టీఆర్ఎస్ ప్రభుత్వం సామాజిక న్యాయం విస్మరించింది

పార్టీ నిర్మాణాన్ని వదిలేసి ప్రభుత్వంలో సామాజిక న్యాయం విస్మరించి సుదీర్ఘకాలం ఏ రాజకీయ పార్టీ ప్రజల విశ్వాసం నిలబెట్టుకోలేదు. ప్రస్తుత టీఆర్ఎస్​పార్టీ, ప్రభుత్వంలో ఇవే అంశాలు కనిపిస్తున్నాయి.  పార్టీలో కింది స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి నాయకుడి వరకు అసంతృప్తితో ఉండగా, ఎనిమిదేండ్ల స్వరాష్ట్ర పాలనలో తమ బతుకులు మారలేదని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఆవేదనతో ఉన్నారు. బహుజనుల సంక్షేమం విస్మరించి అగ్రవర్ణ సామాజిక వర్గాలకే అన్ని అవకాశాలు ఇస్తోందని వారు మండిపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయని టీములను పెట్టి సర్వే చేయించుకునే బదులు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను సరైన తీరులో విశ్లేషించుకుని చక్కదిద్దుకోవడం మేలు. 

తెలంగాణతో పాటు దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆశ్చర్యకర అంశాన్ని తెర మీదికి తెచ్చింది. విద్వేష రాజకీయాలను ఎదిరించడంలో కాంగ్రెస్ తో సహా దేశంలోని ప్రతిపక్షాలు విఫలమయ్యాయని టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మలిచి దేశప్రజలకు దారి చూపుతామని ఆ పార్టీ నేతలంటున్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్‌‌గా మలిచి వివిధ రాష్ట్రాల్లోని మేధావులు, సినిమా హీరోలు, రిటైర్డ్ ఉన్నతాధికారులు, ప‌‌లు ప్రజా సంఘాల ప్రతినిధులతో జాతీయ కమిటీని ప్రకటించనున్నట్లు ప్రగతి భవన్ నుంచి ఆ మధ్య లీకులు వదిలారు. దాంతో కొత్త చర్చ నడిచింది. ప్రజాస్వామ్యంలో ఏ ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ పార్టీగా ఎదగొచ్చు. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ టీఆర్ఎస్‌‌ పుట్టుక నుంచి అధికారంలోకి వచ్చే వరకు ఆ పార్టీ పరిణామ క్రమ చరిత్ర దేశంలోని ఇతర రాజకీయ పార్టీలకు పూర్తి భిన్నం. 2004కు ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలంగాణ ఉద్యమం, రైతులు, యువ‌‌త మీద అనుసరించిన ఇబ్బందిక‌‌ర‌‌ పాలనా విధానాల‌‌పై పోరాటం కోసం టీఆర్ఎస్ పుట్టింది. తెలంగాణ సమాజం సొంత రాజకీయ అస్తిత్వ నినాదం. ఆత్మగౌరవం నినాదంగా తెలంగాణ కోసం నడిచేలా చేసింది. రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం.. ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటు, ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్​కు రాజకీయ లబ్ధిని చేకూర్చాయి. ఆ మాటకొస్తే చాలా సంఘాలు టీఆర్ఎస్ పార్టీ అనుబంధ విభాగాల కంటే కూడా ఎక్కువ పని చేశాయి. ఆ పార్టీ నేతలను ఆహ్వానించి సభలు సమావేశాలు వేలాదిగా నిర్వహించారు. ఉద్యమంలో ఎత్తిన ప్రతి పిడికిలి నేరుగా టీఆర్ఎస్ కు ఓటుగా మారింది. దాని వల్ల పార్టీ సంస్థాగత నిర్మాణం ఉన్నా, లేకున్నా, అధినేత అందుబాటులో ఉన్నా,  కనిపించకుండాపోయిన టీఆర్ఎస్ పార్టీ మాత్రం బలమైన రాజకీయ శక్తిగా నిలదొక్కుకుంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన ఎనిమిదేండ్లలో ప్రభుత్వ విధానాల్లో, పార్టీ నిర్మాణంలో అనుసరించిన తీరు విమర్శలకు దారితీసింది. 

స్వరాష్ట్ర పాలనలో..

రాష్ట్ర ఏర్పాటు తర్వాత దళితులు, బీసీల సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులు కేసీఆర్ వైఖ‌‌రిని స్పష్టం చేశాయి. బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్లకు నిధులు, కనీసం పాలక మండళ్లు లేవు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్లదీ అదే పరిస్థితి. గత ప్రభుత్వాల హయాంలో ఆయా సామాజిక వర్గాలు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న ఆత్మ గౌరవ ప్రతీకలే కార్పొరేషన్లు, ఫెడరేషన్లు. కానీ ఈ ప్రభుత్వం వాటిని అక్కరకురాకుండా చేసింది. మెజార్టీ ప్రజలను దూరం పెడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. భూస్వామ్యవర్గాలను మాత్రం ఇంకా బలోపేతం చేసింది. టీఆర్ఎస్​పార్టీ రాజకీయ అధికారం మాత్రమే లక్ష్యంగా గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఓ సామాజిక వర్గానికి అన్నిటిలోనూ పెద్దపీట వేసింది. మంత్రి పదవుల్లో, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అవకాశాలతోపాటు, నామినేటెడ్​పదవుల్లో అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. ఓ వర్గం నేతకైతే ఎమ్మెల్సీ, కార్పొరేషన్, మండలి విప్​లాంటి మూడు పదవులు ఇచ్చి, చాలా వర్గాల్లో ఒక్కటంటే ఒక్క పదవీ ఇయ్యలేదు. 

పార్టీ నిర్మాణంలోనూ..

ఏ రాజకీయ పార్టీ అయినా కార్యకర్త కేంద్రంగా బలమైన నిర్మాణం పునాదిగా మనుగడ సాధిస్తుంది. ఆశ్చర్యంగా టీఆర్ఎస్ మాత్రం ఎమ్మెల్యే సెంట్రిక్ పార్టీగా నడుస్తోంది. ఇటీవల నియమించిన జిల్లా అధ్యక్షులు కూడా ఎమ్మెల్యేలే. దీంతో కార్యకర్తల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. రాష్ట్ర కమిటీలు రద్దయ్యాయి. అనుబంధ సంఘాలు అసలే లేవు. జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యేలను నియమించుకొని టీఆర్ఎస్ పార్టీలో సామంత రాజుల పద్ధతిని అమలు చేస్తున్నారు. పాలనలో, పార్టీ నిర్మాణంలో మంత్రులను పక్కనపెట్టి భజన మండలికి పెద్దపీట వేస్తున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పాలన తీరు, టీఆర్ఎస్ పార్టీలో కొనసాగిస్తున్న పద్ధతి జాగ్రత్తగా అధ్యయనం చేసిన ఆలోచన పరులు ఎవరికైనా జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ గా మారి బలమైన నిర్మాణం చేపడుతుందంటే ఎవరూ విశ్వసించరు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పెద్దపీట వేసిన ఓ సామాజిక వర్గం ఆయన కుర్చీ లాక్కునేందుకు తిరగబడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నిర్లక్ష్యానికి గురైన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతున్నది. 50 శాతం ఉన్న యువత టీఆర్ఎస్ ​ప్రభుత్వ పాలన పట్ల ఆగ్రహంగా ఉన్నారు. దీనికి మించి సొంత పార్టీలో ఎమ్మెల్యేలు గానీ ఇతర నేతలు కార్యకర్తలు అంతులేని నిరాశతో కాలం గడుపుతున్నారు. ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌‌కు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో విశ్లేషించడానికి బిహార్ నుంచి భారీ ప్యాకేజీతో పనిచేసే పీకే టీమ్​అవసరం ఉందా? అన్న ప్రశ్నలు ఉద‌‌యిస్తున్నాయి. 

‌‌‌‌- మన్నారం నాగరాజు 

రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ లోక్​సత్తా పార్టీ