విశ్లేషణ: 317 జీవోతో ఉద్యోగులే కాదు.. నిరుద్యోగులకూ నష్టమే

ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నినాదం నీళ్లు, నిధులు, నియమాకాలు. అయితే తెలంగాణ ఏర్పడి ఏడేండ్లు గడుస్తున్నా.. వీటిలో ఏ ఒక్క దానిని కూడా చిత్తశుద్ధితో నెరవేర్చేందుకు టీఆర్ఎస్​ ప్రభుత్వం ప్రయత్నించడం లేదు. ముఖ్యంగా నియామకాల విషయంలో కేసీఆర్​ సర్కారు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కొత్త కొలువులు ఇవ్వకపోగా.. ఉద్యమంలో ముందుండి కొట్లాడిన ఉద్యోగులు, టీచర్లను ట్రాన్స్​ఫర్ల పేరుతో అరిగోస పెడుతోంది. 317 జీవో అమలు వల్ల ఉద్యోగులు, టీచర్లు ఇతర జిల్లాలకు వెళ్లాల్సి రావడంతోపాటు స్థానికేతరులుగా మారే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఉత్తర్వులు 3 లక్షల మంది ఉద్యోగులు, టీచర్ల కుటుంబాలను మనోవేదనకు గురిచేస్తున్నాయి.

సీఎం కేసీఆర్ 317 జీవో విషయంలో వ్యవహరిస్తున్న తీరు వల్ల ఉద్యోగులు, టీచర్ల కుటుంబాలన్నీ ఛిన్నాభిన్నం అయ్యే పరిస్థితి వచ్చింది. ఉద్యోగులంతా స్థానికేతరులుగా మారి చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురయ్యే దుస్థితి ఏర్పడింది. ఉద్యోగులు, టీచర్లు ఇలా ఎవరిని కదిలించినా ఆందోళనే వ్యక్తమవుతోంది. అయితే సీఎం కేసీఆర్.. కనీసం వారి సమస్యలను తెలుసుకునేందుకు కూడా ప్రయత్నం చేయడం లేదు. పైగా సీనియర్, జూనియర్ పేరుతో కొట్లాటలు పెడుతున్నారు. ఉరిశిక్ష వేసే ముందైనా చివరి కోరిక ఏమిటని అడుగుతారు. కానీ ఉద్యోగులకు కనీసం ఆ అవకాశం, సమయం కూడా ఇవ్వకుండా ఆదరాబాదరాగా రీ అలాట్ మెంట్ చేస్తూ వాళ్ల కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు తూట్లు పొడిచేలా ప్రస్తుతం బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ విషయంలో రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడుతున్నారు. ఉద్యోగులు, టీచర్ల బదిలీలను తక్షణమే నిలిపివేయాల్సిన అవసరం ఉంది. ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటూనే లక్షలాది మంది ఉద్యోగులు, టీచర్ల హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోంది.

ఉద్యోగులు ఒకచోట.. కుటుంబాలు మరోచోట
రాష్ట్రంలో ఉద్యోగులు, టీచర్ల పరిస్థితి హృదయవిదారకంగా మారింది. భార్య ఒక దగ్గర, పిల్లలు ఇంకో దగ్గర, తల్లిదండ్రులు మరో చోట ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఏ ఉద్యోగి ఇంట్లో చూసినా ఏడుపులే విన్పిస్తున్నాయి. తల్లిదండ్రులను, భార్యాపిల్లలను వదిలి ఎటు పోవాల్సి వస్తుందోననే బాధ కన్పిస్తోంది. ఈ బాధ తట్టులేక మహబూబాబాద్ జిల్లా చిన్న ముప్పారంలో గిరిజన ప్రధానోపాధ్యాయుడు బానోతు జేతుకారామ్ నాయక్ గుండెపోటుతో చనిపోయాడు. జేతుకారామ్ మరణానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఉద్యోగుల రీ అలాట్​ మెంట్ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత విధానాలే ఈ పరిస్థితికి కారణం. స్పౌజ్ కేసు కింద పరిగణనలోకి తీసుకోకుండా అడ్డగోలుగా ఇతర జిల్లాలకు బదిలీ చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి జేతుకారామ్ నాయక్ తోపాటు ఉద్యోగులు, టీచర్ల ఉసురు తప్పకుండా తగలుతుంది. చేసిన పాపాలకు తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. గతంలో చంద్రబాబు ఉద్యోగులు, టీచర్లతో పెట్టుకుంటే తర్వాత తెలంగాణలో టీడీపీ అడ్రస్ గల్లంతైనదన్న విషయం కేసీఆర్ గుర్తుంచుకోవాలి.

యూనియన్ల లీడర్లు ఎందుకు స్పందిస్తలేరు?
సీఎం దగ్గర టైంపాస్ చేస్తున్న ఉద్యోగ సంఘాలు ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదో వారికే తెలియాలి. ఉద్యోగులు, టీచర్లు ఉద్యమం చేస్తేనే కదా.. తెలంగాణ సాధించుకున్నది? అలాంటి వారిని ఇబ్బంది పెడుతుంటే ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదు. ఏ స్థానికత కోసమైతే ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నారో.. ఆ తెలంగాణలోనే వాళ్ల స్థానికతే ప్రశ్నార్థకంగా మారింది. ఉద్యోగులు, టీచర్ల పిల్లలు, భావితరాల స్థానికత కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నా యూనియన్ల నాయకులు ఎందుకు మాట్లాడటం లేదు? ముల్కీ నిబంధనలతో మొదలైన తెలంగాణ ఉద్యమం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో సుఖాంతమైంది అనుకుంటే.. టీఆర్ఎస్ ప్రభుత్వం అనాలోచిత చర్యల వల్ల 317 జీవోతో మళ్లీ 1969 నాటి పరిస్థితులను తీసుకువచ్చారు. ఉద్యోగులు, టీచర్ల అభ్యంతరాలను ఏ మాత్రం పట్టించుకోకుండా, కనీసం ఆలోచించుకునే సమయం ఇవ్వకుండా, ఒక్క రోజే టైమ్ ఇచ్చి ఆప్షన్లు ఇవ్వమనడం, ఒకటే రోజు జాబితాలపై అభ్యంతరాలను తెలియజేయమనడం, ఇచ్చిన అభ్యంతరాలను పట్టించుకోకుండా, కనీసం వారి ఆవేదనను వినకుండా హడావుడిగా కౌన్సిలింగ్ చేపట్టారు.

అనాలోచిత నిర్ణయాలతో ఆగమాగం
హడావుడిగా తయారుచేసిన సీనియార్టీ లిస్టు తప్పుల తడకగా ఉంది. ఎందరో ఉద్యోగులు, టీచర్ల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నా ఈ సీఎం కళ్లకు కనిపించడం లేదు. అడ్డదిడ్డంగా జీవోలు వెలువరించి ఉద్యోగులందరికీ మానసిక ప్రశాంతత లేకుండా చేసి.. ఆయన మాత్రం హాయిగా ఫామ్ హౌస్ లో నీరో చక్రవర్తి మాదిరిగా సేదతీరుతున్నారు. ఇంకా ఈ తెలంగాణ ప్రజానీకం మిమ్మల్ని ఎందుకు భరించాలి? ఏ స్థానికత పేరుతో తెలంగాణ తెచ్చుకున్నామో ఆ స్థానికతకే ఎసరు పెట్టి సీనియర్, జూనియర్ల పేరుతో ఉద్యోగులను విడదీసి వారి ఉసురుపోసుకుంటున్నారు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడున్న టీచర్లను కూడా నిబంధనల పేరుతో దూరప్రాంతాలకు పంపిస్తున్నారు. మొన్న కరీంనగర్ కు చెందిన ఒక అక్క బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతూ సర్జరీ చేయించుకుని ప్రిఫరెన్షియల్ కేటగిరీలో అప్లై చేసుకుంటే.. అది న్యూరో సర్జరీ కాదని రిజెక్ట్ చేసి ఆమెను జగిత్యాల పంపడం ఎంత వరకు సమంజసం. ఈ రోజు మీ అనాలోచిత నిర్ణయాలకు జేతుకారామ్ నాయక్ చనిపోయారు. ఇంకెందరు చనిపోతే మీ రాతి గుండె కరుగుతుంది?

ఉద్యోగులే కాదు.. నిరుద్యోగులకూ నష్టమే
ఎస్సీ, ఎస్టీ కోటా సక్రమంగా అమలు చేయకుండా దళిత బిడ్డలను తమ సొంత గ్రామాలకు, జిల్లాలకు దూరంగా పంపుతున్నారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీ ఉద్యోగులకు 'ఆప్షన్ ఫార్మాట్'ను వర్తింపజేయకపోవడం అన్యాయం. ప్రతి నిత్యం పత్రికల్లో జిల్లాల కేటాయింపులో అవకతవకలంటూ వార్తలు వస్తుంటే కనీసం సమగ్రమైన విచారణ చేయకుండా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తూ ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేయడం నయా నిజాం పాలనకు నిదర్శనం. 317 జీవోలోని 28వ పేరా రాష్ట్రపతి ఉత్తర్వులను, రాజ్యాంగాన్ని ధిక్కరించేలా ఉంది. రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి విరుద్ధమైన ఉద్యోగుల బదిలీల ప్రక్రియను తక్షణమే నిలిపేయడంతోపాటు 317 జీవోను సవరించాలి. అలాగే ఉద్యోగ, టీచర్ సంఘాల నేతలతో చర్చించిన తర్వాతే నూతన గైడ్ లైన్స్ రూపొందించి బదిలీలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులు, టీచర్ల కేటాయింపులో స్థానికతను ప్రామాణికంగా తీసుకోవాలి. ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీ ఉద్యోగులకూ తప్పనిసరిగా 'ఆప్షన్ ఫార్మాట్' కాలమ్ ను వర్తింపజేయాలి. ఈ జీవో వల్ల సీనియర్లు, జూనియర్ల సర్దుబాటులో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. జూనియర్లను గ్రామీణ ప్రాంతాల్లో కేటాయించి, సీనియర్లను పట్టణాల్లో కేటాయిస్తున్నారు. దీని వల్ల ఉద్యోగాలు ఖాళీకాకపోవడమే కాకుండా 20, 30 సంవత్సరాల వరకు గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరక్క ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులనే కాకుండా నిరుద్యోగులను సైతం మోసం చేస్తూ వారి ప్రయోజనాలను దెబ్బతీస్తోంది.

యూనియన్లతో చర్చలు జరపాలి
సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ఆదరాబాదరాగా కాకుండా ఉద్యోగులు, టీచర్ల సమస్యలను ముందుగా విని, యూనియన్లతో చర్చలు జరిపి అందరికీ ఆమోదయోగ్యమైన మార్గాలను అన్వేషించాలి. ఆ తర్వాతే బదిలీల ప్రక్రియను చేపట్టాలి. 2018 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులు స్థానికతకు పెద్దపీట వేశాయి. కానీ జీవో 317 దీనికి పూర్తిగా వ్యతిరేకం. అసలు జిల్లాల విభజనే అశాస్త్రీయంగా జరిగింది. 10 జిల్లాలు ఉన్న తెలంగాణను 33 జిల్లాలు చేయమని కోరింది ఎవరు. 33 జిల్లాల ఏర్పాటులో ఒక జిల్లాలో 30 మండలాలు ఉంటే, ఒక జిల్లాలో 3 మండలాలు మాత్రమే ఉన్నాయి. ఏ స్థానికత కోసమైతే తెలంగాణ ఉద్యమంలో టీచర్లు, ఉద్యోగులు బరిగీసి కొట్లాడారో, తమ ఉద్యోగాలను పణంగా పెట్టి సకల జనుల సమ్మె చేశారో.. అటువంటి ఉద్యమాకారుల స్థానికతనే ప్రశ్నార్థకం చేస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పటికైనా జీవో 317ను రాష్ట్ర ప్రభుత్వం సవరించి.. ఉద్యోగులు, టీచర్లకు న్యాయం చేయాలి.

- డా.కె.లక్ష్మణ్, జాతీయ అధ్యక్షుడు, బీజేపీ ఓబీసీ మోర్చా