ఈ నెల 30న ‘రాంగి’ విడుదల

ఈ నెల 30న ‘రాంగి’ విడుదల

త్రిష హీరోయిన్​గా పరిచయమై ఇటీవలే ఇరవై ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అభిమానులు అందరికీ థ్యాంక్స్ చెప్పిందామె. ఇలా ఇరవై ఏళ్లపాటు స్టార్‌‌‌‌ హీరోయిన్‌‌గా కొనసాగుతుండటం అంత ఈజీ కాదు. ఆ మధ్య కొంత క్రేజ్ తగ్గినట్టు అనిపించినా.. ఇటీవల విడుదలైన ‘పొన్నియిన్‌‌ సెల్వన్‌‌’తో మళ్లీ ఫామ్‌‌లోకి వచ్చేసింది. ఈ సక్సెస్‌‌ను క్యాష్‌‌ చేసుకునేలా.. త్రిష నటించిన లేడీ ఓరియెంటెడ్‌‌ మూవీ ‘రాంగి’ రిలీజ్‌‌కు రెడీ అవుతోంది.

‘జర్నీ’ ఫేమ్ శరవణన్ దీనికి దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. మూడేళ్ళ క్రితమే షూటింగ్ పూర్తయింది. ట్రైలర్ కూడా అప్పుడే రిలీజ్ చేశారు. కానీ కరోనాతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు మూవీ రిలీజ్‌‌ డేట్‌‌ను అనౌన్స్ చేశారు. డిసెంబర్‌‌‌‌ 30న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ యాక్షన్ ఎంటర్‌‌‌‌ టైనర్‌‌‌‌కు స్డార్ డైరెక్టర్ మురుగదాస్‌‌ కథను అందించాడు. త్రిష చేసిన ఫైట్స్ సినిమాకు హైలైట్‌‌ అవుతాయంటున్నారు మేకర్స్. ఇక ప్రస్తుతం మోహన్‌‌లాల్‌‌కు జంటగా ‘రామ్‌‌’ అనే మలయాళ చిత్రంలో ఆమె నటిస్తోంది. అలాగే ‘ది రోడ్‌‌’ అనే లేడీ ఓరియెంటెడ్‌‌ మూవీ కూడా చేస్తోంది. విజయ్‌‌తో లోకేష్‌‌ కనకరాజ్‌‌ తీస్తున్న చిత్రంలో హీరోయిన్‌‌గా త్రిష పేరు వినిపిస్తోంది.