చట్టపరంగా చూసినప్పుడు టీఆర్ఎస్ పేరు మార్పు నిర్ణయాన్ని ఆ పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారంగానే చూడాలి. కాకపోతే టీఆర్ఎస్కు మిగతా పార్టీలకు ఒక తేడా ఉన్నది. టీఆర్ఎస్ రాష్ట్ర సాధన ఉద్యమం నుండి పుట్టి ఆ ఉద్యమం వల్లనే ఎదిగింది. అనేక సార్లు ఆ పార్టీ, తమది ఉద్యమ పార్టీ అని చెప్పుకున్నది. తెలంగాణాకు స్వీయ రాజకీయ అస్థిత్వాన్ని కల్పించడమే తమ కర్తవ్యంగా చెప్పుకున్నారు. తెలంగాణా వాదానికి వ్యక్తీకరణ ఇచ్చే ఆలోచన వలన తెరాస తెలంగాణాకు రాజకీయ ముఖంగా పరిణామం చెంది తెలంగాణాలో సమైక్యవాదం పునాదుల మీద ఎదిగిన ఆంధ్రా పార్టీలను కూలదోసి అధికారంలోకి వచ్చింది.
తెలంగాణతో పేగు బంధం తెగిపోయింది
ఇవాళ టీఆర్ఎస్ పరిస్థితి అందరికీ సోది చెప్పి కుడితిల పడ్డ బల్లి వలె తయారైంది. ఇంతవరకు చెప్పింది ఒకటి ఇవ్వాళ చేస్తున్నది ఇంకొకటి. టీఆర్ఎస్ ఎదుగుదలకు తోడ్పడిన అంశాల పట్ల ఇప్పుడు టీఆర్ఎస్కు సోయి లేదు. టీఆర్ఎస్ వైఖరిలో తలెత్తిన ఈ మార్పునకు గల కారణాలను వెతకడం పెద్ద కష్టమైన విషయం కాదు. అధికారంలోకి వచ్చిన తరువాత అసలు ఉద్యమంలో ప్రజల పాత్రను మరుగున పడేసే ప్రయత్నం చేసింది. నది దాటినంక సహాయ పడిన పడవ యజమానిని బోడ మల్లయ్య అన్న అహంభావి వలెనే కేసీఆర్ వ్యవహరించిండు. రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణా ఉద్యమం గురించి కెసిఆర్ కొత్త పాట ఎత్తుకున్నడు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేవలం కేసీఆర్ ఒక్కడే, అటుకులు బుక్కి నీళ్ళు తాగి కొట్లాడిండట. బలిదానాలు చేసుకున్న యువతీయువకులను మరిచే పోయిండు. ప్రజల త్యాగాల ఊసే లేదు. అందుకే గోసి గొంగడేసి కొట్లాడితే తెలంగాణా ఎవ్వరి పాలైందని జనం అడగడం మొదలైంది. ఈ పరిణామాల వలన ఉద్యమ ఆకాంక్షలు ఆటకెక్కినాయి. కేసీఆర్ కుటుంబం ఆయన అనుచర గణం తెలంగాణా పేరు చెప్పి అధికారాన్ని సాధించి ఇప్పుడు ప్రభుత్వాన్ని స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. ప్రజలకు దూరమైన తరువాత ఇంక తెలంగాణకు దూరంకావడం పెద్ద విశేషం కాదు. ఆ మార్పు అనివార్యంగానే జరిగి పోయింది. ఉద్యమకాలంలోనూ టీఆర్ఎస్ తన తక్షణ ప్రయోజనాలకు అడ్డం అయితదని భావించినప్పుడు తెలంగాణా ప్రయోజనాలను పక్కన పెట్టింది. తెలంగాణా ఏర్పడిన తరువాత టీఆర్ఎస్ ఇక మాది ఉద్యమ పార్టీ కాదు, మేము ఫక్తు రాజకీయ పార్టీగా మారిపోయామని ప్రకటించింది. దాని అర్థం ఇక ఉద్యమ విలువలు, ఉద్యమ ఆకాంక్షలతో పార్టీకి సంబంధం లేదనే. అధికారంలో నిలదొక్కుకోడానికి ఇతర పార్టీల నాయకులను కొనుగోలు చేయడం మొదలు పెట్టింది. పైసలతో రాజకీయాలను నడపడం ప్రారంభించింది. ఇప్పుడు తెలంగాణా ‘సెంటిమెంట్’ వలన గెలవ లేదని, కేవలం తాము తెచ్చిన అభివృద్ధి వల్లనే గెలిచినామని అంటున్నారు. కాబట్టి తెలంగాణతో తెగతెంపులు ఒక్క రోజులో జరిగింది కాదు. ఎకాఎకిన వచ్చిన మార్పు అసలే కాదు. ఆ పార్టీ నాయకులు ఉద్యమాన్ని, ఉద్యమ ఆకాంక్షలను పక్కనబెట్టి తమ వ్యాపార ప్రయోజనాల కొరకే ప్రభుత్వాన్ని వాడుకుంటున్నారు. టీఆర్ఎస్కు ఇప్పుడు తన స్వార్థమే తప్ప తెలంగాణ ప్రయోజనాల మీద దృష్టి లేదు. ప్రభుత్వాన్ని ప్రజల సమిష్టి వనరులను కొల్లగొట్టడానికి వాడుకుంటున్నారు.
అప్పుడు స్వీయ రాజకీయ అస్థిత్వం - ఇప్పుడు స్వీయ రాజకీయ ప్రయోజనాలు
తెలంగాణా అభివృద్ధికోసం చేయవలసినదంతా చేసినం, ఇక్కడ ఇంకా చేయవలసింది ఏమీలేదు, దేశాన్ని బాగుచేయడానికి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నామని అంటున్నారు. తెలంగాణ మోడల్ దేశమంతట అమలు చేస్తామంటున్నారు. కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి, బిచ్చం వేసినట్టు నాలుగు పైసలు విదిల్చి, స్వప్రయోజనాల కోసం అధికారాన్ని నిరంకుశంగా చెలాయించడమే ఈ మోడల్ అసలు స్వభావం. తెలంగాణలో వ్యవసాయాన్ని విధ్వంసం చేసి ఇప్పుడు రైతు రాజ్యం రావాలంటున్నాడు మన ముఖ్యమంత్రి. కాబట్టి కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి దేశ స్థాయిలో అభివృద్ది చేయడమనేది అర్థమవుతున్నది. తమ ప్రాంతాల్లో పట్టు సాధించిన మిగతా ప్రాంతీయ పార్టీలు ఏం చేసినాయి? ఏ ప్రాంతీయ పార్టీ కూడా తన అస్థిత్వాన్ని వదులుకోలేదు. తమ ప్రాంతం తరఫున జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి, అక్కడ పొందిన పరపతిని తమ ప్రాంత ప్రయోజనాలకు వాడుకున్నారు. ఇది తమిళనాడు అనుభవం. ఎంతో శక్తివంతులైన ఇతర ప్రాంత నాయకులు శరద్ పవార్, లాలూ ప్రసాద్, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, ఎన్. టి. రామా రావు, చంద్రబాబు నాయుడు వంటి నాయకులు జాతీయ స్థాయిలో దొరికిన గుర్తింపును, పరపతిని రాష్ట్ర వికాసాన్ని సాధించడానికి ఉపయోగించారు. కేసీఆర్ కూడా ఇదే రీతిలో వ్యవహరించి ఉండవలసింది. ప్రాజెక్టులకు జాతీయ హోదా సాధించడానికి, అదనపు నిధులను పొందడానికీ కేసీఆర్ ఢిల్లీలో ఉన్న పలుకుబడిని వాడవలసింది. కేసీఆర్ తన రాజకీయ పలుకుబడిని పెంచుకునే ఆలోచన తప్ప తెలంగాణా ప్రయోజనాల గురించి ఆలోచించక పోవడమే సమస్య. జాతీయ పార్టీగా మారినంత మాత్రాన కేసీఆర్ దేశమంతటా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే అవకాశం కనబడటం లేదు. మరి జాతీయ పార్టీగా ఎందుకు మారినట్టు? కేసీఆర్ రాష్ట్రంలో నిలదొక్కు కోవడానికే జాతీయ పార్టీని ఏర్పాటు చేసిండు. ఇప్పుడు చర్చ జాతీయ అంశాల చుట్టూ తిరుగుతున్నది. దాని వలన తెలంగాణ ఎదుర్కొంటున్న సమస్యలు మరుగున పడిపోతాయి. నిరుద్యోగ సమస్య, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ధరణి లోపాలు, పోడు భూముల అంశం, ఆర్థిక వనరుల లోటు ఇత్యాది సమస్యలు మరుగున పడిపోతాయి. తెలంగాణలో గెలుపు కోసమే జాతీయ పార్టీ నాటకం. కాకపోతే ఇప్పుడు తెలంగాణా అంశం ఏజెండాలో లేదు. తన రాజకీయ ప్రయోజనాల కోసం జన్మనిచ్చిన తెలంగాణను కాదని జాతీయాంశాలతో కేసీఆర్ కొత్త నాటకానికి తెరలేపుతున్నాడు. స్వంత శక్తిని వదిలేసి జాతీయ స్థాయిలో కొత్త శక్తిని పొందగలనని కెసిఆర్ ఎండమావుల కోసం దేవులాడుతున్నాడు.
టీఆర్ఎస్ - తెలంగాణ ఉద్యమం
ఏ పార్టీ అయినా ప్రజలలో స్థానం సంపాదించు కోవడం చాలా అవసరం. తెలంగాణా ఉద్యమకారుల కృషి వలన టీఆర్ఎస్ ప్రజల్లో బలాన్ని పెంచుకోగలిగింది. సంపన్నమైన వర్గాలు, ప్రాంతాలు తమ సంపద ఆధారంగా, మీడియా పైన ఉన్న పట్టువలన ఎన్నికల్లో గెలవడమే కాదు రాజకీయాల్లో నిలదొక్కుకుంటారు. వెనుకబడిన ప్రాంతాలు, అణగారిన వర్గాలు కేవలం ఉద్యమాలద్వారానే రాజకీయాల్లో ఎదగగలరు. తెలంగాణ ప్రజలు తమ లక్ష్య సాధనకు టీఆర్ఎస్ను ఆదరించిన్రు. సమైక్యవాదాన్ని తిరస్కరించి, తెలంగాణా సాధనకోసం టీఆర్ఎస్ వెంట నిలిచారు. తేల్చి చెప్పేదేమిటంటే తెలంగాణ ఉద్యమం లేకుండా టీఆర్ఎస్ ఎదుగుదలను ఊహించలేము. తాను మాత్రమే తెలంగాణ అస్థిత్వాన్ని వ్యక్తీకరించగలనని, ఇతర రాజకీయ పార్టీలకు ముఖ్యంగా జాతీయ పార్టీలకు తెలంగాణ ఒకానొక అంశం మాత్రమే. కాబట్టి ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ మాత్రమే తెలంగాణకు ప్రాతినిధ్యం వహించగలదని చెప్పుకున్నది. తెలంగాణా ప్రజల తరఫున నిలబడే అధికారం, అర్హత తమకు మాత్రమే ఉన్నదని ప్రకటించింది. అయితే ఈ ప్రవచనాలకు వాస్తవానికి చాలా వ్యత్యాసం ఉన్నది.
- ఎం. కోదండ రామ్,
అధ్యక్షులు, తెలంగాణ జన సమితి