కూతుళ్లను హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో వైరా ఏసీపీ రెహమాన్, సీఐ సాగర్, వైరా ఎస్సై వంశీకృష్ణ భాగ్యరాజ్, తల్లాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని హత్య జరిగిన తీరును పరిశీలించి, నమూనాలు సేకరించారు. డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం మధిరకు తరలించారు. కేసు నమోదు చేసి, వెంకటేశ్వర్రావుకోసం గాలింపు చర్యలు చేపట్టారు.