టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసమే రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేసింది : మంత్రి ప్రశాంత్ రెడ్డి

తెలంగాణపై కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గణేష్ గుప్తా సమావేశమయ్యారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద కళ్లాలు కట్టొద్దంటూ రైతులపై కూడా కేంద్రం కక్ష కట్టిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్  రైతులకు మేలు చేసే నిర్ణయం తీసుకుంటే మోడీ సర్కార్ వద్దని హుకుం జారీ చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు కింద రూ.57 వేల కోట్లు ఇస్తే.. వాటిలో రూ.2100 కోట్లు నిజామాబాద్ జిల్లాకు ఇచ్చామని చెప్పారు. పంట కొనుగోలు విషయంలో ప్రతి గ్రామంలోనూ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ సర్కారుదే అని చెప్పారు. రూ.1 లక్షా 7 వేల కోట్ల రూపాయల ధాన్యం ఇప్పటికే సేకరించామన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి.. కరెంటు విషయంలో రూ.36 వేల కోట్లు కేటాయించామని తెలిపారు.

రూ.లక్షన్నర కోట్లు తమ ప్రభుత్వం ప్రాజెక్టులపై ఖర్చు చేసిందని మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో రైతుల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఇతర రాష్ట్రాల్లో చేపలను ఎండబెట్టడానికి కళ్లాలకు డబ్బులు ఇస్తుంటే.. ఇక్కడ మాత్రం రైతులు ధాన్యం ఆరబోసుకునే కళ్లాలకు కూడా ఎన్ఆర్జీఎస్ కింద ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రేపు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రైతుల పక్షాన మహాధర్నాకు పిలుపునిస్తున్నామని మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పారు. 

బీఆర్ఎస్ అంటే బడుగు, బలహీనవర్గాల సమితి

బీఆర్ఎస్ అంటే భారత రక్షణ సమితి అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. బడుగు, బలహీన వర్గాల సమితి అని చెప్పారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదన్నారు. 

బెదిరించి పార్టీలో చేర్చుకున్నరు

మాట వింటే కేసులు మాఫీ.. ఇదీ బీజేపీ తంతు అని  ఎమ్మెల్యే గణేష్ గుప్తా అన్నారు. ఏపీకి చెందిన సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ మీద కేసులుపెట్టి.. బెదిరించి బీజేపీ పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు.