
- సీఫుడ్, జ్యూయలరీ, కార్పెట్స్ వంటి రంగాలకు ఇబ్బందులు
- ఫార్మా, చిప్స్, రాగి, చమురుకు మినహాయింపు
న్యూఢిల్లీ: అమెరికా సుంకాల మోత మోగించింది. మనదేశం నుంచి అక్కడికి ఎగుమతి అయ్యే అన్ని వస్తువులపై 27 శాతం మేర అదనపు సుంకాలు విధిస్తామని ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. దీనివల్ల రొయ్యలు, కార్పెట్లు, వైద్య పరికరాలు, బంగారు ఆభరణాలు, డెయిరీ, ఐటీ వంటి ఎగుమతి రంగాలకు నష్టాలు వస్తాయని అధికారులు తెలిపారు. ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఫార్మా వంటి ఎగుమతి విభాగాలపై పెద్దగా ఎఫెక్ట్ ఉండదని, పైగా మేలు జరగవచ్చని చెప్పారు.
దేశీయ రొయ్యల పరిశ్రమకు అమెరికా అతిపెద్ద మార్కెట్. అధిక సుంకాల కారణంగా రొయ్యల వ్యాపారులకు అమెరికా మార్కెట్లో తీవ్రపోటీ ఏర్పడుతుంది. ధరలు పెరుగుతాయి. భారతీయ రొయ్యలపై అమెరికా ఇప్పటికే యాంటీ- డంపింగ్ కౌంటర్ సుంకాలను విధించింది. 2023–-24లో అమెరికా 7,16,004 టన్నుల రొయ్యలు దిగుమతి చేసుకుంది.
భారతదేశం నుంచి కార్పెట్ల దిగుమతిలో అమెరికా అతిపెద్దది. 2023–-24లో ఇది సుమారు రెండు బిలియన్ డాలర్ల విలువైన కార్పెట్లను కొంది. సుంకాల వల్ల ఈ సెక్టార్ కంపెనీలకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. 2023–-2024లో భారత్ 32.85 బిలియన్ డాలర్ల విలువైన రత్నాలను, ఆభరణాలను ఎగుమతి చేయగా, వీటి అమెరికా వాటా 30.28 శాతం ఉంది.
2024లో మనదేశం నుంచి 11.88 బిలియన్ డాలర్ల విలువైన వజ్రాలు, బంగారం వెండిని ఎగుమతి చేసింది. కామా జ్యువెలరీ ఎండీ కోలిన్ షా మాట్లాడుతూ, అమెరికా ప్రతీకార సుంకాలను ప్రకటించడం భారతదేశానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుందన్నారు. రత్నాలు, ఆభరణాల రంగం అత్యధికంగా ప్రభావితమవుతుందని స్పష్టం చేశారు. అమెరికాకు వైద్య పరికరాల ఎగుమతులపై 27 శాతం ప్రతీకార సుంకం విధించడం వల్ల ఈ రంగం వృద్ధికి సవాళ్లు ఎదురవుతాయని అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైస్ ఇండస్ట్రీ తెలిపింది.
2023–-24లో అమెరికాకు ఇండియా నుంచి వైద్య పరికరాల ఎగుమతులు 714.38 మిలియన్ డాలర్లు కాగా అమెరికా నుంచి భారతదేశానికి దిగుమతుల విలువ 1.52 బిలియన్ డాలర్లే ఉంది. వెన్న, నెయ్యి వంటి డెయిరీ ప్రొడక్టులపై సుంకాలు 38.23 శాతానికి చేరుకోవడంతో అమెరికా మార్కెట్లో ధరలు పెరిగి కొనుగోళ్లు తగ్గే అవకాశాలు ఉంటాయి. సుంకాల వల్ల అమెరికా కంపెనీలు ఐటీ ఖర్చులు తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. ఇదే జరిగితే భారతీయ ఐటీ కంపెనీలకు నష్టం తప్పకపోవచ్చు.
దుస్తుల పరిశ్రమకు మేలు
ఇండియాతోపాటు చైనా, బంగ్లాదేశ్, వియత్నాం, కంబోడియా, శ్రీలంక అమెరికాకు భారీ ఎత్తున దుస్తులను ఎగుమతి చేస్తాయి. ఇండియా కంటే ఈ ఐదు దేశాలపై టారిఫ్‌లు ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల మనదేశ దుస్తుల పరిశ్రమకు మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని అపెరల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ మిథిలేశ్వర్ ఠాకూర్ అన్నారు. భారతీయ దుస్తుల ఎగుమతులలో అమెరికా వాటా సుమారు 35 శాతం అని అన్నారు. గత ఏడాది అమెరికాకు ఇండియా నుంచి 5.2 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి.
ఫార్మాకు ఊరట
అమెరికా ప్రభుత్వం ఫార్మా సెక్టార్‌ను ప్రతీకార సుంకాల నుంచి మినహాయించింది. అమెరికాకు మనదేశం నుంచి ఏటా తొమ్మిది బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. భారతీయ కంపెనీల మందుల వల్ల 2022లో అమెరికా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు 219 బిలియన్ డాలర్లు ఆదా అయ్యాయి. 2013–2022 మధ్య మొత్తం 1.3 ట్రిలియన్ డాలర్లు మిగిలాయి. ప్రస్తుతం అమెరికాలో భారతీయ ఫార్మాస్యూటికల్స్‌పై దిగుమతి సుంకం లేదు. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–-జనవరిలో ఎగుమతులు 7.84 శాతం పెరిగి 24.3 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
ఆటో కంపెనీలకూ ఆనందమే
కెనడా, మెక్సికోలలో ఫ్యాక్టరీలు ఉన్న భారతీయ ఆటోమొబైల్ విడిభాగాల తయారీదారులకు టారిఫ్ వార్వల్ల నష్టం జరగదని ఎక్స్పర్టులు చెబుతున్నారు. ఈ రెండు దేశాలకు అదనపు సుంకాల నుంచి మినహాయింపు లభించింది. అయితే మనదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వెహికల్స్, విడిభాగాలపై సుంకాలు వర్తిస్తాయి.
జీడీపీకి అర శాతం వరకు నష్టం
ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన ప్రతీకార సుంకాల వలన భారతదేశ జీడీపీ వృద్ధి రేటు 50 బేసిస్ పాయింట్లు (అర శాతం) తగ్గి 6 శాతానికి పడిపోయే అవకాశం ఉందని ఎర్నెస్ట్ అండ్ యంగ్ కన్సల్టెన్సీ తెలిపింది. భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు 0.5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారతదేశ ఎగుమతులు 2–-3 శాతం తగ్గుతాయని పేర్కొంది.
స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ మాత్రం జీడీపీ 40 బేసిస్ పాయింట్లు మాత్రమే తగ్గుతుందని తెలిపింది. మోర్గాన్ స్టాన్లీ ఆర్థికవేత్తలు 2026 ఆర్ధిక సంవత్సరం జీడీపీ 6.5 శాతం నుంచి 30-60 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. అమెరికా నుంచి ముడి చమురు, గ్యాస్, విమానాలు, న్యూక్లియర్ రియాక్టర్లు, రక్షణ ఉత్పత్తుల దిగుమతిని పెంచడం ద్వారా వాణిజ్య మిగులును తగ్గించాలని ఎననామిస్టు డీకే శ్రీవాస్తవ సూచించారు.