- సీఎం హామీ ఇచ్చి నాలుగేళ్లవుతున్నా ప్రారంభం కాని పనులు
- జగిత్యాలలో ఐదు లిఫ్ట్‌ల ఏర్పాటుకు నివేదిక
- వరద కాల్వ ఉన్నా ఎండిపోతున్న చెరువులు
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాలో 60 కిలోమీటర్ల పొడవునా ఎస్సారెస్పీ కాల్వ ఉన్నా పొలాలకు మాత్రం నీరందడం లేదు. వరద కాల్వకు ఎత్తున ఉన్న గ్రామాలకు ఎత్తిపోతల ద్వారా నీళ్లందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించి నాలుగేళ్లు గడుస్తున్నా పనులు నేటికీ షురూ కాలేదు. జిల్లాలో ఎస్సారెస్పీ కాల్వ ఇబ్రహీంపట్నం మండలం మీదుగా ప్రారంభమై మెట్పల్లి, కథలాపూర్, మేడిపల్లి, మల్యాలలో సుమారు 60 కి.మీ. మేర ఉంది. మేడిపల్లి, కథలాపూర్, మల్యాలలోని చాలా గ్రామాలకు వరద కాల్వ నీళ్లు అందేవి కావు. కాల్వకు లిఫ్ట్‌లు ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లోని చెరువులను నింపాలని రైతులు, ప్రజాప్రతినిధులు ఏండ్లుగా కోరుతున్నారు. 2019 జనవరి 2న సీఎం కేసీఆర్జిల్లా పర్యటన సందర్భంగా లిఫ్ట్ఇరిగేషన్ద్వారా రైతులకు నీరందించాలని ఆదేశించారు. దాంతో ఇంజనీరింగ్ ఆఫీసర్లు కథలాపూర్ మండలంలో రెండు లిఫ్ట్ లు, మేడిపల్లి మండలంలో ఒక లిఫ్ట్, మల్యాల మండలంలో రెండు లిఫ్ట్ లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్లాన్రూపొందించారు. జిల్లాలోని మూడు మండలాల్లో ఐదు లిఫ్ట్ ల ద్వారా 60 వేల ఎకరాలకు సాగు నీరందించేలా నివేదిక తయారు చేసి మూడేండ్ల క్రితం ఉన్నతాధికారులకు పంపించారు. కానీ నేటికీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో రైతులు నిరాశ చెందుతున్నారు.
కాగితాలకే పరిమితమైన పనులు
2006లో ఎల్లంపల్లి ఎత్తి పోతల ప్రాజెక్ట్ కింద స్టేజ్ 2 ఫేజ్1లో 95 వేల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి కథలాపూర్ కలికోట సూరమ్మ చెరువు వరకు కాల్వల నిర్మాణానికి నిర్ణయించారు. రూ. 1,737 కోట్లు మంజూరు చేసి భూ సేకరణ పూర్తి చేశారు. 2009లో కథలాపూర్, మేడిపల్లి మండలంలో 46 వేల ఎకరాలకు నీరందించేదుకు స్టేజ్ 2 ఫేజ్2లో ప్యాకేజీ డిజైన్ చేశారు. కానీ అప్పటి సీఎం వైఎస్ మృతితో ప్రాజెక్ట్ ఆగిపోయింది. సాగు నీటికి ఇబ్బందిగా మారడంతో రైతులు నిరసనలు, ధర్నాలకు దిగారు. దీంతో 2018 జూన్ 22న అప్పటి ఇరిగేషన్ మినిస్టర్ హరీశ్‌రావు రూ. 204 కోట్లతో సూరమ్మ చెరువును రిజర్వాయర్ గా మారుస్తామని ప్రకటించారు. పనులకు శంకుస్థాపన చేశారు. నాలుగు నెలల్లో పనులు పూర్తి చేస్తామని, దసరాకు రిజర్వాయర్ ప్రారంభిస్తామని చెప్పారు. మంత్రి హామీ ఇచ్చి నాలుగేళ్లు దాటినా కుడి, ఎడమ కాల్వ పనులు ప్రారంభించలేదు. మరో వైపు సీఎం వరద కాల్వకు ఐదు లిఫ్ట్ లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఏళ్లు గడిచినా ఒక్క అడుగు ముందుకు పడకపోవడంతో ప్రతిపక్ష నేతలు ప్రతి నెల 22న నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.
వెంటనే పనులు చేపట్టాలి
దశాబ్ద కాలంగా రైతులు సాగు నీటి కోసం ఎదురు చూస్తున్నారు. సీఎం కేసీఆర్ నాలుగేళ్ల క్రితం ఇచ్చిన హామీ మర్చిపోయారు. సుమారు మూడేళ్ల క్రితం ఆఫీసర్లు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. కానీ రైతు ప్రభుత్వమని చెప్పుకొనే కేసీఆర్ మాత్రం స్పందిస్తలేడు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసి పనులు చేపట్టాలి.
- తుల ఉమా, మాజీ జడ్పీ చైర్ పర్సన్, బీజేపీ సీనియర్ నాయకులు, జగిత్యాల
ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు కుడి, ఎడమ కాల్వలతో పాటు లిఫ్ట్ ఏర్పాటుకు రూ. 75.33 కోట్లకు ఎస్టిమేట్ వేసి ప్రభుత్వానికి నివేదించాం. ఫండ్స్మంజూరు కాగానే పనులు మొదలుపెడతాం.
- శ్రీనివాస్, ఇరిగేషన్ డీఈ