వరంగల్/ నర్సంపేట, వెలుగు: వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల పాదయాత్రపై టీఆర్ఎస్ దాడికి దిగింది. ఆమె ప్రయాణించే బస్సుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులు పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. కాన్వాయ్‍లోని వాహనాలపై రాళ్లదాడికి దిగారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి కూడా నిప్పుపెట్టారు. పాదయాత్ర కోసం ఊరురా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, జెండాలను ఎక్కడికక్కడ తగలబెట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పి పోలీసులు షర్మిల యాత్రకు అనుమతి నిరాకరించారు. ఆమెను అరెస్ట్ చేసి పోలీస్ వాహనంలో హైదరాబాద్ తరలించారు. దీంతో ఆదివారం 3,500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న షర్మిల పాదయాత్రకు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం శంకరమ్మ తండా వద్ద బ్రేక్ పడింది.
ఉదయం నుంచి టెన్షన్.. టెన్షన్
షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం ఉదయం 10 గంటలకు నర్సంపేట మండలం రాములు నాయక్ తండా వద్ద మొదలైంది. ఆదివారం నర్సంపేటలో షర్మిల స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై విమర్శలు చేశారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ కేడర్ షర్మిల పాదయాత్రను అడ్డుకునే చాన్స్ ఉందని పోలీసులు భావించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి బలగాలను మోహరించారు. రాములు తండా నుంచి ప్రారంభమైన షర్మిల యాత్ర ముగ్గుంపురం, పాత ముగ్ధుంపురం మీదుగా చెన్నారావుపేటకు చేరుకుంది. అదే సమయంలో నర్సంపేటలో టీఆర్ఎస్ లీడర్లు షర్మిల దిష్టిబొమ్మను దహనం చేశారు. మధ్యాహ్నం 1 గంటలోపు పెద్ది సుదర్శన్‍రెడ్డికి క్షమాపణ చెప్పాలని డెడ్‌లైన్ విధించారు. షర్మిల దిష్టిబొమ్మ దహనం విషయం తెలుసుకుని వైఎస్సార్టీపీ కేడర్ చెన్నారావుపేటలో కేసీఆర్, పెద్ది సుదర్శన్‍రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షర్మిల మరోమారు ఎమ్మెల్యే పెద్ది పనితీరుపై ఫైర్ అయ్యారు. జల్లి గ్రామం క్రాస్‌రోడ్ వద్ద టీఆర్ఎస్ శ్రేణులు షర్మిల దిష్టిబొమ్మను దహనం చేయడంతో పోలీసులు 10 మందిని అదుపులోకి తీసుకుని.. 5 నిమిషాల్లో విడిచిపెట్టారు. పెద్ద లీడర్ల నుంచి వచ్చిన ఆదేశాలతో షర్మిల పాదయాత్రను అడ్డుకున్నారు. శంకరమ్మ తండా వద్ద షర్మిల కార్వాన్(బస్సు)పై టీఆర్‍ఎస్ లీడర్లు పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. బస్సులో ఉన్న మహిళలు నీళ్లు చల్లి మంటలను ఆర్పారు. షర్మిల వెహికల్ అద్దాలను పగులగొట్టారు. షర్మిల సారీ చెప్పేంత వరకు పాదయాత్రను కొనసాగనివ్వబోమని హెచ్చరించారు. లంచ్ తర్వాత యాత్ర చెన్నారావుపేట లింగగిరి, సూరిపల్లి మీదుగా నెక్కొండ చేరుకోవాల్సి ఉండగా.. లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని, యాత్ర ఆపాలని మామునూరు ఏసీపీ కోరారు. తాను భయపడే ప్రసక్తే లేదని ఆమె తేల్చిచెప్పారు. దీంతో లింగగిరి – సూరిపల్లి మధ్యలో శంకరమ్మ తండా వద్ద పోలీసులు బలవంతంగా షర్మిలను అరెస్ట్ చేసి, హైదరాబాద్‍కు తరలించారు.
టీఆర్ఎస్ లీడర్లపై గ్రామస్తుల ఫైర్
షర్మిల పాదయాత్ర చెన్నారావుపేట లింగగిరి మీదుగా సూరిపల్లికి చేరుకోవాల్సి ఉంది. వైఎస్సార్‌టీపీ శ్రేణులు సూరిపల్లిలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయగా షర్మిల ప్రారంభించాల్సి ఉంది. పాదయాత్రను అడ్డుకోవడానికి నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపూర్ మండలాల నుంచి టీఆర్‍ఎస్ లీడర్లు డీసీఎం వాహనాల్లో చేరుకున్నారు. వైఎస్సార్ విగ్రహంపై పెట్రోల్ చల్లి నిప్పు పెట్టారు. దూరం నుంచి విగ్రహంపై పెట్రోల్ ప్యాకెట్లు విసిరారు. పక్కనే ఉన్న షర్మిల కటౌట్‌ను చింపివేశారు. దీనికి సూరిపల్లి గ్రామస్తులు అభ్యంతరం చెప్పారు. ఇతర మండలాల నుంచి వచ్చిన టీఆర్ఎస్ లీడర్లు తమ గ్రామంలో గొడవలు చేయడమేంటని నిలదీశారు. వైఎస్ విగ్రహానికి నిప్పు పెట్టడంపై అక్కడున్న మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మా ఊరికి ఏం చేశాడో చెప్పాలి” అంటూ నిలదీశారు. దీంతో కొందరు టీఆర్ఎస్ లీడర్లు గ్రామస్తులపై కోడిగుడ్లు, కట్టెలతో దాడి చేశారు. ‘'మా గ్రామానికి వచ్చి మమ్మల్ని కొడతారా..?’' అంటూ జనాలు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సంచుల్లో పెట్రోల్ ప్యాకెట్లు.. వెహికల్స్‌లో రాళ్లు
షర్మిల పాదయాత్రను అడ్డుకునేందుకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులు సోమవారం ఉదయమే ముందస్తు ప్లాన్ చేశారు. చెన్నారావుపేట, నెక్కొండ మండలాల్లో పాదయాత్ర ఉండగా.. దీంతో సంబంధంలేని నల్లబెల్లి, నర్సంపేట, దుగ్గొండి, ఖానాపూర్ మండలాల నుంచి లీడర్లు వేలాదిగా పార్టీ శ్రేణులను తరలించారు. పలువురు లీడర్లు బస్తా సంచుల్లో పెట్రోల్ ప్యాకెట్లు.. వాహనాల్లో కట్టెలు, రాళ్లతో పాదయాత్ర వద్దకు చేరుకుని అడ్డంకులు సృష్టించారు.
కవర్లలో పెట్రోల్ నింపి.. విసురుతూ..
ఓ వైపు యాత్ర సాగుతుండగా.. పెద్ది సుదర్శన్‍రెడ్డి అనుచరులైన జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, టీఆర్ఎస్ లీడర్లు యాత్ర రూట్‍లో ఉండే గ్రామాల్లో నానా హంగామా చేశారు. యాత్రపై దాడి చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. షర్మిల యాత్ర చెన్నారావుపేట మండల పరిధిలో ఉండగానే.. నెక్కొండ మండల పరిధిలోని సూరిపల్లిలో ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహంపై కవర్లలో పెట్రోల్ నింపి దాడి చేశారు. షర్మిలను అదుపులోకి తీసుకున్నా.. టీఆర్ఎస్ శ్రేణులు శాంతించకపోగా వీరంగం సృష్టించారు. షర్మిల కాన్వాయిలోని వాహనాలను పోలీసుస్టేషన్‌కు తరలిస్తుండగా శంకరమ్మ తండా వద్ద కార్వాన్‌పై మరోసారి దాడికి దిగారు.
పోలీసుల ప్రేక్షక పాత్ర..
షర్మిల పాదయాత్రను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వాహనాల్లో తరలివస్తున్నారనే సమాచారం ఉన్నా పోలీసులు వారిని అడ్డుకోలేదు. చెన్నారావుపేట మండలం జల్లి గ్రామంలో షర్మిల దిష్టిబొమ్మకు పోలీసుల ఎదుటే నిప్పు పెట్టారు. ఉద్రిక్తతలకు కారణమైన వారిని పోలీసులు 5 నిమిషాల్లో వదిలేశారు. షర్మిల యాత్రను అడ్డుకోడానికి వివిధ మండలాల నుంచి టీఆర్‍ఎస్ లీడర్లు డీసీఎంలు, కార్లు, ఆటోల్లో వేలాది మందిని తరలిస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. నర్సంపేట, పరకాల, మామునూరులో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించినా నిరసనలు కట్టడి చేయలేదు. చెన్నారావుపేట స్టేషన్ ఎదుటే షర్మిల ప్రయాణించే బస్సు, ప్రచార వాహనాలపై టీఆర్ఎస్ లీడర్లు రాళ్ల దాడికి దిగారు. అక్కడే ఉన్న స్పెషల్ పార్టీ పోలీసులు ఒకరిద్దరిని పట్టుకుని స్టేషన్లోకి తీసుకెళ్తుండగా.. సివిల్ పోలీసులు మాత్రం వారిని విడిచి పెట్టారు.
ఇది తాలిబన్ల ప్రభుత్వం. కేసీఆర్ కు సిగ్గు ఉండాలే.. బుద్ధి ఎలాగూ లేదు. దాడులు చేసే హక్కు ఎవరిచ్చారు? మా బస్సుకు టీఆర్ఎస్ గూండాలు నిప్పుపెడుతుంటే ఆపాలనే సోయి కూడా పోలీసులకు లేదు. వాళ్లు కేసీఆర్‌కు జీతగాళ్లలా పనిచేస్తున్నరు. టీఆర్ ఎస్ కు అసలు విలువే లేదు. బీఆర్ ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి.
- వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల
దాడులకు భయపడం ఇది సిగ్గులేని సర్కార్: షర్మిల
హైదరాబాద్/వరంగల్, వెలుగు: ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు యాత్ర చేస్తుంటే అరెస్టు చేశారని వైఎస్సార్‌టీపీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. ‘‘రాష్ట్ర చరిత్రలో సోమవారం బ్లాక్ డే. ఇది తాలిబన్ల ప్రభుత్వం. తెలంగాణ మీకు రాసి ఇచ్చారా, కేసీఆర్‌కు సిగ్గు ఉండాలే.. బుద్ధి ఎలాగూ లేదు. సిగ్గులేని సర్కార్ , సిగ్గులేని కేసీఆర్. దాడులు చేసే హక్కు ఎవరిచ్చారు?” అని ప్రశ్నించారు. పోలీసులు లా అండ్ ఆర్డర్ పేరుతో ప్రాబ్లమ్ క్రియేట్ చేశారని దుయ్యబట్టారు. ‘‘మా బస్సుకు నిప్పు పెడుతున్న వాళ్లను ఆపాలనే సోయి కూడా పోలీసులకు లేదు. నన్ను ఈడ్చుకెళ్లారు. అప్పుడు నాకు గాయాలయ్యాయి. మా వెహికల్స్ తగల బెట్టారు. కార్ల అద్దాలు పగులకొట్టారు. పోలీసులు కేసీఆర్‌కు జీతగాళ్లలా పనిచేస్తున్నారు. పార్టీ కోసం పనిచేసే పనోళ్లలా పోలీసులను కేసీఆర్ వాడుకుంటుండు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నర్సంపేట నుంచి షర్మిలను పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్ లోటస్ పాండ్‌లో విడిచిపెట్టారు. లోటస్ పాండ్‌కు చేరుకున్న తర్వాత, అంతకు ముందు నర్సంపేటలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలకున్న సమస్యలు ఎత్తిచూపే బాధ్యత తీసుకున్నానని చెప్పారు. “కేసీఆర్ ఇచ్చిన ప్రతి వాగ్దానం బూటకం అని నిరూపిస్తూ పాదయాత్ర చేస్తున్న ” అని ఆమె అన్నారు.
ఒకప్పుడు టీఆర్ఎస్లో ఉద్యమ కారులు ఉండేవాళ్లని, ఇప్పుడు అంతా గూండాలు ఉన్నారని విమర్శించారు. ‘‘టీఆర్ ఎస్‌కు అసలు విలువే లేదు. బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని మరో సారి స్పష్టం అయింది” అని దుయ్యబట్టారు. ‘‘టీఆర్‍ఎస్ గూండాలు నా కార్వాన్కు నిప్పంటించడం సిగ్గు చేటు. మా వాళ్లను కొట్టారు.. కారుతో గుద్దారు. పోలీసులు దగ్గరుండి ఇదంతా చేయించినట్టుంది. నర్సంపేటలో పాదయాత్రకు అనుమతులున్నా.. పోలీసులు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సృష్టించి నన్ను అరెస్ట్ చేయడానికి కుట్ర చేశారు” అని అన్నారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా, దాడులు చేసినా ప్రజల కోసం నిలబడతాన్నారు. ‘‘దాడి చేసిన వాళ్ల మీద మేం కేసులు పెడుతున్నాం. వీడియోలో ఎమ్మెల్యే మనుషులు, ఎంపీపీ ఉన్నారు. వాళ్ల మీద కేసులు పెడుతున్నాం. పోలీసులకు అరెస్ట్ చేసే దమ్ముందా?” అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి పతనం తప్పదని హెచ్చరించారు.
సారీ చెప్పాలని వార్నింగ్ ఇచ్చినా వినలేదు కాబట్టే దాడి: పెద్ది సుదర్శన్‍రెడ్డి
‘‘నర్సంపేటలో షర్మిల చేసిన వ్యాఖ్యలపై సారీ చెప్పాలని ముందే వార్నింగ్ ఇచ్చినం.. వినకపోవడంతోనే మా కేడర్ షర్మిల పాదయాత్రపై దాడి చేసింది” అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‍రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి ఆయన ఫోన్లో ‘వెలుగు’తో మాట్లాడారు. సమస్యలపైన, లొసుగులపైన మాట్లాడితే తప్పు లేదని. వ్యక్తిగతంగా మాట్లాడితే ఏం జరుగుతుందో నర్సంపేట ప్రజలు చూపించారన్నారు. ‘‘సోమవారం మధ్యాహ్నంలోగా సారీ చెప్పకుంటే జరగబోయే పరిణామాలకు వైఎస్సార్ టీపీనే బాధ్యత వహించాలని డెడ్ లైన్ విధించినా స్పందించలేరు. పైగా మరోసారి చెన్నారావుపేటలో ఆమె చేసిన వ్యాఖ్యలతో కార్యకర్తలు, ప్రజలకు ఆగ్రహం తెప్పించడంతో ఆందోళన చేశారు” అని ఆయన పేర్కొన్నారు.