ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాను టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసినట్లయింది. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. 2018 సాధారణ ఎన్నికల తర్వాత నల్గొండ జిల్లాలో మొత్తం మూడు ఉప ఎన్నికలు జరగగా.. అన్నిచోట్లా టీఆర్ఎసే గెలిచింది.
2018 సాధారణ ఎన్నికల్లో హుజూర్నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఆయన నల్గొండ ఎంపీగా కూడా గెలవడంతో హుజూర్ నగర్ ను వదులుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో హుజూర్ నగర్ లో ఉపఎన్నిక జరగగా కాంగ్రెస్ అభ్యర్థి గా పోటీ చేసిన ఉత్తమ్ సతీమణి పద్మావతి పై టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి విజయం సాధించారు.
ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య అకాల మరణంతో వచ్చిన నాగార్జున సాగర్ ఉపఎన్నికలో కూడా టీఆర్ఎస్ విజయం సాధించింది. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పై పోటీ చేసిన నోముల నరసింహయ్య కుమారుడు నోముల భగత్ విజయం సాధించారు. తాజాగా మునుగోడులో బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్ రెడ్డి పై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10,341 ఓట్ల తేడాతో గెలిచారు.