TRS @ 19 : నేడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం

TRS @ 19 : నేడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం

స్థాపన నుంచి ఎన్నో ఆటుపోట్లు చూసిన గులాబీ పార్టీ

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ పార్టీగా ముందుకు..

ఉప ఎన్నికల్లో వరుస విజయాలు

రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఫక్తు రాజకీయ పార్టీగా రూపాంతరం

వరుసగా రెండోసారి అధికారంలోకి..

తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా 2001 ఏప్రిల్‌ 27న జలదృశ్యంలో పురుడుపోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్‌ ) 18 ఏళ్లు పూర్తి చేసుకుని, 19వ ఏట అడుగుపెట్టిం ది. తెలంగాణలోని సంఘాలు, విద్యార్థులు, రాజకీయ నేతల సహాయంతో ఉధృతంగా ఉద్యమం చేసి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన టీఆర్​ఎస్.. ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఫక్తు రాజకీయ పార్టీగా మారింది.తొలి ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తొలి సీఎంగా కేసీఆర్​ పదవి అధిష్టించారు. ఇటీవల జరిగిన రెండో ఎలక్షన్లలోనూ ఘన విజయం సాధించి, తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ఐదేళ్లలో ఎందరో నేతలు టీఆర్​ఎస్​లోకి వచ్చారు. తొలి నుంచి పార్టీలో ఉన్న కొందరు పార్టీకి దూరమయ్యారు.

పిడికెడు మందితో..

2001 ఏప్రిల్‌ 27న కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం జలదృశ్యం లో టీఆర్​ఎస్​ పార్టీ పురుడు పోసుకుం ది. పార్టీ ఆవిర్భావ సమయంలో తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను వివరించిన కేసీఆర్‌ .. ఉమ్మడి ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ , ఎమ్మెల్యే పదవులకు, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. సుదర్శన్‌ రావు, నాయిని నర్సింహారెడ్డి, హన్మంతరావు, గాదె ఇన్నయ్య, వి. ప్రకాశ్‌ , నిమ్మ నర్సిం హారెడ్డి, నారాయణరెడ్డి, గొట్టె భూపతి, మందాడి సత్యనారాయణరెడ్డి, హరీశ్‌ రావు తదితరులు ఆనాటి కార్యక్రమంలో పాల్గొ న్నా రు. సుమారు ఏడాదికిపైగా జలదృశ్యం లోనే టీఆర్‌ ఎస్‌ పార్టీ కార్యకలాపాలు సాగాయి. 2001 మే 17న కరీంనగర్‌ ఎస్‌ ఆర్‌ ఆర్‌ కాలేజీ గ్రౌండ్‌ లో నిర్వహించిన బహిరంగ సభ ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు బీజం వేసింది. జేఎంఎం చీఫ్‌ , అప్పటి జార్ఖండ్‌ సీఎం శిబూ సోరె న్‌ ఈ మీటింగ్‌ కు చీఫ్‌ గెస్ట్‌‌గా హాజరయ్యారు. తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో కొందరు టీఆర్​ఎస్​ నాయకులు.. జలదృశ్యం లోని పార్టీ కార్యా లయంపై ఫర్నీచర్‌ , కంప్యూ టర్‌ ధ్వంసం చేశారు. దాం తో పార్టీ కార్యకలాపాలు నందినగర్‌ లోని కేసీఆర్‌ నివాసానికి మారాయి. ఆరు నెలల తర్వాత ఎమ్మెల్యే కాలనీలోని మాజీ మంత్రి వేదంతరావు ఇంటికి పార్టీ కార్యాలయాన్ని మార్చారు. 2004లో వైఎస్‌ ప్రభుత్వం బంజారాహిల్స్‌‌ రోడ్​ నంబర్​ 12లో ప్రస్తుతం తెలంగాణ భవన్​ ఉన్న స్థలాన్ని టీఆర్‌ ఎస్‌ కు కేటాయించింది. ప్రస్తుతం క్యాంటీన్‌ నిర్మిస్తున్న స్థలంలో రేకుల షెడ్డు వేసి టీఆర్​ఎస్​ పార్టీ ఆఫీసు నిర్మాణాన్ని ప్రారంభిం చారు. 2006లో తెలంగాణ భవన్‌ ను ప్రారంభించారు.

బస్సు గుర్తు నుంచి కారు గుర్తు వరకు

2001లో జరిగిన సిద్దిపేట అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఈసీ కేసీఆర్‌ కు బస్సు గుర్తును కేటాయించింది. అదే ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్​ఎస్​కు రైతు నాగలి గుర్తును కేటాయించారు. కరీంనగర్‌ , నిజామాబాద్‌ జిల్లా పరిషత్‌ పీఠాలను టీఆర్‌ ఎస్‌ సొంతం చేసుకుం ది. 2004 ఎన్నికల్లో ఫ్రీ సింబల్‌ గా కారు గుర్తును టీఆర్‌ ఎస్‌ కు కేటాయించారు. ఆ ఎన్నికల్లో ఐదుగురు ఎంపీలు, 26 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ ఎన్నికల్లో వచ్చిన ఓట్‌ షేర్‌ తో ఈసీ టీఆర్‌ఎస్‌ కు కారు గుర్తును పర్మినెంట్‌ సింబల్‌ గా కేటాయించింది.

70 లక్షల సభ్యత్వాలు.. కానరాని నిర్మాణం

70 లక్షల సభ్యత్వాలు ఉన్న టీఆర్‌ ఎస్‌ పార్టీకి క్షేత్రస్థాయి నిర్మాణం మాత్రం పెద్దగా కనిపించదు. పార్టీ రాష్ట్ర కార్యవర్గం మినహా జిల్లా , మండల, గ్రామ కమిటీలు లేవు. విద్యార్థి విభాగం మినహా మిగతా అనుబంధ విభాగాల్లేవు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత టీఆర్‌ ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నియమితుడైన కేటీఆర్​ చుట్టే పార్టీ వ్యవహారాలు తిరుగుతున్నా యి. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం సభ్యత్వ నమోదు, నిర్మాణంపై దృష్టి పెడతామని, జిల్లా కార్యాలయాలు నిర్మిస్తామని ఆయన చెప్పారు.

1 MLA నుంచి 88 మందికి ఎదిగింది

2001లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కేసీఆర్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ ఎస్‌ తరపున గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. కొన్నాళ్ల తర్వాత సిరిసిల్ల కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రేగులపాటి పాపారావు, అలంపూర్‌ బీజేపీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్‌ రెడ్డి టీఆర్‌ ఎస్‌ లో చేరారు. కేసీఆర్​ తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను జయశంకర్‌ సార్‌ తో కలిసి జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. దాంతో 2004 ఎలక్షన్లలో టీఆర్​ఎస్​తో పొత్తుకు కాంగ్రెస్‌ , సీపీఐ ముందుకు వచ్చాయి. కాంగ్రెస్​తో టీఆర్​ఎస్​ జట్టుకట్టడంలో కేంద్ర మాజీ మం త్రి గడ్డం వెంకటస్వామి (కాకా ) కీలకపాత్ర పోషించారు. ఆ ఎన్నికల్లో 26 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు టీఆర్‌ ఎస్‌ తరపున గెలిచారు. పొత్తుల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చేరిన టీఆర్‌ ఎస్‌ … కేంద్రంలో ఒక కేబినెట్‌ , సహాయ మంత్రి పదవులతోపాటు రాష్ట్రంలో ఆరు కేబినెట్‌ బెర్తులను దక్కించుకుంది. అయితే కాంగ్రెస్‌ మాట నిలబెట్టుకో లేదంటూ ప్రభుత్వాల నుంచి టీఆర్‌ ఎస్‌ బయటికి వచ్చింది. కేసీఆర్‌ రెండు సార్లు ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలిచారు. ఇదే సమయంలో కొందరు ఎమ్మెల్యేలు కేసీఆర్‌ తో విభేదించి కాంగ్రెస్‌ గూటికి చేరగా, ఉప ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేలు ఓడిపోయారు.

2009లో టీడీపీతో టీఆర్‌ఎస్‌ జట్టుకట్టింది. కానీ ఇద్దరు ఎంపీలు, పది మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. ఉద్యోగ నియామకాల్లో హైదరాబాద్‌ ను ఫ్రీ జోన్‌ గా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పింది. కేసీఆర్‌ ఆమరణ దీక్షకు సిద్ధపడటం, ఆయనను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శ్రీకాంతాచారి ఆత్మబలిదానం, శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణవాదుల్లో ఆకాంక్షను మరింత రగిల్చింది. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా సాగిన ఉద్యమాన్ని అందిపుచ్చుకుని సబ్బండ వర్ణాలు ఆందోళన బాటపట్టాయి. మొత్తానికి 2014 జూన్‌ 2న తెలంగాణ ఉనికిలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో 63 అసెంబ్లీ సీట్లలో గెలిచిన టీఆర్‌ఎస్‌ .. ఇటీవలి ఎలక్షన్లలో 88 సీట్లలో గెలిచింది. రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.