టీఆర్ఎస్ బీజేపీ మధ్య ఓట్ల తేడా 0.2 శాతమే

టీఆర్ఎస్ బీజేపీ మధ్య ఓట్ల తేడా 0.2 శాతమే
  • 25 శాతం ఓట్లు, 44 సీట్లు పెంచుకున్నది
  • 9 శాతం ఓట్లు, సగం సీట్లు కోల్పోయిన టీఆర్ఎస్
  • కాంగ్రెస్​కు ఎన్నడూ లేనంత తక్కువగా ఓట్లు
  • సీట్లు పెరగకున్నా ఓట్ల శాతం పెంచుకున్న ఎంఐఎం

హైదరాబాద్‌‌, వెలుగు: గ్రేటర్‌‌  హైదరాబాద్‌‌ మున్సిపల్‌‌ కార్పొరేషన్‌‌  (జీహెచ్ఎంసీ) ఎలక్షన్లలో టీఆర్ఎస్, బీజేపీ దాదాపు సమానంగా ఓట్లు సాధించాయి. మొత్తంగా 34 లక్షల ఓట్లు పోలైన ఈ ఎలక్షన్​లో.. టీఆర్ఎస్​కన్నా బీజేపీకి కేవలం 6,615 ఓట్లు (0.2 శాతం ఓట్లు) మాత్రమే తక్కువగా వచ్చాయి. గత జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో కేవలం 10.3 శాతం ఓట్లు సాధించిన బీజేపీ.. ఈసారి ఏకంగా 35.5 శాతం ఓట్లు సాధించింది. టీఆర్ఎస్​ సుమారు తొమ్మిది శాతం ఓట్లు కోల్పోయింది. జీహెచ్ఎంసీలోని మొత్తం 150 డివిజన్లలో పోటీ చేసిన టీఆర్‌‌ఎస్‌‌.. 35.77 శాతం ఓట్లతో 55 సీట్లు గెలుచుకోగా.. 149 డివిజన్లలో పోటీ చేసిన బీజేపీ 35.57 శాతం ఓట్లతో 48 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్‌‌ పార్టీ సీట్లలోనే కాదు ఓట్ల శాతంలోనూ సింగిల్‌‌ డిజిట్‌‌కే పరిమితమైంది. కాంగ్రెస్‌‌కు ఇంత తక్కువ ఓట్లు పోలవడం ఇదే మొదటిసారి. ఇక ఎంఐఎం పార్టీకి గతం కన్నా మరో రెండున్నర శాతం ఎక్కువగా ఓట్లు పోల్‌‌ అయ్యాయి.

వరుస ఎలక్షన్లతో..

జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల్లో మొత్తంగా 34,54,552 ఓట్లు పోలవగా.. టీఆర్‌‌ఎస్‌‌ కు 11,97,844 ఓట్లు, బీజేపీకి 11,91,229 ఓట్లు వచ్చాయి. రెండు పార్టీల మధ్య 6,615 ఓట్ల తేడా మాత్రమే ఉంది. అసలు వరుసగా జరుగుతున్న ఎలక్షన్లలో బీజేపీ బలం పెంచుకుంటూ వస్తోంది. 2016 జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌‌ఎస్‌‌ 43.85 శాతం ఓట్లతో 99 డివిజన్లలో గెలవగా.. బీజేపీకి 10.34 శాతం ఓట్లతో నాలుగే సీట్లు దక్కించుకుంది. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో గ్రేటర్​హైదరాబాద్​ పరిధిలోని 23 సెగ్మెంట్లలో టీఆర్ఎస్​ 13 చోట్ల గెలిచింది. ఏడు చోట్ల ఎంఐఎం, రెండు చోట్ల కాంగ్రెస్, బీజేపీ ఒక గోషామహల్​ సెగ్మెంట్లో మాత్రమే గెలిచాయి. ఈ ఎన్నికలో బీజేపీ ఒకే సీటు సాధించినా.. ఓట్ల శాతం అంతకుముందటి కంటే మూడున్నర శాతం ఎక్కువగా 13.75కు పెరిగింది. కాంగ్రెస్​కూడా ఓట్ల శాతాన్ని బాగా పెంచుకుంది. టీఆర్ఎస్​కు ఓట్ల శాతం తగ్గినా ఎక్కువ అసెంబ్లీ సీట్లు గెల్చుకుంది.

లెక్కలు మారినయ్

జీహెచ్ఎంసీ ఎలక్షన్ల నాటికి హైదరాబాద్​ సిటీలో బీజేపీ మరింతగా ఎదిగింది. టీఆర్ఎస్​ను గట్టిగా ఢీకొట్టింది. గత జీహెచ్ఎంసీ ఎలక్షన్లతో పోలిస్తే.. ఓట్ల శాతాన్ని, డివిజన్ల సంఖ్యను ఏకంగా పది రేట్లకుపైగా పెంచుకుంది. ఇదే టైంలో టీఆర్ఎస్​ ఓట్లు తొమ్మిది శాతం దాకా, సీట్లు సగం దాకా తగ్గిపోయాయి. గత జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల్లో పది శాతానికిపైగా ఓట్లు పొందిన కాంగ్రెస్​ ఈసారి బాగా దెబ్బతిన్నది. కేవలం ఆరు శాతం ఓట్లు, రెండే డివిజన్లకు పరిమితమైంది. మజ్లిస్‌‌ పార్టీ మాత్రం తన బలాన్ని పెంచుకుంది. గత జీహెచ్ఎంసీ ఎలక్షన్లతో పోలిస్తే.. సీట్ల సంఖ్యలో మార్పులేకున్నా 70 వేల ఓట్లు ఎక్కువగా సాధించింది. ఇక టీడీపీ అయితే కేవలం ఒకటిన్నర శాతం ఓట్లకే పరిమితమైంది.

లోక్​సభ ఎలక్షన్ల నాటికి..

లోక్​సభ ఎన్నికలు వచ్చేసరికి పరిస్థితి మారింది. కాంగ్రెస్‌‌ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్‌‌ఎస్‌‌లో చేరడంతో.. గ్రేటర్​లో టీఆర్ఎస్​ ఎమ్మెల్యేల సంఖ్య 15కు పెరిగింది. అయినా ఆ పార్టీకి సీన్‌‌ రివర్స్‌‌ అయ్యింది. గ్రేటర్​ లో ఒక్క లోక్​సభ సీటు కూడా టీఆర్ఎస్​ గెలుచుకోలేక పోయింది. గ్రేటర్‌‌లో కొంత ప్రాంతం ఉన్న చేవెళ్ల లోక్​సభ సెగ్మెంట్లో మాత్రం విజయం దక్కింది. ఇదే టైంలో కాంగ్రెస్​ ఓట్ల శాతం కాస్త తగ్గినా.. ఓ ఎంపీ సీటు సాధించింది. బీజేపీ మాత్రం మరింతగా బలపడింది. సికింద్రాబాద్​లోక్​సభ సెగ్మెంట్​ను దక్కించుకోవడంతోపాటు.. హైదరాబాద్‌‌, మల్కాజిగిరి, చేవెళ్ల సెగ్మెంట్లలోనూ గణనీయమైన ఓట్లు తెచ్చుకుంది. ఓట్ల శాతం 27.7కు పెరిగింది.