ఇవాళ టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థుల ప్రకటన

టీఆర్ఎస్ లోక్ సభ జాబితాకు అంతా సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం సీఎం కేసీఆర్ లిస్ట్ ను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటి వరకు కరీంనగర్ MP అభ్యర్థిగా వినోద్ కూమార్ పేరును తప్ప ఇంకెవరినీ అధికారికంగా ప్రకటించలేదు. ఒకే విడతలో ఇవాళ గులాబీ అభ్యర్ధులను ప్రకటించనున్నారు అధినేత.

ఇప్పటికే కొంత మందికి నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాలని ప్రగతి భవన్ నుంచి సమాచారం వెళ్ళినట్లు తెలుస్తోంది. కరీంనగర్ తో పాటు నిజామాబాద్ , భువనగిరి, మెదక్, వరంగల్, ఆదిలాబాద్ నియోజవకర్గాల్లో సిట్టింగ్ లకే టికెట్ లు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఖమ్మం, మహబూబ్ నగర్, జహీరాబాద్, మహబూబాబాద్ లలో టికెట్లపై సిట్టింగ్ లు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

నల్లగొండ నుంచి సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికే మళ్ళీ అవకాశం ఉంది. మహబూబ్ నగర్ నుంచి సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డితో పాటు ఫార్మా కంపెనీల అధినేత ఎం.శ్రీనివాస్ రెడ్డి పేరుపై చర్చ జరుగుతోంది. అయితే బీజేపీ నుంచి మాజీ మంత్రి డీకే అరుణ పోటీచేసే అవకాశం ఉండటంతో సీనియర్ అయిన జితేందర్ నే బరిలోకి దించుతారని భావిస్తున్నారు.

ఖమ్మం నుంచి సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బదులు నామా నాగేశ్వర్ రావును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పొంగులేటిని వేరే చోట బరిలోకి దించడంపైనా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. మహబూబాబాద్ లో సిట్టింగ్ సీతారాం నాయక్ తో పాటు మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవిత పేరు వినిపిస్తోంది. ఈ సీటును రిటైర్డ్ ఐఏఎస్ రామచంద్రు తేజావత్ కూడా ఆశిస్తున్నారు.

జహీరాబాద్ టికెట్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. బీబీ పాటిల్ తో పాటు కర్నె ప్రభాకర్, మల్కాపురం శివకుమార్, అశోక్ ముస్తాఫ రే పేర్లు పరిశీలన లో ఉన్నట్లు తెలుస్తోంది.

సికింద్రాబాద్, చేవెళ్ళ, మల్కాజ్ గిరి, పెద్దపల్లి, నాగర్ కర్నూల్ నియోజక వర్గాల్లో టికెట్లపై ఆసక్తి కొనసాగుతోంది. నాగర్ కర్నూల్ నుంచి మాజీ మంత్రి పి.రాములు, పెద్దపల్లి నుంచి ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకట స్వామి పేర్లు ఖరారైనట్లు పార్టీలో టాక్.

సికింద్రాబాద్ లో మంత్రి తలసాని కుమారుడు సాయికిరణ్ యాదవ్, చేవెళ్ళలో రంజిత్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.

మల్కాజిగిరి టికెట్ పై చాలా పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మొదట్లో నవీన్ రావు పేరుపై చర్చ జరిగింది. అయితే కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి పేరు ప్రకటించాక టీఆర్ఎస్ నుంచి కూడా అదే సామాజిక వర్గనేతకు ఇవ్వాలని ఆలోచించినట్లు తెలుస్తుంది. దీంతో మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది.

ఇవాళ లిస్ట్ ప్రకటిస్తానని సీఎం KCR స్వయంగా చెప్పడంతో నేతలు, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా చూస్తున్నారు.