- సూర్యాపేట జిల్లా త్రిపురవరం ప్రజాప్రతినిధి తీవ్ర నిర్ణయం
- ఎమ్మెల్యే, పార్టీ మండల అధ్యక్షుడి తీరుకు నిరసనగానే..
కోదాడ, వెలుగు : బీఆర్‌ఎస్ పార్టీలో బీసీలకు రూ.లక్ష సాయం చిచ్చు రేపింది. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తాను చెప్పిన వాళ్లకు రూ.లక్ష సాయం ఇవ్వలేదని సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం త్రిపురవరం ఎంపీటీసీ కొత్త జానకి తన పదవికి రాజీనామా చేశారు. రిజైన్ లెటర్‌ను శుక్రవారం ఎంపీడీవోకు పంపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీసీలకు ఆర్థిక సాయానికి సంబంధించి పేర్లు ఇవ్వాలని తనకు ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఫోన్లు వచ్చాయని తెలిపారు.
పార్టీ మండల అధ్యక్షుడు కూడా తనను పేర్లు ఇవ్వాలని కోరితే ఎన్నికల్లో కష్టపడి పని చేసిన వారి పేర్లు ఇచ్చానన్నారు. అయితే, తాను సూచించిన వారికి కాకుండా ఇతరులకు ఇవ్వడంతో మనస్తాపంతో రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. కాగా, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, పార్టీ మండల అధ్యక్షుడు గింజూపల్లి రమేశ్ తీరుకు నిరసనగా శుక్రవారం కోదాడలో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి పలువురు ప్రతినిధులు హాజరు కాలేదు.