మునుగోడు విజయంతో టీఆర్ఎస్ కార్యకర్తల్లో జోష్

హైదరాబాద్: మునుగోడు బైపోల్ లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం ఖాయం కావడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బాణా సంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కేసీఆర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి విజయోత్సవ ర్యాలీలు తీశారు. ఇవాళ ఉదయం మొదలైన కౌంటింగ్ లో13  రౌండ్లు ముగిసే సమయానికి మొత్తంగా టీఆర్ఎస్ కు 9,039 ఓట్ల ఆధిక్యం లభించింది. ఇక రెండు రౌండ్లే మిగిలి ఉన్నాయి. ఫలితాల సరళిని బట్టి చూస్తే మిగతా రెండు రౌండ్లలో కూడా టీఆర్ఎస్ పార్టీకే ఆధిక్యం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఇకపోతే నెల రోజులుగా రాజకీయ పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన మునుగోడు బైపోల్ ఈ నెల 3న జరిగింది. ఇవాళ మునుగోడు బైపోల్ కు సంబంధించి కౌంటింగ్ మొదలైంది. ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ లో చెప్పినట్లుగానే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం దిశగా దూసుకుపోతున్నారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెండో స్థానంలో నిలువనుండగా... కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి డిపాజిట్ కూడా దక్కలేదు. మునుగోడులో టీఆర్ఎస్ విజయం దిశగా దూసుకుపోతున్న క్రమంలో ఆ పార్టీ కార్యకర్తల్లో జోష్ కనిపిస్తోంది.