ట్రిపుల్​ఆర్ ​అలైన్​మెంట్ మార్చాలి

యాదాద్రి, వెలుగు : ట్రిపుల్​ఆర్ ​అలైన్​మెంట్ మార్చాలని యాదాద్రి జిల్లా రాయగిరికి చెందిన వందల మంది బాధితులు సోమవారం కలెక్టరేట్​ను ముట్టడించారు. భూ సేకరణపై నోటిఫికేషన్​జారీ కాగా, ఇందులో రాయగిరికి చెందిన 70 మందికి సంబంధించిన 266 ఎకరాలు పోతున్నాయి. దీంతో ఆందోళన చెందిన రైతన్నలు భువనగిరి బైపాస్​ మీదుగా ర్యాలీగా వచ్చి యాదాద్రి కలెక్టరేట్​ను ముట్టడించారు. హైదరాబాద్​–వరంగల్​ రోడ్డుపై బైఠాయించారు.

బస్సులు నిలిచిపోవడంతో బైపాస్​మీదుగా పంపించేందుకు పోలీసులు ప్రయత్నించగా.. బాధితులు అడ్డుకున్నారు. దీంతో కలెక్టరేట్​గేటు వద్దే ఓ ఆర్టీసీ బస్సు నిలిచిపోయింది. పోలీసులు వారిని కలెక్టరేట్​లోపలికి వెళ్లనీయకపోవడంతో కలెక్టరే​బయటకు రావాలంటూ నినదించారు. కలెక్టర్​పమేలా సత్పతి ప్రజావాణిలో ఉన్నప్పటికీ లేరని చెప్పినా వినలేదు. చివరకు అడిషనల్​కలెక్టర్​శ్రీనివాసరెడ్డి అక్కడికి చేరుకొని మాట్లాడారు. రైతుల సమస్య గురించి ఉన్నతాధికారులకు వివరిస్తామని సముదాయించారు. బాధితుల నుంచి సహకారం అందే వరకూ సర్వే నిలిపి వేయిస్తామని హామీ ఇచ్చారు. తర్వాత బాధితుల తరపున ప్రతినిధుల బృందాన్ని కలెక్టర్​ ప్రజావాణి​ చాంబర్​కు పిలిపించుకొని వినతిపత్రాన్ని తీసుకుకున్నారు. 

కలెక్టరేట్​కు చౌటుప్పల్​ బాధితులు

రాస్తారోకో తర్వాత ట్రిపుల్​ఆర్​కారణంగా ఇండ్లు కోల్పోతున్నామని చౌటుప్పల్​ చెందిన బాధితులు కలెక్టరేట్​కు వచ్చారు. కలెక్టర్​ లేకపోవడంతో అడిషనల్​ కలెక్టర్​ శ్రీనివాసరెడ్డిని కలిసి 500 ఇండ్లను కోల్పోతున్నామని, అలైన్​మెంట్​మార్చాలని వినతిపత్రం ఇచ్చారు.  

ఫాం హౌస్​ పోతదనే అలైన్​మెంట్​ మార్పించిండు : ఎంపీ కోమటిరెడ్డి

నిజానికి ట్రిపుల్​ఆర్​ కేసీఆర్​ ఫాంహౌస్​ పక్క నుంచి రావాల్సి ఉండేదని, అది పోతుందనే అనైన్​మెంట్​మార్పించిండని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. భువనగిరికి వచ్చిన ఆయనను రాయగిరి బాధితులు కలిసి వినతి పత్రం ఇచ్చారు. తర్వాత భువనగిరి బైపాస్​పై రాస్తారోకో చేయగా ఎంపీ కోమటిరెడ్డి సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. ప్రభుత్వ భూములున్నచోటు నుంచి ట్రిపుల్​ఆర్​వెళ్లేలా చూడాలని డిమాండ్​ చేశారు. అలైన్​మెంట్​ మార్పు కోసం కేంద్ర మంత్రి నితిన్​గడ్కరీ, నేషనల్​హైవే ఆఫీర్లను కలిశానని చెప్పారు. అవసరమైతే బాధితులను ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రమంత్రితో కలిపిస్తానని అన్నారు. భూ సేకరణ కోసం ఆఫీసర్లు హద్దులు పాతితే వాటిని తొలగించాలని సూచించారు. బైపాస్​పై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో బాధితులు రాస్తారోకో విరమించి కలెక్టరేట్​వైపునకు ర్యాలీగా వెళ్లారు.