కేంద్రం, రాజగోపాల్ మధ్య క్విడ్ ప్రో కో ఆరోపణలు.. ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు

మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసింది. కేంద్రం, రాజగోపాల్ మధ్య క్విడ్ ప్రో కో జరిగిందని అందులో ప్రస్తావించింది. బీజేపీలో చేరేందుకు ప్రతిఫలంగా ఆయన కేంద్రం నుంచి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టులు పొందినట్లు టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ భరత్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కు కంప్లైంట్ చేశారు. ఓ టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వయంగా ఆరు నెలల క్రితం తమ కంపెనీకి రూ.18వేల కోట్ల విలువైన కాంట్రాక్టు దక్కిన విషయాన్ని  ప్రస్తావించారని చెప్పారు. ఓపెన్ బిడ్డింగ్లో కాంట్రాక్ట్ దక్కిందని చెప్పిన ఆ ఇంటర్వ్యూ లింకును ఫిర్యాదుతో జత చేశారు. ఈ అంశంపై ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

విచారణ జరిపి చర్యలు తీసుకోండి

పార్టీలో చేరేందుకు కేంద్రం నుంచి కాంట్రాక్టులు తీసుకోవడం అనైతికమే కాకుండా ఐపీసీ, అవినీతి నిరోధకచట్టం ప్రకారం శిక్షార్హమని కంప్లైంట్ కాపీలో టీఆర్ఎస్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ రాజగోపాల్ రెడ్డి, కేంద్రం మధ్య జరిగిన క్విడ్ ప్రోకో వ్యవహారంపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేపట్టాలని కోరింది.  మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డి పోటీ చేయకుండా నిషేధించాలని విజ్ఞప్తి  చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని సీఈసీని కోరింది.

కేటీఆర్కు రాజగోపాల్ సవాల్

ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరు నెలల క్రితం తమ కంపెనీకి రూ.18వేల కోట్ల విలువైన కాంట్రాక్టు దక్కిందని చెప్పారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారడంతో మంత్రి కేటీఆర్ దాన్ని ట్విట్టర్లో పోస్టు చేశారు. రూ.18వేల కోట్ల కాంట్రాక్టు దక్కినందుకే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని,  ఇది క్విడ్ ప్రో కో కాక మరేమిటని కేటీఆర్ ప్రశ్నించారు. మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన రాజగోపాల్ రెడ్డి 24గంటల్లో తనపై చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఈ క్రమంలోనే తాజాగా టీఆర్ఎస్ పార్టీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.