అండర్‌‌‌‌‌‌‌‌-19 టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో చరిత్ర సృష్టించిన తెలంగాణ బిడ్డ

అండర్‌‌‌‌‌‌‌‌-19 టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో చరిత్ర సృష్టించిన తెలంగాణ బిడ్డ

తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష షాన్‌దార్ ఆటతో అండర్ 19 విమెన్స్ టీ20 వరల్డ్ కప్‌‌‌‌లో  పరుగుల తుఫాన్‌‌‌‌ సృష్టించింది. స్కాట్లాండ్‌‌‌‌పై  మెరుపు సెంచరీతో అదరగొట్టింది. ఈ టోర్నీలో  సెంచరీ కొట్టిన తొలి క్రికెటర్‌‌‌‌‌‌‌‌గా వరల్డ్ రికార్డు సృష్టించింది.  బౌలింగ్‌‌‌‌లోనూ రాణించిన త్రిష మూడు వికెట్లు పడగొట్టడంతో మెగా టోర్నీలో వరుసగా ఐదో విక్టరీ సాధించిన ఇండియా అజేయంగా సెమీఫైనల్లో అడుగు పెట్టింది. 

కౌలాలంపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌:  విమెన్స్‌‌‌‌‌‌‌‌ అండర్‌‌‌‌‌‌‌‌–19 టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో ఇండియా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. గొంగడి త్రిష (59 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 13 ఫోర్లు, 4 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 110 నాటౌట్‌‌‌‌‌‌‌‌) రికార్డు సెంచరీతో చెలరేగడంతో..మంగళవారం జరిగిన సూపర్‌‌‌‌‌‌‌‌–6 రెండో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో టీమిండియా 150 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో స్కాట్లాండ్‌‌‌‌‌‌‌‌ను చిత్తు చేసి సెమీస్‌‌‌‌‌‌‌‌లోకి దూసుకెళ్లింది. టాస్‌‌‌‌‌‌‌‌ ఓడిన ఇండియా 20 ఓవర్లలో 208/1 స్కోరు చేసింది. స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌ నుంచే స్కాట్లాండ్‌‌‌‌‌‌‌‌ బౌలర్లపై విరుచుకుపడిన త్రిష ఫోర్లు, సిక్సర్లతో బెంబెలేత్తించింది. రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌లో కమలిని (51) కూడా బ్యాట్‌‌‌‌‌‌‌‌ ఝుళిపించడంతో పరుగుల వరద పారింది. ఈ ఇద్దరు తొలి వికెట్‌‌‌‌‌‌‌‌కు 13.3 ఓవర్లలోనే 147 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించారు. ఈ దశలో కమలిని ఔటైనా.. త్రిష ఎక్కడా తగ్గలేదు. వన్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌లో సానిక చాల్కే (20 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లతో 29 నాటౌట్‌‌‌‌‌‌‌‌) కూడా మెరుపు బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకుంది. ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ చివరి వరకు క్రీజులో నిలిచిన త్రిష.. అండర్‌‌‌‌‌‌‌‌–19 టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. త్రిష, సానిక రెండో వికెట్‌‌‌‌‌‌‌‌కు 61 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించడంతో ఇండియా భారీ టార్గెట్‌‌‌‌‌‌‌‌ను నిర్దేశించింది.

బౌలర్‌‌‌‌‌‌‌‌గా మూడు వికెట్లు..

భారీ టార్గెట్‌‌‌‌‌‌‌‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్‌‌‌‌‌‌‌‌ 14 ఓవర్లలో 48 రన్స్‌‌‌‌‌‌‌‌కే కుప్పకూలింది. బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో మెరిసిన త్రిష (3/6) బౌలింగ్‌‌‌‌‌‌‌‌లోనూ మూడు వికెట్లు తీసింది. పిపా కెల్లీ (12), ఎమ్మా వాల్సింగమ్‌‌‌‌‌‌‌‌ (12) టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్లు. ఆరంభం నుంచే ఇండియా బౌలర్లు సమయోచితంగా చెలరేగారు. లెఫ్టార్మ్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ ఆయుషి శుక్లా (4/8), వైష్ణవి శర్మ (3/5) టర్నింగ్‌‌‌‌‌‌‌‌ బాల్స్‌‌‌‌‌‌‌‌ను ఎదుర్కోలేక స్కాట్లాండ్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్లు పెవిలియన్‌‌‌‌‌‌‌‌కు క్యూ కట్టారు. పిపా స్ప్రాల్‌‌‌‌‌‌‌‌ (11), నైమా షేక్‌‌‌‌‌‌‌‌ (10 నాటౌట్‌‌‌‌‌‌‌‌) కూడా విఫలమయ్యారు. ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో ఏడుగురు సింగిల్‌‌‌‌‌‌‌‌ డిజిట్‌‌‌‌‌‌‌‌కే పరిమితం కావడంతో స్కాట్లాండ్ ఏ దశలోనూ కోలుకోలేదు. త్రిషకు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. శుక్రవారం జరిగే సెమీస్‌‌‌‌‌‌‌‌లో ఇండియా..  ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో తలపడుతుంది.

సంక్షిప్త స్కోర్లు
ఇండియా: 20 ఓవర్లలో 208/1 (త్రిష 110*). స్కాట్లాండ్‌‌‌‌: 14 ఓవర్లలో 48 ఆలౌట్‌‌‌‌ (ఎమ్మా 12, ఆయుషి 4/8).

మన ఆణిముత్యం

ఇండియా విమెన్స్ క్రికెట్‌‌‌‌లో  ఓ వెలుగు వెలిగిన క్రికెటర్ మిథాలీ రాజ్‌‌‌‌. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఆటలో అడుగు పెట్టిన తెలంగాణ మరో ఆణిముత్యం గొంగడి త్రిష.  కొన్నేండ్లుగా దేశవాళీ టోర్నీలతో పాటు ఇండియా జూనియర్‌‌‌‌‌‌‌‌ టీమ్స్ తరఫున ఇంటర్నేషనల్ టోర్నీల్లోనూ పరుగుల మోత మోగిస్తోంది.  తన ప్రతిభతో ఇప్పటికే మరో మిథాలీ అవుతోందంటూ  పేరు తెచ్చుకుంది. ఇప్పుడు అండర్‌‌‌‌‌‌‌‌19 టీ20 వరల్డ్ కప్‌‌‌‌లో హిస్టారిక్ సెంచరీతో ఇంటర్నేషనల్ లెవెల్‌‌‌‌లోనూ తన పేరు మార్మోగేలా చేసుకుంది. త్రిష స్వస్థలం భద్రాచలం. పసిప్రాయంలోనే క్రికెట్‌‌‌‌పై ఆసక్తి పెంచుకున్న ఆమెను తండ్రి  రామిరెడ్డి ప్రోత్సహించాడు. ఫిట్‌‌‌‌నెస్ ట్రైనర్ అయిన రామిరెడ్డి తన కూతురుకు మెరుగైన కోచింగ్ ఇప్పించేందుకు తన ఉద్యోగాన్ని వదిలేసి హైదరాబాద్‌‌‌‌కు మకాం మార్చారు.  తండ్రి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయని త్రిష ఏజ్ గ్రూప్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ నుంచి స్టేట్‌‌‌‌, జోనల్ టోర్నీల్లో సత్తా చాటుతూ ఇండియా అండర్‌‌‌‌‌‌‌‌19 టీమ్‌‌‌‌లోకి వచ్చింది. రెండేండ్ల కిందట జరిగిన అండర్‌‌‌‌‌‌‌‌19 టీ20 వరల్డ్ కప్‌‌‌‌ నెగ్గిన ఇండియా టీమ్‌‌‌‌లోనూ త్రిష మెంబర్. టన్నుల కొద్దీ టాలెంట్‌‌‌‌.. సాధించాలనే తపన నిండుగా ఉన్న త్రిష  టాపార్డర్‌‌‌‌‌‌‌‌, మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌లో ఎక్కడైనా ఆడగలదు. మంచి టెక్నిక్‌‌‌‌తో అలవోకగా భారీ షాట్లు కొట్టే సత్తా ఉన్న తెలంగాణ అమ్మాయి పరిస్థితులకు తగ్గట్టుగా తన ఆటను మార్చుకుంటుంది.  లెగ్ స్పిన్‌‌‌‌తోనూ మ్యాజిక్ చేయగలదు. గత వరల్డ్ కప్‌‌‌‌ తర్వాత ఇండియా సీనియర్ టీమ్‌‌‌‌లో తనకు చోటు దక్కుతుందని  త్రిష ఆశించింది. కానీ, సీనియర్ టీమ్‌‌‌‌ నుంచి పిలుపు రాలేదు. విమెన్స్‌‌‌‌ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్‌‌‌‌)లోనూ ఆమెకు అవకాశం లభించలేదు. 

అదే సమయంలో గాయాలు కూడా ఎదురయ్యాయి. అయినా, ఎప్పుడూ ఆత్మవిశ్వాసం కోల్పోని త్రిష కఠోరంగా శ్రమించింది.  అవకాశం వచ్చిన ప్రతీసారి తన ప్రతిభను చాటుకుంటూ ముందుకొస్తోంది. ఈ క్రమంలో  కౌలాలంపూర్‌‌‌‌‌‌‌‌లో ఇటీవలే జరిగిన అండర్‌‌‌‌‌‌‌‌19 విమెన్స్ టీ20 ఆసియా కప్‌‌‌‌లోనూ త్రిష దుమ్మురేపింది. రెండు ఫిఫ్టీలు సహా 152 రన్స్‌‌‌‌తో టాప్ స్కోరర్‌‌‌‌‌‌‌‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు గెలిచింది. ఫైనల్లో తోటి ప్లేయర్లంతా నిరాశపరిచినా తాను మాత్రం అద్భుతంగా ఆడి ఫిఫ్టీతో జట్టుకు ట్రోఫీ అందించింది. అదే ఫామ్‌‌‌‌ను తాజా వరల్డ్ కప్‌‌‌‌లోనూ కొనసాగిస్తున్న త్రిష ఐదు ఇన్నింగ్స్‌‌‌‌ల్లోనే  ఇప్పటికే 230 రన్స్‌‌‌‌ చేసింది. గత రెండు మ్యాచ్‌‌‌‌ల్లో బంగ్లాదేశ్‌‌‌‌, శ్రీలంకపై 40, 49 స్కోర్లు చేసి మెప్పించింది. ఇప్పుడు ఈ టోర్నీ చరిత్రలోనే తొలి సెంచరీ కొట్టి  ఇండియా సీనియర్ టీమ్‌‌‌‌కు ఆడే అన్ని అర్హతలూ తనలో ఉన్నాయని మరోసారి నిరూపించుకుంది. తను ఇండియాకు మరో కప్పు అందించాలని, తొందర్లోనే నేషనల్ టీమ్‌‌‌‌లోకి రావాలని ఆశిద్దాం.