రేపు టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్.. హాజరుకానున్న కేటీఆర్

నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో రేపు గురువారం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అధికార టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగుతున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా చండూర్ లో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు తెలిపారు. చండూర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన  గురువారం ఉదయం 11 గంటలకు బంగారిగడ్డ  నుండి చండూర్ వరకు అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ ర్యాలీ ఉంటుందని వివరించారు. 

తెలంగాణపై కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు కక్ష కట్టారు

తెలంగాణపై కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతలు కక్ష కట్టారని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు ఆరోపించారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం నేరమా..?  రైతు బంధు ఇవ్వడం నేరమా?  మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వడం నేరమా..? తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశమంతా కావాలని అడుగుతున్నారని మాపై కక్ష కట్టారా.. ? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వేసే నామినేషన్ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎంతోపాటు మా కార్యకర్తలు కూడా పాల్గొంటారని చెప్పారు.

కుట్రతోనే ఉప ఎన్నికకు తెరలేపారు: సీపీఐ నేత నెలికంటి సత్యం 

డబ్బులు  ఖర్చు అయ్యే ఎన్నిక మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు అవసరమా..?  అన్ని పార్టీల సమయం వృధా అని సీపీఐ నేత నెలికంటి సత్యం పేర్కొన్నారు. పార్టీకి ద్రోహం చేసిన వారికి బుద్ధి చెప్పాలని మునుగోడు ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. 8 సంవత్సరాలలో ప్రజల ప్రయోజనాల కోసం కేంద్రం ఒక్క పథకం తీసుకురాలేదని.. పైగా రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చారని ఆరోపించారు. అప్రజాస్వామ్య పద్దతిలో నిరంకుశ పాలన సాగుతోంది కాబట్టి మోడీ ప్రభుత్వానికి బొంద పెట్టాలని మేము టీఆర్ఎస్ పార్టీకి ఈ ఉప ఎన్నికల్లో మద్దతు ఇస్తున్నామన్నారు.