చెట్ల కిందే జీపీ మీటింగులు

  • చెట్ల కిందే జీపీ మీటింగులు
  • 2018లో తండాలను పంచాయతీలుగా మార్చిన సర్కారు

పెద్దపల్లి, వెలుగు:  తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చినట్టు  ప్రకటించుకుంటున్న టీఆర్ఎస్ ​ప్రభుత్వం సౌకర్యాల కల్పనలో మాత్రం విఫలమైంది. 2018లో తండాలను పంచాయతీలుగా మార్చినా జీపీ బిల్డింగులు నిర్మించకపోవడంతో నాలుగేండ్ల నుంచి ఆయా తండాల సర్పంచులు కలెక్టరేట్లు, పంచాయతీ రాజ్ శాఖ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

రూ.737 కోట్లు మంజూరు..

తెలంగాణవ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా కొత్త జీపీ భవనాల కోసం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ఇటీవల రూ.737 కోట్లు మంజూరు చేశారు. పంచాయతీలకు పర్మినెంట్ బిల్డింగులు ఉండాలని 3,686 జీపీలకు ఒక్కో బిల్డింగ్​కోసం రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త బిల్డింగుల మంజూరులో ఎస్టీ పంచాయతీలకు ప్రాధాన్యమిస్తున్నట్లు మంత్రి చెప్పారు. కానీ చాలా తండాలు ప్రభుత్వం ప్రకటించిన లిస్ట్ లో లేకపోవడంతో ఆయా జీపీల సర్పంచులు ఆందోళన చెందుతున్నారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బామ్లానాయక్ తండా, ఓదెల మండలంలోని నామ్సానిపల్లి నుంచి విడిపోయిన తండాకు ఇప్పటి వరకు బిల్డింగ్ మంజూరు కాలేదు. కొత్త లిస్టులో ఈ జీపీల పేరు రాలేదు. దీంతో సదరు సర్పంచులు మంత్రి కేటీఆర్, ఎర్రబెల్లికి ట్వీట్ చేసినా పట్టించుకోవడంలేదని తెలిపారు. వెంటనే ప్రభుత్వం సమస్యను గుర్తించి అన్ని తండాలకు బిల్డింగ్​ ఫండ్ రిలీజ్ చేయాలని కోరుతున్నారు. 

చెట్ల కిందనే మీటింగులు..

గ్రామ పంచాయతీలకు బిల్డింగులు లేకపోవడంతో ఏ సమావేశం జరిగినా చెట్ల కిందే నిర్వహిస్తున్నారు. జీపీల్లో సరైన ఫెసిలిటీస్ లేక పాలక వర్గాలు, స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీ ఆఫీసులో సర్పంచ్, ఉప సర్పంచ్​తో పాటు వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి, కంప్యూటర్, ఇతర ఫర్నిచర్ తో పాటు, ముఖ్యమైన వాటిని భద్రపరుచుకోవడానికి సరైన వసతి లేదు. ప్రస్తుతం నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రెండు నెలలకు ఒకసారి గ్రామసభ నిర్వహించాలి. ఈ గ్రామసభకు పాలకవర్గంతోపాటు కో ఆప్షన్​ మెంబర్స్, గ్రామాధికారులు, గ్రామస్తులు పాల్గొంటారు. పక్కా భవనాలు లేని కారణంగా మీటింగ్​లు చెట్ల కిందే ఏర్పాటు చేస్తున్నారు. మహిళా సభ్యులు, సిబ్బంది చెట్ల కింద మీటింగులు ఏర్పాటు చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వం, కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగులకు నిధులు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

మంత్రికి ట్వీట్  చేసినా పట్టించుకోలే


పంచాయతీ రాజ్ శాఖ జీపీ నూతన బిల్డింగుల కోసం ప్రకటించిన లిస్ట్​లో చాలా తండాల పేర్లు లేవు. మా తండా పేరుకూడా లేకపోవడంతో మినిస్టర్​కేటీఆర్​కు ట్వీట్ చేశాను. అయినా మంత్రి పట్టించుకోలేదు. మా తండాకు అవార్డు కూడా వచ్చింది. జీపీ బిల్డింగ్​లేక నాలుగేళ్లుగా చెట్లకిందే సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కొత్త బిల్డింగ్​కోసం నిధులు మంజూరు చేయాలి.
-
రాజు నాయక్, సర్పంచ్,  బామ్లానాయక్ తండా

ఆఫీసు లేక ఇబ్బందిగా ఉంది

గ్రామ పంచాయితీ ఆఫీసు లేకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉంది. గంటల తరబడి సమావేశాలు చెట్ల కింద, స్కూల్ పరిసరాల్లో ఏర్పాటు చేయడం వల్ల మహిళలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వెంటనే ప్రభుత్వం మా తండాకు జీపీ బిల్డిండ్ నిధులు మంజూరు చేయాలి. - స్వప్న, వార్డు మెంబర్, 

లంబాడి తండా, ఓదెల