టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కొంతే.. చేయాల్సింది ఎంతో

ఇటీవలి ఎలక్షన్స్​లో టీఆర్ఎస్​కు ఆశించిన ఫలితాలు ప్రజలు అందించకపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. ప్రజలకు సీఎం అందుబాటులో లేకపోవడం, ఆశపెట్టుడు ఎక్కువ.. ఇచ్చింది తక్కువ కావడం, అధికార యంత్రాంగంలో సేవాభావం లోపించడం, వరదలు వచ్చినపుడు పరిహారం ఇంటి ఓనర్లకిచ్చి కిరాయికున్న వారికి ఇవ్వకపోవడం, డబుల్ బెడ్రూం ఇండ్లు అలాట్ చేయకపోవడం ఇలా చిన్నా పెద్దా చాలా కారణాలు టీఆర్ఎస్​కు ఇబ్బందులు తెచ్చాయి. ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేసింది కొంతే. చేయాల్సింది ఎంతో ఉంది. ప్రభుత్వం చేయాలని ప్రజలు కోరుతున్నవి, వారి మనసులో ఉన్నవి కలిపితే ఒక చిన్న ప్రణాళిక అవుతుంది. అవేంటంటే.. ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిన ఉద్యమకారుల కోరికలను తీర్చడం ఎంతో అవసరం. ముఖ్యంగా 1969 నాటి ఉద్యమకారులకు తగిన గుర్తింపు ఇవ్వాలి. అందు కోసం విస్తృత కమిటీని ఏర్పాటు చేయాలి. 1969 ఉద్యమం సందర్భంగా కేసుల్లో ఇరుక్కుని జైలుపాలైన వారిని గౌరవించాలి. మలి దశ ఉద్యమంలో కష్టాలు పడి, జైలు కెళ్లిన, లాఠీ దెబ్బలు తిన్న విద్యావంతులకు కనీస వేతనాలతో ఉద్యోగం లేదా ఉపాధి కల్పన అందించాలి. మలి దశ ఉద్యమంలో  బలిదానం చేసుకున్న వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం లేదా త్రిపుల్​ బెడ్రూంల ఇల్లు ఇవ్వాలి. వారి సొంతూరిలో తెలంగాణ తల్లితోపాటు అమరుల విగ్రహాలు ఏర్పాటు చేయాలి. స్వయం ఉపాధి పథకాలు తేవాలి బీసీల వ్యక్తిగత స్వయం ఉపాధి కోసం రూ.10,000 కోట్లు లోన్లు, సబ్సిడీలు ఇవ్వాలి. ఎస్సీలకు రూ.5,000 కోట్లు, ఎస్టీలకు రూ.3,000 కోట్లు, మైనారిటీలకు రూ.5,000 కోట్లు ఖర్చు చేయాలి. ఈ 4 సామాజిక వర్గాలు కలిసి 85–89 శాతం ఉంటారు. వీరి అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి. ప్రధానంగా వీరికే ఓన్ యువర్ హౌస్​ స్కీం కింద డబుల్, త్రిబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలి. ఇందు కోసం ఏటా రూ.8,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. 70 కులాల వారీ అభివృద్ధి కార్పొరేషన్లకు వంద కోట్ల చొప్పున బడ్జెట్ కేటాయించాలి. కుల భవనాలు నిర్మాణం, కుల సంఘాల ఎన్నికల నిర్వహణను సహకార శాఖ పరిధిలోకి తేవాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో అర్హులైన అందరికీ పదో తరగతి తర్వాత పీజీ వరకు ఉచితంగా చదివించాలి. ఓన్ యువర్ క్యాబ్, ఆటో, వ్యాన్, మినీ లారీ, మినీ బస్ స్కీంల ద్వారా 10 లక్షల మందికి చేయూత అందించాలి. పాత జిల్లా కేంద్రాల్లో 5 వేల మంది అర్హులైన మహిళలకు సాఫ్ట్​ వేర్ ఉద్యోగాలు కల్పించాలి. చేయూతతో జీవన భద్రత 45 ఏండ్లలోపు ఎవరు చనిపోయినా వారి కుటుంబానికి రూ.5 లక్షలు చేయూత అందించాలి. తెలంగాణ నుంచి గల్ఫ్ వెళ్లే వారి వివరాలతో ప్రత్యేక రిజిస్టర్ రెడీ చేయాలి. నెలవారీగా రికార్డులను నిర్వహించాలి. సింగరేణి, ఆర్టీసీలో పని చేసే వారికి 15 ఏండ్ల సర్వీసు పూర్తయితే ఉద్యోగ విరమణ సౌకర్యం కల్పించాలి. సుమారు 30 లక్షల మంది అసంఘటిత రంగ కూలీలు, కార్మికులు, వ్యవసాయ కూలీలకు ప్రావిడెంట్ ఫండ్ ఏర్పాటు చేయాలి. సబ్సిడీలు, రాయితీలు వాటిలోనే జమ చేయాలి. చేనేత, పవర్ లూం కార్మికులు, వ్యవసాయదారులు, కూలీలకు రోజుకు కనీసం రూ.500 గిట్టుబాటు కల్పించాలి. అడవుల పెంపకం స్థానికులకు అప్పగించాలి. దిగుమతులు లేని విధానం రావాలి వ్యవసాయంలో నూతన విధానాల ద్వారా దిగుమతులు లేని స్వయం పోషక విధానం తీసుకురావాలి. రైతుబంధు డబ్బులు కౌలుదార్ల ఖాతాలో జమ చేయడం ద్వారా సరైన పంటల నిర్వహణ చేపట్టవచ్చు. తద్వారా 10–15 లక్షల మంది కౌలు రైతులకు భద్రత, రక్షణ చేకూరుతుంది. అలాగే పంటలకు మద్దతు ధర నిర్ణయించి కొనుగోలు చేయాలి. దిగుమతులు నిలిపేసేలా నూనె గింజల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాలి. కుల వృత్తులతో ఉపాధి పొందే వారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి. హైదరాబాద్ అభివృద్ధికి ప్రాధాన్యత హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ కు అటు ఇటు 2 లేదా 3 బెడ్రూం ఇండ్లు సబ్సిడీపై నిర్మించి అర్హులకు ఇవ్వాలి. తొలి దశలో 70,000 ఇండ్ల నిర్మాణం చేపట్టాలి. చంచల్ గూడ జైలు స్థానంలో 4 వేల పడకలతో ప్రభుత్వ హాస్పిటల్ నిర్మించాలి. ఉస్మానియా హాస్పిటల్ కోసం నూతన భవన నిర్మాణం చేపట్టాలి. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల్లో అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే కొత్త కోర్సులు పెట్టాలి. యూనివర్సిటీ బిల్డింగ్​ల కోసం రూ.500 కోట్లు కేటాయించాలి. కొత్త యూనివర్సిటీలకు రూ.200 కోట్ల గ్రాంట్​ ఇవ్వాలి. మానవ వనరులు అభివృద్ధి చేయాలి ప్రతి మున్సిపాలిటీలో ఆధునిక సౌకర్యాలతో సీనియర్ సిటిజన్స్ కు హాస్టల్స్ ఏర్పాటు చేయాలి. వన మూలికలు చిరు ధాన్యాల పంటలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించాలి. ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. నీటితో నడిచే కార్లు, బస్సులు, వాహనాల తయారీకి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అంగన్​వాడీలను చక్కని డాక్టర్ సెంటర్లుగా మార్చాలి. యోగా, ధ్యాన శిక్షణ, ప్రకృతి వైద్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి. దశలవారీగా మద్యనిషేధం అమలు చేయాలి. ఉపాధి కల్పనకు ప్రాధాన్యతనిచ్చే పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. ఐదేండ్లలో ప్రభుత్వ, ప్రజల ఆదాయం రెట్టింపయ్యేలా అభివృద్ధి నమూనాకు రూపకల్పన చేస్తే అది ఇతర రాష్ట్రాలు, మూడో ప్రపంచ దేశాలకు కూడా ఒక నమూనాగా ఉపయోగపడుతుంది. అన్ని రంగాల్లో ఎగుమతులున్నా, దిగుమతులు అవసరం లేని ఆర్థిక స్వావలంబన సాధించి, ఉపాధి కల్పించడమే ఇందులో మౌలికాంశం. అందరికీ సబ్సిడీలు అందాలి రూ.350కే బియ్యం, మక్కలు, గోధుమలు,  పప్పులు, నూనెలు తదితర తొమ్మిది సరుకులను సబ్సిడీపై అందజేయాలి. ఆడవారికి బతుకమ్మ చీరలు, మగ వారికి రెండు చొక్కాలు లేదా నాలుగు లుంగీలు ఇవ్వాలి. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో కేజీ టు డిగ్రీ వరకు ఉచితంగా టెక్స్ట్​ బుక్స్​ అందించాలి. ప్రతి నియోజకవర్గంలో  ఇప్పుడున్న రెసిడెన్షియల్​ స్కూళ్లను రెట్టింపు చేయాలి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్టు, తాత్కాలిక ఉద్యోగులుగా పరిగణించి అర్హులైన వారికి సబ్సిడీపై డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలి. ఔట్ సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్టు ఉద్యోగులుగా మార్చి క్రమంగా క్రమబద్ధీకరించాలి. ప్రతి జిల్లాలో ఒక 2,000 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేయాలి. కులాంతర వివాహాలు చేసుకునే వారికి రూ.2.5 లక్షల ప్రోత్సాహకాలు ఇవ్వాలి. వారి తొలి ఇద్దరు సంతానానికి ఏడాదిలోగా రూ.లక్ష ప్రభుత్వమే డిపాజిట్ చేయాలి. బీఎస్ రాములు, తెలంగాణ బీసీ కమిషన్‌‌ మాజీ చైర్మన్ For More News.. బీజేపీ అధికారంలోకి వస్తే జూరాల లిఫ్ట్ కట్టి తీరుతం ప్రమోషన్లపై ఏపీ, తెలంగాణాలకు హైకోర్టు ఆదేశం కరోనా ఎఫెక్ట్: క్రిస్మస్, న్యూఇయర్​కు.. ఎవరింట్ల వాళ్లే