- తిరుగుబాటు క్యాండిడేట్లు పెద్ద సంఖ్యలో ఉండటంతో రంగంలోకి కేటీఆర్
- పిలిపించుకుని సంప్రదింపులు.. ఎమ్మెల్యేలతో ఒత్తిళ్లు
- ఇప్పటికిప్పుడు ఏదైనా ప్రయోజనం.. భవిష్యత్తులో నామినేటెడ్ పదవులు!
- వినకుంటే పార్టీ నుంచి బహిష్కరణ.. మళ్లీ రానియ్యబోమని స్పష్టం
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో టీఆర్‌ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను బుజ్జగించడంపై పార్టీ హైకమాండ్ దృష్టి పెట్టింది. పోటీ నుంచి తప్పుకుంటే ఇప్పటికిప్పుడు ఏదైనా ప్రయోజనం కల్పించడంతోపాటు భవిష్యత్‌లో నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీలు ఇస్తోంది. పోటీ నుంచి తప్పుకోకుంటే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటదని హెచ్చరిస్తోంది. టీఆర్ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో రెబెల్స్ బరిలో ఉండటంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బేగంపేట క్యాంపు ఆఫీసులో మీటింగ్ పెట్టారు. నామినేషన్లు వేసిన రెబెల్స్‌తో సంప్రదింపులు జరిపారని.. పార్టీ క్యాండిడేట్ల గెలుపోటములపై ఎఫెక్ట్ చూపే వారితో మాట్లాడారని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.
కనీసం సగం సీట్లలో..
150 డివిజన్లకు టీఆర్‌ఎస్ నుంచి 527 నామినేషన్లు దాఖలయ్యాయి. చాలా చోట్ల ఆరుగురు నామినేషన్లు వేశారు. కనీసం సగం సీట్లలో రెబెల్స్ ప్రభావం ఉండొచ్చని గుర్తించిన టీఆర్ఎస్ హైకమాండ్.. వారిని బుజ్జగించడానికి పూనుకుంది. ఈ క్రమంలోనే కేటీఆర్ తిరుగుబాటు క్యాండిడేట్లతో మాట్లాడారు. కొన్నిచోట్ల తమకు నచ్చని వారికి హైకమాండ్ టికెట్లు ఇచ్చిందన్న ఉద్దేశంతో కొందరు ఎమ్మెల్యేలు వారి అనుచరులతో నామినేషన్లు వేయించారు. అలాంటివారిని ఆయా ఏరియాల ఎమ్మెల్యేల ముందే కూర్చోబెట్టి.. నామినేషన్లు విత్‌డ్రా చేసుకునేలా కేటీఆర్ ఒత్తిడి చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. నామినేషన్ల ఉప సంహరణకు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంది. ఆలోగా రెబెల్స్ తో విత్ డ్రా చేయించాలని ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జులను కేటీఆర్ఆదేశించినట్టు సమాచారం. రెబెల్స్‌తో ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు చర్చలు జరుపుతుండగా.. పార్టీపై ఎక్కువ ఎఫెక్ట్ చూపించే నేతలను కేటీఆర్ వద్దకు పిలిపించారు. పోటీ నుంచి తప్పుకోని వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నట్టు సమాచారం.