రవీందర్ సింగ్ ను ఎందుకు సస్పెండ్ చేయాలి?

కరీంనగర్ లో మంత్రి గంగులకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ నేత, మాజీ మేయర్ రవీందర్ సింగ్ బంధువు కార్పొరేటర్ కమల్జిత్ కౌర్ భర్త సోహెన్ సింగ్ ఓ వ్యాపారితో మాట్లాడినట్టు చెబుతున్న ఫోన్ సంభాషణ వైరల్ గా మారింది. దీనిపై టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుకు కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. రవీందర్ సింగ్, కమల్జిత్ కౌర్, సోహెన్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. కార్పొరేటర్ల ఫిర్యాదును వెంటనే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని  రామకృష్ణారావు హామీ ఇచ్చారు

ఫోన్ సంభాషణ పై సోహెన్ సింగ్ వివరణ 

తన ఆడియో వల్ల పార్టీ పరువు పోయిందని మాట్లాడుతున్న కార్పొరేటర్లు నిజమైన ఉద్యమకారులు కాదని  సోహెన్ సింగ్ అన్నారు, ఆడియోలో మాట్లాడింది తానైతే, రవీందర్ సింగ్ ను ఎందుకు సస్పెండ్ చేయాలని అడుగుతున్నారంటూ కార్పొరేటర్లను ఆయన ప్రశ్నించారు. నిజంగా తమ వల్ల పార్టీకి నష్టం జరిగితే తాను, తన భార్య రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.  తమ డివిజన్లో నీళ్లు రాకుండా మంత్రి సతాయించాడని, నీళ్ల కోసం తన భార్య కౌన్సిల్ సమావేశంలో ప్రజల కోసం ఆందోళన చేసిందని  సోహెన్ సింగ్ తెలిపారు. 

తన భార్యను ఓడించేందుకు జి.కె.యూత్(జి.కె- గంగుల కమలాకర్ యూత్) తమ డివిజన్లో పనిచేసారని సోహెన్ సింగ్ ఆరోపణలు చేశారు. ఇదే విషయం మంత్రి గంగులకు చెబితే పట్టించుకోలేదన్నారు. తమ మీద కుట్రలు జరుగుతున్నాయని ఆడియోలో చెప్పిన మాటలకు తాను కట్టుబడి ఉన్నానని, అందులో  తప్పుంటే క్షమాపణ చెబుతానని  సోహెన్ సింగ్  తెలిపారు.  పార్టీ పరువు పోవద్దనే ఇన్ని రోజులు ఈ విషయాలన్నీ బయటపెట్టలేదన్నారు. తనని, తన భార్యను సస్పెండ్ చేయాల్సి వస్తే... అంతకంటే ముందుగా  గలీజ్ పనులు చేసే వాళ్లను సస్పెండ్ చేయాలన్నారు.