సమ్మక్క సారలమ్మ మహాజాతర కోసం మేడారంలో ప్రభుత్వం రూ.105 కోట్లతో భక్తులకు సౌలత్లు కల్పిస్తున్నది. గిరిజన సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం ప్రతి రెండేండ్లకోసారి నిర్వహించే జాతరకు మరో రెండు వారాలే గడువు ఉండటంతో సర్కారు ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఫిబ్రవరి21 నుంచి 24వ తేదీ వరకు జరిగే జాతరకు కోటిన్నర వరకు భక్తులు వస్తారని అంచనా. ఈ మేరకు సోమవారం రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాగా మేడారం మహాజాతర రూట్‌మ్యాప్‌ను ములుగు జిల్లా పోలీసులు రెడీ చేశారు. జాతర సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.
వేర్వేరు మార్గాల్లో పార్కింగ్
మేడారం మహాజాతర రూట్‌మ్యాప్‌ను ములుగు జిల్లా పోలీసులు రెడీ చేశారు. జాతర సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. జాతరకొచ్చే వాహనాలను పార్కింగ్ చేయడానికి వీలుగా ములుగు ఎస్పీ శబరీశ్‌ఆధ్వర్యంలో పోలీస్ శాఖ 1,462 ఎకరాల్లో 33 పార్కింగ్ ప్లేస్‌లు ఏర్పాటు చేసింది. వీఐపీ, వీవీఐపీ, ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్ ప్లేస్‌లు ఇచ్చారు. పస్రా‒ మేడారం, భూపాలపల్లి‒ మేడారం, తాడ్వాయి‒మేడారం, ఏటూరునాగారం‒మేడారం మార్గాల్లో ఈ పార్కింగ్ స్థలాలు చదును చేశారు. అక్కడ ఇన్, ఔట్‌లెట్లు, కరెంట్, తాగునీరు, మరుగుదొడ్ల వసతి కల్పిస్తున్నారు.