బూర రాజీనామాతో టీఆర్‌‌‌‌ఎస్‌ అలర్ట్‌‌

ఎవరు ఎవరితో టచ్‌‌లో ఉన్నారో ఆరా

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: మునుగోడులో పార్టీపై నారాజ్‌‌‌‌గా ఉన్న లీడర్లపై టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నిఘా పెట్టింది. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌‌‌‌ పార్టీని వీడడంతో ఆయన బాటలో ఇతర నేతలు వెళ్లకుండా జాగ్రత్త పడుతోంది. ఉప ఎన్నికలో టికెట్‌‌‌‌ ఆశించిన నేతలతో పాటు మండల స్థాయిలో ప్రభావం చూపించే ఇతర నాయకుల కదలికలను గులాబీ లెన్స్‌‌‌‌ వెంటాడుతోంది. ఎవరు ఎవరితో టచ్‌‌‌‌లో ఉన్నారు, ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు.. వంటి వివరాలన్నీ సేకరిస్తోంది. లీడర్లతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులు, డ్రైవర్లు, ఇతర సహాయకులు, సన్నిహితంగా మెలిగే నాయకుల కదలికలను క్షుణ్ణంగా గమనిస్తున్నది. మాజీ ఎంపీ పార్టీని వీడడంతో ఆ ప్రభావం ఉప ఎన్నికపై ఎంత మేరకు పడుతుంది, మెజారిటీ ఓటర్లయిన బీసీలను ఏవిధంగా ప్రభావితం చేస్తుందనే అంశాలపైనా వివిధ మార్గాల ద్వారా సమాచారం సేకరిస్తోంది. పోలింగ్‌‌‌‌కు ఇంకో మూడు వారాలే గడువుండడంతో ఇతర లీడర్లెవరూ చేజారకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.

టీఆర్ఎస్​కు సెమీ ఫైనల్స్

అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు ముందు జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికను టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సెమీఫైనల్స్‌‌‌‌గా భావిస్తోంది. బయటికి ఎన్ని మాట్లాడినా ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని హైరానా పడుతోంది. ఈ క్రమంలోనే బైపోల్‌‌‌‌లో గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. పది మందికిపైగా మంత్రులు, 80 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను రంగంలోకి దించి గడప గడపకు వెళ్లి ప్రచారం చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌‌‌‌కు ముందే అన్ని కులాలతో ఆత్మీయ సమ్మేళనాలు, సహపంక్తి భోజనాలు నిర్వహించింది. నామినేషన్‌‌‌‌ల ఘట్టానికి వచ్చే సరికి భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌‌‌‌ రూపంలో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు భారీ షాక్‌‌‌‌ తగిలింది. ఆయన బాటలోనే మునుగోడుకు చెందిన కొందరు కీలక నేతలు టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ను వీడే అవకాశముందని ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి బలం చేకూరుస్తూ కొందరు లీడర్ల ఫోన్‌‌‌‌లు పనిచేయకపోవడంతో పార్టీ హైకమాండ్‌‌‌‌ హైరానా పడింది. ఈ క్రమంలోనే  హైకమాండ్‌‌‌‌ అసంతృప్త నేతలతో సంప్రదింపులు, బేరసారాలకు తెరతీసింది. బీజేపీకి టచ్‌‌‌‌లోకి ఉన్నట్లుగా చెప్తున్న నేతలతో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ముఖ్య నాయకులు మాట్లాడి పార్టీని వీడొద్దని బుజ్జగించినట్లు, దీంతో కొందరు నేతలు వెనక్కి తగ్గినట్లు సమాచారం. అలాగే మండల స్థాయిలో ఓటర్లను ప్రభావితం చేయగల పార్టీ లీడర్ల కదలికలపైనా హైకమాండ్ నిఘా పెట్టింది. వారెవ్వరూ చేజారకుండా జాగ్రత్త పడడంతో పాటు టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లోనే ఉంటూ ఇతర పార్టీల కోసం అండర్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌ వర్క్‌‌‌‌ చేస్తున్నారా అనే కోణంలోనూ వివరాలు సేకరిస్తోంది.

గౌడ కుల సంఘం నేతలతో మంత్రి జగదీశ్ రెడ్డి చర్చలు

బూర నర్సయ్య గౌడ్‌‌ను నిర్లక్ష్యం చేయడం వల్లే ఆయన పార్టీని వీడారని, అది టీఆర్‌‌ఎస్‌‌కు నష్టం చేస్తుందని మునుగోడు నేతలు చెప్తున్నారు. మిగతా వారి విషయంలోనైనా జాగ్రత్త పడాలని పార్టీ పెద్దలను హెచ్చరిస్తున్నారు. బూర రాజీనామాతో గౌడ కులానికి చెందిన ఓటర్లు చేజారకుండా మంత్రి జగదీశ్‌‌ రెడ్డి రంగంలోకి దిగి ఆ కుల సంఘం నేతలతో చర్చలు జరిపారు. అదే కులానికి చెందిన ఇతర లీడర్లపై ఫోకస్‌‌ చేసి టీఆర్‌‌ఎస్‌‌లో చేర్చుకోవడంపై దృష్టి సారించారు. మునుగోడు నియోజకవర్గంలో 60 శాతం ఓటర్లు బీసీలే ఉండడంతో వారి ఓట్లపైనే ప్రధానంగా గులాబీ పార్టీ గురి పెట్టింది. అలాగే పద్మశాలి, యాదవ ఓట్లు చేజారకుండా చర్యలు చేపట్టింది. ఆయా కులాలకు చెందిన ప్రముఖ నాయకులను రంగంలోకి దించి ఓటర్లతో సమ్మేళనాలు, విందులు ఏర్పాటు చేస్తున్నది.