- యాదాద్రి కలెక్టరేట్ వద్ద ధర్నా టెంట్ తొలగింపు
- బాధితులకు మద్దతుగా వచ్చిన బీఆర్‌ఎస్, బీజేపీ లీడర్లు
యాదాద్రి, వెలుగు : ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ వద్ద బాధితులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. శనివారం ధర్నా చేయాలని బాధితులు నిర్ణయించగా, అనుమతి లేకపోవడంతో కలెక్టరేట్ ఎదుట వేసిన టెంట్‌ను పోలీసులు తొలగించారు. కలెక్టరేట్ పరిసరాల్లోకి ఎవరూ రాకుండా ఉదయం 9.30 గంటలకు భువనగిరి- రాయగిరి మధ్య రోడ్డును బ్లాక్ చేశారు. కలెక్టరేట్ గేట్లు మూసి, ఇనుప కంచెను వేశారు.
ధర్నాలో పాల్గొనడానికి వచ్చిన బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ బైపాస్ మీదుగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. కలెక్టరేట్‌కు 300 మీటర్ల దూరంలోనే పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో ట్రిపుల్ ఆర్ బాధితులతో పాటు బీజేపీ కార్యకర్తలతో అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగంలో ఔటర్ రింగ్ రోడ్డుకు 40 కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తున్నప్పుడు ఉత్తర భాగంలో 28 కిలోమీటర్ల దూరంలో నిర్మించడం ఎవరి మేలు కోసం అని ప్రశ్నించారు.
రైతులను కలవకుండా ముఖం చాటేయడం సరికాదన్నారు. ట్రిపుల్ ఆర్ బాధితులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. మరో వైపు భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి బీఆర్‌ఎస్ కార్యకర్తలు, ట్రిపుల్‌ఆర్ బాధితులతో అక్కడికి వచ్చారు. రోడ్డుకు ఇరువైపులా కూర్చున్న బీజేపీ, బీఆర్‌ఎస్ కార్యకర్తలు ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్చాలని డిమాండ్ చేశారు.
ఇదే టైంలో కొందరు లీడర్లు బారికేడ్లను తోసుకుంటూ కలెక్టరేట్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం మాజీఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు, ట్రిపుల్ ఆర్ బాధితులు పోలీసుల కళ్లు గప్పి హైవేపైకి చేరుకొని రెండు వైపులా బైఠాయించారు. దీంతో హైవేపై వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను బలవంతంగా పీఎస్‌కు తరలించారు.