హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీకి సందు ఇవ్వొద్దని బైపోల్ ఇన్‌చార్జులకు టీఆర్‌ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి 86 యూనిట్ల ఇన్‌చార్జులతో ఆయన తరచూ రివ్యూ చేస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఓటరును కలిసి టీఆర్‌ఎస్‌కు మద్దతు పలికేలా ప్రయత్నించాలని, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను సైతం కలవాల్సిందేనని చెబుతున్నారు. ఈ బైపోల్ టీఆర్‌ఎస్‌కు అత్యంత కీలకమని, జనరల్ ఎలక్షన్స్ కు ఏడాది ముందు జరుగుతున్న ఈ ఎన్నిక ప్రభావం వాటిపైనా పడుతుందని అంటున్నారు. నియోజకవర్గంలో 2.41 లక్షల మంది ఓటర్లుండగా, వారిలో 2.38 లక్షల మంది ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఉన్నారని.. వారిని మెప్పించి టీఆర్‌ఎస్‌కు ఓటు వేసేలా చూడాలని సూచిస్తున్నారు.
రిపోర్టుల ఆధారంగా ఆరా..
నియోజకవర్గంలోని ఏడు మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో ఎక్కడెక్కడ ఏ పార్టీ బలంగా ఉంది? అనే దానిపై రోజుకో సర్వే సంస్థ టీఆర్‌ఎస్ హెడ్ క్వార్టర్స్‌కు నివేదిక ఇస్తోంది. ఆ నివేదికల ఆధారంగా ఏయే పార్టీల్లో ఎవరెవరు ప్రభావం చూపిస్తున్నారు? వారిని టీఆర్‌ఎస్‌లోకి రప్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై యూనిట్ ఇన్‌చార్జులకు మంత్రి కేటీఆర్ సూచనలు చేస్తున్నారు. సర్వే రిపోర్టులతో పాటు గ్రౌండ్ రియాలిటీస్‌ను మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కేసీఆర్‌కు రిపోర్టులు ఇస్తున్నారు. ఆయా రిపోర్టుల ఆధారంగా యూనిట్ ఇన్‌చార్జులతో కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడుతున్నారు.
ఏజెన్సీలతో పాటు ఇంటెలిజెన్స్ సర్వేలు..
మునుగోడులో పరిస్థితులపై సర్వే సంస్థలతో పాటు ఇంటెలిజెన్స్ వర్గాలు ఎప్పటికప్పుడు రిపోర్టు ఇస్తున్నాయి. వీటి ఆధారంగానే పార్టీ ఇన్‌చార్జులతో కేసీఆర్ రివ్యూ చేస్తున్నారు. అన్ని సర్వేలు టీఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయని చెప్తూనే బీజేపీ బలంగా ఉన్న చోట్ల ఎలాంటి వ్యూహాలు అనుసరించాలో సూచనలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఏమాత్రం నిర్లక్ష్యం వద్దని, ఈ నెలాఖరు వరకు ఏ ఒక్కరూ తమకు కేటాయించిన యూనిట్‌ను విడిచి రావొద్దని సూచిస్తున్నారు. తాను ఈ నెల 30న ఎన్నికల ప్రచారానికి వస్తానని, అందరూ ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొనాలని దిశానిర్దేశం చేస్తున్నారు.
కేసీఆర్‌ను కలిసిన రాపోలు
బీజేపీ నేత రాపోలు ఆనంద్ భాస్కర్ ఆదివారం రాత్రి ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. కేంద్రం చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ వేయడం సరికాదని రాపోలు అన్నట్లు సీఎంవో ప్రకటన విడుదల చేసింది. ఆయన టీఆర్ఎస్లో చేరబోతున్నట్టు పేర్కొంది.