
జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీకి మెట్రో రైల్‌కు బదులుగా ట్రామ్ వేను పరిశీలిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ట్రామ్ వేతోపాటు ఎలివేటెడ్ బీఆర్‌టీఎస్ వ్యవస్థ కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉందని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బుధవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు
అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ జవాబు చెప్పారు. హైదరాబాద్‌ను గ్లోబల్‌సి టీగా డెవలప్ చేసేందుకు బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లు కేటాయించారని, అందులో ఎక్కువ మొత్తాన్ని పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ కోసమే వినియోగిస్తామని అన్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు త్వరలోనే 5 కి.మీ.ల మెట్రో కారిడార్ పనులు చేపడుతామని కేటీఆర్ తెలిపారు.
ఈ రూట్లో 93 మతపరమైన ప్రార్థనా మందిరాలు, సమస్యాత్మక కట్టడాలు ఉన్నాయని, రోడ్ల విస్తరణ, మెట్రో ఫిల్లర్లు, ఇతర నిర్మాణాలతో 18 స్ట్రక్చర్లు ప్రభావితం అవుతున్నాయని చెప్పారు. దీనిపై త్వరలోనే అందరు నాయకులను పిలిచి మాట్లాడి, వాటి పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపడుతామన్నారు . రోజుకు మెట్రోలో 4 లక్షల మంది ప్రయాణిస్తున్నారని, మెట్రో ప్రయాణికులకు మంత్లీ పాసెస్ ఇవ్వా లని ఇప్పటికే ఎల్ అండ్ టీ అధికారులకు సూచించామన్నారు. మెట్రో రైళ్లను రాత్రి 11 గంటల వరకు నడపాలని కోరుతున్నారని, త్వరలోనే టైం పొడిగిస్తామని చెప్పారు. శంషాబాద్ మెట్రో కారిడార్ డీపీఆర్ పరిశీలనలో ఉందని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్ చెప్పారు.