నల్గొండ, వెలుగు: రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న మునుగోడు బైపోల్స్‌లో గెలవడం మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేరు ఖాయం కావడంతో మిగిలిన టీఆర్ఎస్, కాంగ్రెస్ తమ అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు పడుతున్నాయి. రాజగోపా ల్ రెడ్డికి దీటైన అభ్యర్థిని నిలబెట్టేందుకు ఇరు పార్టీల అధిష్ఠానాలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. దుబ్బాక, హుజూరాబాద్నియోజకవర్గాల్లో ఎదురైన ఓటముల నేపథ్యంలో ఈసారి క్యాండిడేట్ల ఎంపికపై ఆచితూచి ముందుకెళ్తున్నాయి. ప్రస్తుతం టీఆర్ఎస్ నుంచి ఐదుగురు, కాంగ్రెస్ నుంచి ముగ్గురు లీడర్లు టికెట్లు ఆశిస్తున్నారు. దీంతో ఆర్థికంగా, సామాజికంగా ఆయా లీడర్ల బలాబలాలపై అధిష్టానాలు లెక్కలు వేసుకుంటున్నాయి. నియోజకవర్గంలో ఆశావహులకు ఉన్న ప్రజాదరణ, గెలుపు అవకాశాలపై ఓ అంచనా కోసం ఇరు పార్టీలు సర్వేలు చేయిస్తున్నాయి.
టీఆర్ఎస్లో ఆశావహులు ఎక్కువే..
టీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ , కంచర్ల కృష్ణారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఓడిపోయిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైపే హైకమాండ్ మొగ్గుచూపుతోందనే వార్తలు వస్తున్నాయి. కానీ స్థానిక ప్రజాప్రతినిధులు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తుండడం హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది. ప్రభాకర్‌రెడ్డిని వద్దనుకుంటే ప్రత్యామ్నాయంగా మండలి చైర్మన్ గుత్తా పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది. కానీ జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో ఆయనకున్న భేదాభిప్రాయాలు గుత్తాకు మైనస్‌గా మారాయి. ఇదే సామాజికవర్గం నుంచి వీరిద్దరూ కాకపోతే నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్న కంచర్ల కృష్ణారెడ్డి పేరును కూడా పరిశీలించే అవకాశముంది.
మరోవైపు మునుగోడు నియోజకవర్గంలో ఉన్న 2.26 లక్షల మంది ఓటర్లలో అత్యధికులు గౌడ, యాదవ, పద్మశాలీ, ముదిరాజ్ సామాజిక వర్గాలకు చెందినవారే. దీంతో ఈ బీసీ లీడర్లలో ఎవరో ఒకరికి టికెట్ఇస్తే ఆయా సామాజికవర్గాల ఓటర్లను ఆకట్టుకోవచ్చన్న ఆలోచన కూడా టీఆర్ఎస్ హైకమాండ్మదిలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అప్పుడు గౌడ సామాజిక వర్గం నుంచి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తో పాటు కర్నాటి విద్యాసాగర్, ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి నారబోయిన రవి పేర్లు తెరపైకి వచ్చే అవకాశముంది. తమలో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తామని బీసీ లీడర్లు ఇప్పటికే హైకమాండ్‌కు సంకేతాలు పంపించారు. దీంతో ఇప్పటికిప్పుడు అభ్యర్థి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా దాటవేత ధోరణి అవలంభిస్తున్న హైకమాండ్, ఆయా నేతలకు ఉన్న ప్రజాదరణ, విజయావకాశాలపై సర్వేలు చేయించడంతో పాటు ఇంటలిజెన్స్ ద్వారా రిపోర్టులను తెప్పించుకుంటోంది. వాటన్నింటినీ విశ్లేషించాకే అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ లో ముగ్గురి నడుమ పోటీ..
హుజూరాబాద్‌లో డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి మునుగోడు ఉప ఎన్నిక అగ్నిపరీక్ష కాబోతోంది. సిట్టింగ్ స్థానం చేజారకుండా శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇన్నాళ్లూ తమకు కంచుకోటగా ఉన్న నల్గొండ జిల్లాలో ఓటమిపాలైతే పార్టీ భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని అభ్యర్థి ఎంపికపై హైకమాండ్ సీరియస్‌గా దృష్టి పెట్టింది. బలమైన అభ్యర్థులను బరిలో దింపకపోవడం వల్లే ఉప ఎన్నికల్లో ఓటమిపాలవుతున్నామనే అంచనాకు వచ్చిన ఆ పార్టీ పెద్దలు.. ఈ సారి అలాంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ క్యాండిడేట్లను ఢీ కొనాలంటే ఆమేరకు సామాజికంగా, ఆర్థికంగా బలమైన అభ్యర్థిని బరిలో నిలపాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు. ప్రస్తుతానికి పాల్వాయి స్రవంతి, చలమల్ల కృష్ణారెడ్డితో పాటు ఇటీవల పార్టీలో చేరిన చెరుకు సుధాకర్‌గౌడ్ పేర్లు కూడా పార్టీ పరిశీలనలో ఉన్నాయి. పాల్వాయి స్రవంతికి జిల్లా కాంగ్రెస్ కు చెందిన పెద్దల అండదండలు ఉండగా, వ్యాపారవేత్త అయిన చలమల్ల కృష్ణారెడ్డికి ఆర్థిక బలం అదనపు అర్హత కానుంది. కృష్ణారెడ్డికి రేవంత్అండదండలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో కృష్ణారెడ్డి ఇప్పటికే పలు గ్రామాల సర్పంచ్‌లు, లోకల్ కాంగ్రెస్ లీడర్లకు ఫోన్లు చేసి, తనకు మద్దతిస్తే అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
రాజగోపాల్‌రెడ్డి చేరిక మీటింగ్‌పై నజర్...
ఈ నెల 21న రాజగోపాల్ రెడ్డి బీజేపీలో అధికారికంగా చేరేందుకు ముహూర్తం ఖరారైంది. సుమారు లక్ష మందితో చౌటుప్పుల్ లేదంటే మునుగోడులో బహిరంగ సభ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి అమిత్‌షా ముఖ్యఅతిథిగా రానుండడంతో అందరి దృష్టి ఈ సభపై నెలకొన్నది. ఈ బహిరంగ సభ ద్వారా తన బలాన్ని చాటుకునేందుకు రాజగోపాల్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల్లో తనకు టచ్‌లో ఉన్న పలువురి లీడర్లను సభకు రప్పించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు మీటింగ్‌కు వెళ్లకుండా ఇటు టీఆర్ఎస్, అటు కాంగ్రెస్ జాగ్రత్త పడుతున్నాయి. ఈమేరకు రెండుపార్టీలు మండలాలవారీగా లీడర్లకు భరోసా కల్పించే చర్యలు తీసుకుంటున్నా, అవి ఎంతవరకు ఫలిస్తాయన్నది ఈ నెల 21న తేలనుంది.
కోమటిరెడ్డి రాజగోపాల్ మునుగుడు ఖాయం : గుత్తా
నల్గొండ : ఉప ఎన్నికల్లో అభ్యర్థులే కీలకమని, దుబ్బాక, హుజూరాబాద్ఎలక్షన్లలో ఇది రుజువయ్యిందని శాసనమండలి చైర్మన్‌గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం నల్గొండలో మీడియాతో చిట్ చాట్ చేశారు. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి మునుగుడు ఖాయమన్నారు. బీజేపీలో చేరడంతో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్వేచ్ఛను కోల్పోయినట్లేనన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కు తమను ఎక్కువగా ఊహించుకునే గుణం ఉందన్నారు. కుటుంబ పాలన గురించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడం సరికాదని, ఆయన ఫ్యామిలీకి కాంగ్రెస్ ఎన్ని అవకాశాలు ఇచ్చిందో గుర్తు తెచ్చుకోవాలన్నారు. రాజగోపాల్ తిన్నదెక్కువై ఉప ఎన్నిక తెచ్చుకున్నారన్నారు.