ట్రిపుల్ ​ఆర్ బాధితుల ఆందోళన ఉద్రిక్తం

  • కలెక్టరేట్​ ఎదుట గడ్డిమోపు దహనం
  • మంత్రి జగదీశ్​ రెడ్డి కాన్వాయ్​ని అడ్డుకునే యత్నం  
  • నిరసనకారుల అరెస్ట్​  

యాదాద్రి, వెలుగు : ట్రిపుల్ ఆర్​ బాధితుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. మంగళవారం కలెక్టరేట్​ఎదుట ఎండు గడ్డి మోపును దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై రివ్యూ నిర్వహించడానికి వచ్చిన మంత్రి జగదీశ్​రెడ్డి, ఎమ్మెల్యేల కార్లను అడ్డుకోవడానికి యత్నించారు. దీంతో పోలీసులు ఆందోళనకారులతో పాటు మద్దతుగా వచ్చిన బీజేపీ, కాంగ్రెస్​ లీడర్లను అరెస్ట్​ చేసి వివిధ పోలీస్​స్టేషన్లకు తరలించారు. యాదాద్రి జిల్లా మీదుగా వెళ్తున్న ట్రిపుల్​ఆర్​ వల్ల పలువురు రైతులు భూములు కోల్పోతున్నారు. గతంలో పలుమార్లు భూములు కోల్పోయినందున, ప్రస్తుత అలైన్​మెంట్​మార్చాలని ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా యాదాద్రి కలెక్టరేట్​వద్ద సోమవారం 48 గంటల ఆందోళన మొదలుపెట్టారు. మంగళవారం రెండో రోజు కూడా కొనసాగగా, తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ రివ్యూ కోసం యాదాద్రి కలెక్టరేట్​కు మంత్రి గుంటకండ్ల జగదీశ్​ రెడ్డి వచ్చారు. దీంతో తమను కలుస్తారని బాధితులు ఆశించారు. గంటలు గడిచినా అలాంటిదేమీ జరగకపోవడంతో అసహనానికి గురై అలైన్​మెంట్ ​మార్చాలని డిమాండ్​ చేస్తూ కలెక్టరేట్​లోకి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించారు. వీరికి మద్దతుగా బీజేపీ స్టేట్​ లీడర్​గూడూరు నారాయణరెడ్డి, కాంగ్రెస్​ లీడర్ ​తంగెళ్లపల్లి రవికుమార్​ ముందు నడిచారు. అయితే, యాదాద్రి డీసీపీ రాజేశ్​చంద్ర, పోలీసులు వీరిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే  సమయంలో కొందరు బాధితులు గడ్డిమోపు తెచ్చి కలెక్టరేట్​ఎదుట వేసి నిప్పు పెట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరికొందరు రాస్తారోకో చేశారు. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. మంత్రిని అడ్డుకుంటారనే ఉద్దేశంతో కలెక్టరేట్​లోని మరో రోడ్డు మీదుగా మంత్రి జగదీశ్​ రెడ్డి కాన్వాయ్​ను బయటకు పంపించారు. గమనించిన ఆందోళనకారులు అలైన్​మెంట్​ మార్చాలని నినాదాలు చేస్తూ కాన్వాయ్​ అడ్డుకోవడానికి దూసుకెళ్లారు. వెంటనే పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం బీజేపీ, కాంగ్రెస్​ లీడర్లు సహా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్​ చేసి జిల్లాలోని వివిధ పోలీస్​ స్టేషన్లకు తరలించారు.