- నువ్వా.. నేనా అన్నట్లు టీఆర్ఎస్, బీజేపీ పోరు
- ఓడితే మునుగుతామనే ఆందోళనలో టీఆర్ఎస్
- రాష్ట్రంలో పట్టు బిగించాలనే ప్రయత్నాల్లో బీజేపీ
- పరువు కోసం కాంగ్రెస్ పోరాటం
- సత్తా చాటేందుకు చిన్న పార్టీల ఆరాటం
హైదరాబాద్, వెలుగు : దేశం దృష్టిని ఆకర్షించిన మునుగోడు ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. ‘సెమీ ఫైనల్’ పోరు తుది అంకానికి చేరుకుంది. బైపోల్లో గెలిచి రాష్ట్రంలో పట్టు పెంచుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుండగా.. ముఖ్యమైన ఈ పోరులో ఓడితే వచ్చే ఎన్నికలపై ఎఫెక్ట్ ఉంటుందనే ఆందోళనలో టీఆర్ఎస్ ఉన్నది. ఈ రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరీగా తలపడ్డాయి. సిట్టింగ్ స్థానంలో పరువు నిలబెట్టుకోవాలనే తాపత్రయంతో కాంగ్రెస్ జనంలోకి వెళ్లింది. ఈ మూడు పార్టీలతోపాటు పలు చిన్న పార్టీలు కూడా ప్రచారం చేశాయి. ఈ ఉప ఎన్నికలో మొత్తం 47 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు జరుగుతున్న బైపోల్ కావడంతో ఇక్కడ గెలుపు ప్రధాన పార్టీలకు కీలకంగా మారింది. రాష్ట్రంలో హుజూరాబాద్ ఉప ఎన్నికే అత్యంత ఖరీదైనదని అనుకుంటే.. దాన్ని తలదన్నే స్థాయిలో మునుగోడులో ధన ప్రవాహం సాగింది.
టీఆర్‌ఎస్ మొత్తం కేబినెట్‌తోపాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వంద మంది అక్కడే మోహరించి ప్రచారం చేశారు. ఇక్కడ అధికారమే లక్ష్యంగా పని చేస్తున్న బీజేపీ.. ప్రతిష్టాత్మకంగా తీసుకొని సర్వశక్తులు ఒడ్డింది. మరోవైపు ఓటరు నమోదు నుంచి మొదలు పెడితే గుర్తుల కేటాయింపు వరకు ఈసీ అనేక వివాదాలకు కేంద్ర బిందువైంది. ఉప ఎన్నికపై ఈసీకి రికార్డు స్థాయిలో ఫిర్యాదులు అందాయి. బైపోల్ లో ఎవరు గెలుస్తారనే దానిపై రాష్ట్రంలో జోరుగా చర్చ సాగుతున్నది.
దక్షిణాదిలో కర్నాటక తర్వాత తెలంగాణపై బీజేపీ కేంద్ర నాయకత్వం దృష్టి పెట్టింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో పోటీగా డివిజన్లను గెలుచుకుని జోరు పెంచింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. బైపోల్ వస్తేనే అభివృద్ధి జరుగుతుందనే కారణంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మునుగోడు బరిలో నిలిచారు. ఆయన్ను గెలిపించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్లమెంటరీ బోర్డు మెంబర్ లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బైపోల్ ఇన్‌చార్జ్ వివేక్ వెంకటస్వామి, ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బాపురావు, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు సహా పలువురు జాతీయ, రాష్ట్ర నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. ఉప ఎన్నికను చాలెంజ్‌గా తీసుకొని పని చేశారు. 25 రోజులుగా ముఖ్య నేతలంతా అక్కడే మకాం వేసి టీఆర్‌ఎస్ వ్యూహాలను దీటుగా ఎదుర్కొంటూ జనంలోకి వెళ్లారు. మునుగోడులో గెలిస్తే రాష్ట్రంలో బీజేపీకి జోష్ వస్తుందని పార్టీ కేంద్ర నాయకత్వం భావిస్తున్నది.
పాల్వాయి స్రవంతి ఒంటరి పోరాటం
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నంతో కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేశారు. పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి మద్దతుగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు క్యాంపెయిన్ చేశారు. అయితే ఇదే టైంలో రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర.. రాష్ట్రంలోకి రావడంతో ముఖ్య నేతలంతా ఆయన వెంటే ఉన్నారు. దీంతో మునుగోడులో స్రవంతి ఒంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బీఎస్పీ, టీజేఎస్..
బీఎస్పీ స్టేట్ చీఫ్‌గా ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మొదటిసారి ఎన్నికల పరీక్షను ఎదుర్కొంటున్నారు. బీఎస్పీ అభ్యర్థి తరఫున అన్నీతానై ప్రచారం చేశారు. టీజేఎస్ సహా మిగతా పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు ప్రధాన పార్టీలతో సమానంగా ప్రచారం చేశారు. ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ మునుగోడు ఎన్నికల ప్రచారంలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. కమ్యూనిస్టు పార్టీలు అధికార టీఆర్‌ఎస్ తరపున విస్తృతంగా ప్రచారం చేయగా, పలు పార్టీలు, సంస్థలు పోటీలో ఉన్న అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొన్నాయి. రూ.500 కోట్ల వరాలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడుపై సర్కారు రూ.500 కోట్ల వరాలు కురిపించింది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూసేకరణ బిల్లులు సహా నియోజకవర్గంలో అనేక స్కీంలు, అభివృద్ధి పనుల పేరుతో నిధులు విడుదల చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే నిబంధనలు తొక్కిపెట్టి పలు కొత్త రోడ్ల పనులు షురూ చేశారు.
ఓటర్ జాబితా నుంచి గుర్తుల వరకు
మునుగోడు ఉప ఎన్నిక నిర్వహణలో ఈసీపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఓటర్ల నమోదు నుంచి మొదలుకొని గుర్తుల కేటాయింపుల వరకు అధికారుల తీరు వివాదాస్పదమైంది. యుగ తులసి పార్టీ అభ్యర్థికి మొదట రోడ్డు రోలర్ గుర్తు కేటాయించగా, ఆర్వో దాని స్థానంలో వేరే గుర్తు ఇచ్చారు. దీనిపై క్యాండిడేట్ సీఈసీకి ఫిర్యాదు చేయడంతో ఆర్వో జగన్నాథరావును సస్పెండ్ చేశారు. మరో అభ్యర్థికి.. కేటాయించిన గుర్తుకు బదులు బ్యాలెట్ పేపర్‌లో మరో గుర్తు ప్రింట్ చేయించిన తహసీల్దార్‌ను సస్పెండ్ చేశారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేయకుంటే ప్రభుత్వ పథకాలు రావు అన్న మంత్రి జగదీశ్ రెడ్డిపై 48 గంటలు ప్రచారం చేయకుండా నిషేధం విధించారు.
మత్తులో ముంచేశారు
ఉప ఎన్నిక క్లైమాక్స్‌కు చేరడంతో ప్రధాన పార్టీల నేతలు ఓటర్లను మద్యం మత్తులో ముంచెత్తారు. నల్గొండ జిల్లాలో సగటున నెలకు రూ.120 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతుండగా, ఒక్క మునుగోడులోనే మూడు వారాల్లో రూ.200 కోట్ల లిక్కర్ అమ్మారు. ఇతర ప్రాంతాల నుంచి ఇంకో రూ.50 కోట్ల విలువైన లిక్కర్ మునుగోడుకు తరలించినట్టుగా చెప్తున్నారు. నామినేషన్ల రోజు నుంచి ఓటర్లకు మద్యం, మాంసంతో విందులు ఇచ్చారు. ప్రచారం ముగిసిన వెంటనే ఓట్ల పందేరానికి తెరతీశారు. ప్రధాన పార్టీల నేతలు పోటాపోటీగా డబ్బులు పంపిణీ చేశారు.
బలగాన్నంతా దింపిన టీఆర్ఎస్
ఉప ఎన్నికను లైఫ్ అండ్ డెత్‌గా తీసుకున్న టీఆర్‌ఎస్.. మొత్తం బలగాన్నంతా మునుగోడులో డంప్ చేసింది. సీఎం కేసీఆర్ రెండు సార్లు మునుగోడులో బహిరంగ సభలు నిర్వహించారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సహా 15 మంది మంత్రులు, 100 మంది ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులంతా ఒక్కో ఊరికి ఇన్‌చార్జ్‌లుగా ఉండి పార్టీ గెలుపు కోసం ప్రయత్నించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకుంటానని కేటీఆర్ ప్రకటించారు. తాము ప్రచారం చేస్తున్న గ్రామాల్ని దత్తత తీసుకుంటున్నట్లు క్యాంపెయిన్‌లో మంత్రులు మల్లారెడ్డి, ఎర్రబెల్లి తెలిపారు.
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తేవడానికి మునుగోడు ఫలితమే బూస్టింగ్ ఇస్తుందని చండూరు ప్రచార సభలో సీఎం ప్రకటించారు. దేశ రాజకీయాల్లో సత్తా చాటాలని భావిస్తున్న కేసీఆర్ పార్టీ పేరు బీఆర్‌ఎస్‌గా మార్చిన తర్వాత వచ్చిన ఎన్నిక కావడంతో ఇక్కడ విజయం సాధించి తీరాలని అనేక ఎత్తులు వేశారు. పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని తెరమరుగు చేసి.. అన్నీ తామై ఇన్‌చార్జీలే ప్రచారం చేశారు. గ్రామాల్లో అభివృద్ధిపై ఇచ్చిన హామీలన్నీ తామే నెరవేరుస్తామని, అభ్యర్థి ముఖం చూడకుండా తమను చూసే ఓటు వేయాలని కోరారు.