కౌలాలంపూర్: వరుసగా రెండోసారి అండర్19 విమెన్స్ టీ20 వరల్డ్ కప్ విన్నర్ ఇండియా టీమ్‌లో నలుగురు ప్లేయర్లు ఐసీసీ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్‌లో చోటు దక్కించుకున్నారు. మెగా టోర్నీలో రాణించిన ప్లేయర్లతో ఐసీసీ సోమవారం ఈ టీమ్‌ను ప్రకటించింది. సూపర్ పెర్ఫామెన్స్‌తో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు అందుకున్న తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిషతో పాటు ఓపెనర్ జి. కమలిని, లెఫ్టార్మ్ స్పిన్నర్లు వైష్ణవి శర్మ, ఆయుషి శుక్లాను ఈ టీమ్‌కు ఎంపిక చేసినట్టు వెల్లడించింది.
త్రిష 309 రన్స్‌తో పాటు ఏడు వికెట్లతో అదరగొట్టగా.. కమలిని 143 రన్స్ చేసింది. వైష్ణవి 17 వికెట్లు పడగొట్టగా.. ఆయుషి 14 వికెట్లతో మెరిసింది. ఫైనల్లో ఓడిన సౌతాఫ్రికా నుంచి జెమ్మా బోథా, కైలా రేనెకే, ఇంగ్లండ్ ప్లేయర్లు డెవినా పెర్రిన్, కేటీ జోన్స్, ఆస్ట్రేలియా నుంచి కయోమ్హె బ్రే ఈ జట్టుకు ఎంపికయ్యారు. చమోది ప్రబోద (శ్రీలంక), పూజా మహతో (నేపాల్) కూడా చోటు ద క్కించుకున్నారు. సౌతాఫ్రికా సారథి రేనెకేను ఈ టీమ్‌కు కెప్టెన్‌గా ఐసీసీ
ప్రకటించింది.