ట్రిపుల్ ఆర్ వార్ 

ట్రిపుల్ ఆర్ వార్ 
  • రింగ్ రోడ్డు అలైన్ మెంట్ పై యాదాద్రి జిల్లాలో బీజేపీ, బీఆర్​ఎస్​ పరస్పర విమర్శలు

యాదాద్రి, వెలుగు: రీజినల్​ రింగ్​ రోడ్డు అలైన్​మెంట్​పై యాదాద్రి జిల్లాలో పొలిటికల్ ​వార్​ మొదలైంది. బీజేపీ, బీఆర్​ఎస్​ పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. ట్రిపుల్​ ఆర్​ బాధితులను కూడగడుతూ బీజేపీ లీడర్లు నేరుగా రంగంలోకి దిగుతున్నారు. దీంతో బీఆర్​ఎస్​ ఆత్మరక్షణలో పడి విమర్శలు చేస్తోంది. తాజాగా ఎమ్మెల్యే శేఖర్​రెడ్డిపై బీజేపీ ఓ వీడియోను సోషల్​ మీడియాలో పోస్ట్​ చేయడంతో అది వైరల్​గా మారింది. రీజినల్​ రింగ్​ రోడ్డు యాదాద్రి జిల్లాలో 59.33 కిలో మీటర్ల రోడ్డు నిర్మాణం కావాల్సి ఉంది. దీంతో తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్​ మండలాల రైతులు 1853.4 ఎకరాలను కోల్పోతున్నారు.

ఇందులో భువనగిరి మండలం రాయగిరికే ఎక్కువగా నష్టం జరుగుతోంది. ఈ గ్రామం నుంచి ఇప్పటికే వివిధ ప్రాజెక్టుల కోసం నాలుగు సార్లు భూమిని కోల్పోయిన రైతుల నుంచి మళ్లీ ఇప్పుడు ట్రిపుల్​ ఆర్​ కోసం 266.14 ఎకరాలు సేకరించనున్నారు. దీంతో అలైన్​మెంట్​మార్చాలని డిమాండ్​ చేస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. సర్వేను అడ్డుకునే ప్రయత్నాలు చేసినా పోలీసుల సహకారంతో రెవెన్యూ ఆఫీసర్లు సర్వేను పూర్తి చేశారు. సీఎం కేసీఆర్​ సహా మంత్రుల పర్యటనల సందర్భంగా  భూములు కోల్పోతున్న  రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు కలెక్టరేట్​ను ముట్టడించారు.

ట్రిపుల్​ఆర్​ విషయంలో స్టేట్​ గవర్నమెంట్​ పాత్ర లేదని, కేంద్రమే కారణమని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఆలేరులోని తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల్లో 580.17 ఎకరాలు, మునుగోడు పరిధిలోని చౌటుప్పల్​ నుంచి 274.77 ఎకరాలు, భువనగిరి, వలిగొండ నుంచే అత్యధికంగా 995.62 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఇందులోనూ రాయగిరిలో డబుల్​ జంక్షన్​ సర్కిల్​ వస్తున్నందున  266.14 ఎకరాలు సేకరించనున్నారు. దీంతో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డిపై బాధితుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అలైన్​మెంట్​ మార్పించాలని పలుమార్లు ఆయన పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. 

రంగంలోకి బీజేపీ

ప్రభుత్వ పెద్దలు, బీఆర్​ఎస్​ లీడర్ల భూములను కాపాడుకోవడంతో పాటు రియల్ వ్యాపారుల ప్రయోజనం కోసమే అలైన్​మెంట్​ మార్పించారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్ర మంత్రులు నితిన్​ గడ్కరీ, కిషన్​రెడ్డిని కలిసి బాధితుల తరపున ఆవేదన వినిపించారు. తాజాగా బీజేపీ లీడర్లు కలెక్టరేట్​ను ముట్టడించి, ఆఫీసర్లకు వినతిపత్రాలు అందించారు. అలైన్​మెంట్​ విషయంలో తమకు సంబంధం లేదంటూ ఇటీవల ఎమ్మెల్యే పైళ్ల విమర్శలు చేయడంతో పొలిటికల్​ హీట్​ పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పాత్ర లేకుంటే సీఎం నుంచి అలైన్​మెంట్​ మార్చాలంటూ లెటర్​ తెప్పించాలన్నారు.  లెటర్​ తెప్పిస్తే తాము కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి సమస్య పరిష్కారానికి తమవంతు ప్రయత్నం చేస్తామని బీజేపీ లీడర్లు చెబుతున్నారు.  ఈ మేరకు బీజేపీ లీడర్​ గూడూరు నారాయణరెడ్డి పోస్ట్​ చేసిన వీడియో కూడా వైరల్​ అయ్యింది. 

అలైన్​మెంట్​ మార్చాలని తీర్మానం చేయిస్తాం 

రీజినల్​ రింగ్​ రోడ్డు అలైన్​మెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత. భువనగిరి నియోజకవర్గంలో రైతుల భూములు కోల్పోవడం పట్ల నాకూ బాధగానే ఉంది. వారు నష్టపపోకుండా నా వంతు ప్రయత్నాలు చేస్తున్నాను.  అలైన్​మెంట్​ మార్చాలని భువనగిరి మున్సిపాలిటిలో తీర్మానం చేయిస్తాం. ఈ తీర్మానాన్ని కలెక్టర్​ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం. కావాలనే బీజేపీ లీడర్లు నాపై ఆరోపణలు చేస్తున్నారు. 
–పైళ్ల శేఖర్​రెడ్డి, ఎమ్మెల్యే, భువనగిరి

బీఆర్​ఎస్​ లీడర్ల కోసమే.. 

ప్రభుత్వ పెద్దలు, బీఆర్​ఎస్​ లీడర్ల ప్రయోజనాల కోసమే అలైన్​మెంట్​ మార్పించారు. ప్రజలు నష్టపోతున్నా ఎమ్మెల్యే ఫైల్​శేఖర్​రెడ్డి పట్టించుకోవడం లేదు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే సీఎం కేసీఆర్​ అపాయింట్​మెంట్​ తీసుకోవాలి.  బాధితులను తీసుకొని నేనూ వస్తాను.  అలైన్​మెంట్​ మార్చాలని సీఎం కేసీఆర్​తో ప్రధాని మోడీకి లెటర్​ రాయించు. మా పార్టీ లీడర్లతో ప్రధానిని కలిసి మార్పించుకుంటాం. 
–గూడూరు నారాయణ రెడ్డి, బీజేపీ స్టేట్​ లీడర్​