- అకాల వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల్లో చేరిన వరద నీళ్లు
- ముంపు ప్రాంతాలపై దృష్టి పెట్టని అధికారులు
- ముందస్తు యాక్షన్ ప్లాన్ లేక ఇబ్బందులు
- మేల్కోనకపోతే వానకాలంలో తిప్పలు తప్పవు
హనుమకొండ, వెలుగు : అకాల వర్షాలు దంచి కొడుతుండటంతో వరంగల్ నగరంలోని లోతట్టు ప్రాంతాలకు ముంపు భయం పట్టుకుంది. ఏటా వర్షాకాలంలో ముంపు సమస్య ఏర్పడుతుండగా, ఇప్పుడు అకాల వర్షాలకు కూడా వరద నీళ్లు కాలనీలను ముంచెత్తుతున్నాయి. దీంతో అక్కడి జనాలు ఇండ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. కాలనీల్లోకి చేరే వరద నీళ్లు బయటకు వెళ్లే మార్గం లేకపోవడం ప్రధాన సమస్య కాగా, పరిష్కారం చూపాల్సిన అధికారులు లైట్ తీసుకుంటున్నారు. ఏటా ఇదే సమస్య ఎదురవుతున్నా పాలకులు పట్టించుకోకపోగా, ఫిర్యాదు చేసినా అధికారులు కనీస చర్యలు తీసుకోవడంలేదని లోతట్టు ప్రాంతాల జనాలు వాపోతున్నారు.
అకాల వర్షాలకు కాలనీలు ఆగమాగం..
వరంగల్ నగరంలో 2016, 2020లో కురిసిన వర్షాలు పెద్దఎత్తున నష్టాన్ని కలిగించాయి. వందల కాలనీలు నీట మునిగి, రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. ముంపు ప్రాంతాల ప్రజల కోసం గ్రేటర్ వరంగల్ అధికారులు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టారు. ఆ తర్వాత వరంగల్ ట్రై సిటీలో లోతట్టు ప్రాంతాలను గుర్తించారు. ఈ మేరకు వరంగల్ కాశీబుగ్గ సర్కిల్ పరిధిలో 52, కాజీపేట సర్కిల్ పరిధిలో 86 మొత్తం 138 లోతట్టు ప్రాంతాలను ఐడెంటిఫై చేసి, అవసరమైన చోట డ్రైన్లు, కల్వర్టులు నిర్మించేందుకు ప్రణాళికలు రచించారు.
కానీ, ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. రెండు రోజులుగా వర్షాలు దంచి కొడుతుండటంతో లోతట్టు ప్రాంతాలైన వరంగల్ ఎనుమాముల ఎస్ఆర్ నగర్, సాయి గణేశ్ కాలనీ, లక్ష్మీ గణపతి కాలనీ, మధురా నగర్, వివేకానంద కాలనీ తదితర ఏరియాలు జలమయమయ్యాయి. కాలనీలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఎనుమాముల సమీపంలో వరద నీటిని మళ్లించేందుకు డక్ట్ నిర్మాణ పనులు చేపట్టేందుకు గతంలోనే కసరత్తు చేసినా, ఆ పనులు పట్టాలెక్కలేదు. దీంతో అడపాదడపా కురిసే అకాల వర్షాలకు కూడా కాలనీలు నీట మునుగుతున్నాయి.
మేల్కోనకపోతే ఇబ్బందే..
ఏటా సంవత్సరం వర్షాకాలం ముందు గ్రేటర్ వరంగల్ అధికారులు మాన్ సూన్ యాక్షన్ ప్లాన్ తయారు చేయాల్సి ఉంటుంది. దాని ప్రకారం లోతట్టు ప్రాంతాల్లో వరద నీళ్లు నిలవకుండా చూడటంతోపాటు కాలనీల్లో అవసరమైన చోట కాల్వలు, కల్వర్లు కట్టాల్సి ఉంటుంది. కానీ, ఎలక్షన్ హడావుడిలో పడిన అధికారులు మాన్సూన్ యాక్షన్ ప్లాన్ మర్చినట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే అకాల వర్షాలకు కాలనీల్లో నీళ్లు నిలిచి సమస్యలు ఎదురవుతుండగా
మరో నెల రోజుల్లో వర్షాకాలం మొదలైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇండ్లు విడిచి పోవాల్సిన పరిస్థితి నెలకొనే ప్రమాదముంటుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గ్రేటర్ అధికారులు దృష్టి పెట్టి, ముంపు పరిస్థితులు ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని లోతట్టు ప్రాంతాల ప్రజలు విజ్ఞప్తి
చేస్తున్నారు.