ట్రిపుల్ ఆర్ ల్యాండ్​కు.. రేటు పెంపు ప్రపోజల్స్

ట్రిపుల్ ఆర్ ల్యాండ్​కు..  రేటు పెంపు ప్రపోజల్స్
  • భువనగిరి మండల పరిధిలో​ అగ్రికల్చర్​కు రెండు నుంచి మూడు రెట్లు
  • ఖాళీ ప్లాట్లకు రెండు రెట్ల పెంపునకు ప్రపోజల్స్ రెడీ 
  • రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేత

యాదాద్రి, వెలుగు : రీజినల్​రింగ్​రోడ్డు(ట్రిపుల్​ఆర్​) ఉత్తర భాగం కోసం భూములు ఇస్తున్న భువనగిరి మండల రైతులకు ఊరట కలగనుంది. ట్రిపుల్ ఆర్ కోసం సేకరిస్తున్న అగ్రికల్చర్​ల్యాండ్​కు రేట్లు పెంచాలని ఆఫీసర్లు ప్రపోజల్స్​రెడీ చేశారు. అగ్రికల్చర్​ల్యాండ్​కు రెండు నుంచి మూడు రెట్లు, ఖాళీ ప్లాట్లకు రెండు రెట్లు రేటు పెంచాలని ఆఫీసర్లు ప్రపోజల్స్ సిద్ధం చేశారు. రెండు మూడు రోజుల్లో ఈ ప్రపోజల్స్ కు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు. 

భారత్​మాల పరియోజన ఫేస్​-–1లో భాగంగా రీజినల్​రింగ్​రోడ్డు (ట్రిపుల్​ఆర్​) ఉత్తర భాగం మెదక్‌‌‌‌, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల మీదుగా 164 కిలో మీటర్లు నిర్మాణం కానుంది. ఈ రోడ్డు నిర్మాణానికి భూ సేకరణ కోసం ఆయా జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలతో  8 'కాలా'లను ఏర్పాటు చేయడంతోపాటు త్రీ జీ నోటిఫికేషన్ ఇప్పటికే రిలీజ్ అయ్యింది. అయితే రింగ్ రోడ్డు కోసం భూములు కోల్పోతున్న రైతులకు మానవతా ధృక్పథంతో 'అవార్డు' మంచిగా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్​ రెడ్డి గతంలో అధికారులను ఆదేశించారు.

దీంతో రిజిస్ట్రేషన్​ విలువ పెంపుపై నాలుగు జిల్లాల ఆఫీసర్లు కసరత్తు చేసి ట్రిపుల్ ఆర్ కోసం సేకరించే భూముల సర్వే నంబర్లకు రేట్లు పెంచాలని ప్రపోజల్స్ చేశారు. ఈ ప్రపోజల్స్​ను పరిశీలించిన ప్రభుత్వం రెండు నుంచి మూడు రెట్లు పెంచుతూ గతంలోనే నిర్ణయం తీసుకుంది. యాదాద్రి జిల్లా భువనగిరి మండల రైతులు హైకోర్టును ఆశ్రయించడం వల్ల రేట్ల పెంపుపై అప్పట్లో నిర్ణయం తీసుకోలేదు. గత నెలలోనే హైకోర్టు కేసును కొట్టివేయడంతో రేట్లు పెంపు అంశంపై ఆఫీసర్లు కసరత్తు చేశారు.  

రేటులో భారీ తేడా..

ట్రిపుల్ ఆర్ కోసం భువనగిరి మండలంలో సేకరించే అగ్రికల్చర్ ల్యాండ్స్ ను అర్బన్, రూరల్, కమర్షియల్​ విభాగాలుగా విభజించారు. ప్రస్తుత రిజిస్ట్రేషన్​విలువను సబ్ రిజిస్టార్ల నుంచి సేకరించారు. దీంతోపాటు బహిరంగ మార్కెట్ రేటు​విలువ తెలుసుకున్నారు. భూమిని సేకరించే రాయగిరి పరిధిలో ఎకరానికి రూ.13.12 లక్షల నుంచి రూ.36.75 లక్షల వరకు రిజిస్ట్రేషన్ వ్యాల్యూ ఉంది. ఖాళీ ప్లాట్లకు గజానికి రూ.2,100 నుంచి రూ.3,200 వరకు ఉంది. కేసారం, ఎర్రంబెల్లి, తుక్కాపూర్, పెంచికలపహాడ్​, గౌస్​నగర్​లో ఎకరానికి 7.50 లక్షలకు పైగా ఉంది. 

Also Read :- వాతావరణంలో మార్పులు.. మామిడి పూత ఆలస్యం!

ఖాళీ ప్లాట్ల విషయానికి వస్తే గజానికి రూ.2,100 ఉంది. దీంతో రిజిస్ట్రేషన్ వ్యాల్యూ కంటే బహిరంగ మార్కెట్​లో భూముల ధర చాలా ఎక్కువగా ఉందని గుర్తించారు. బహిరంగ మార్కెట్​లో ఎకరానికి రూ.కోట్లు పలుకుతోంది. ఖాళీ ప్లాట్లకు సంబంధించి గజానికి రూ.10 వేల నుంచి రూ.30 వేలకుపైగా పలుకుతోంది. ఇదే విషయాన్ని పేర్కొంటూ ల్యాండ్​విలువ పెంపు విషయంలో ప్రపోజల్స్​ రెడీ చేశారు. 

అగ్రికల్చర్ ల్యాండ్​కు రెండు నుంచి మూడు రెట్లు..?

ట్రిపుల్ ఆర్ కోసం భూమిని కోల్పోతున్న వారికి 'అవార్డు' మంచిగా వచ్చేలా జిల్లా ఆఫీసర్లు ప్రపోజల్స్ రెడీ చేశారు. అగ్రికల్చర్​ల్యాండ్​కు రిజిస్ట్రేషన్​వ్యాల్యూ కంటే రెండు నుంచి మూడు రెట్లు పెంచాలని ప్రపోజ్​​ చేశారు. రాయగిరి పరిధిలో 215 సర్వే నంబర్ సహా పలు సర్వే నంబర్లలో ఎకరానికి రూ.13.12 లక్షలు ఉంది. 379 సర్వే నంబర్ సహా పలు నంబర్లలో రూ.29.40 లక్షలు ఉంది. 682 సహా పలు సర్వే నంబర్లలో రూ. 36.75 లక్షల వరకు రిజిస్ట్రేషన్​వ్యాల్యూ ఉంది. దీంతో రిజిస్ట్రేషన్​ వ్యాల్యూకు రెండు నుంచి మూడు రెట్లు రేటు పెంచాలని ప్రపోజల్ చేశారు. అదే ఖాళీ స్థలాల విషయానికి వస్తే రెండు రెట్లు పెంచాలని ప్రపోజ్ చేస్తూ రిపోర్ట్​ రెడీ చేసినట్టుగా సమాచారం. 

రెండు మూడు రోజుల్లో..

ట్రిపుల్​ఆర్ కోసం సేకరించే భూములకు రేటు పెంపు ప్రపోజల్స్ రెండు మూడు రోజుల్లో హయ్యర్​ఆఫీసర్లకు నివేదిక అందించనున్నారు. ఆఫీసర్లు సూచించిన రేట్లను ప్రభుత్వం ఆమోదించినా, కొంత మార్పులు చేర్పులు చేసినా భూమిని కోల్పోతున్న వారికి ఉపశమనంగా కలుగుతోంది. 

అయితే పెంపు ప్రపోజల్స్​ను ప్రభుత్వం ఆమోదించిన తర్వాత నేషనల్​హైవే అథారిటీకి పంపిస్తారు. అథారిటీ యథావిధిగా అమోదించినా. మార్పులు చేర్పులు చేసినా.. నిర్ణయించిన రేటుకు మున్సిపాలిటీ ప్రాంతాల్లో రెండు రెట్లు అవార్డు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు రెట్లు అవార్డు అందుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు.