టీఆర్ఎస్, బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయి : ఆకునూరి మురళి

రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి

హైదరాబాద్, వెలుగు : మునుగోడు కౌంటింగ్ ను వెంటనే నిలిపివేయాలని, ఆ బైపోల్ ను రద్దు చేయాలని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి డిమాండ్ చేశారు. టీఆర్ఎస్, బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని శనివారం ప్రకటనలో ఆయన ధ్వజమెత్తారు. మునుగోడులో టీఆర్ఎస్ ఓటుకు రూ.5 వేలు, బీజేపీ రూ.4 వేలు పంచినట్లు అక్కడి ఓటర్లు చెప్పిన వీడియోలు రెండు రోజులుగా  సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయని ఆయన తెలిపారు. ఈ వీడియోలను కేంద్ర ఎన్నికల సంఘానికి, సీఈవో వికాస్ రాజ్ కు పంపానని ఆయన వెల్లడించారు.  

లక్ష మంది ఓటర్లకు పైగా రెండు పార్టీలు డబ్బులు పంచాయన్నారు. పోలీసుల సహకారం లేకుండానే ఈ పంపిణీ జరిగిందని అనుకోవాలా అని ఆయన ప్రశ్నించారు. ఇంత జరుగుతుంటే కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు, పోలీసులు  ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్య ప్రక్రియను ఖూనీ చేసేలా పార్టీలు పనిచేశాయని ఆయన ఫైరయ్యారు.