విశ్లేషణ: రియల్ ఎస్టేట్ కంపెనీలా టీఆర్ఎస్ సర్కారు

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సంస్థలే కాక ఎన్నో ఎన్జీవోలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కేసీఆర్​ వ్యవసాయ పాలసీలను ప్రశ్నించడంలో ఫెయిలయ్యాయని చెప్పవచ్చు. అలాగే రాష్ట్ర వ్యవసాయ మంత్రి, ఓ కలెక్టర్ వరి పంట వేయడంపై చేసిన కామెంట్లను ఇవి సీరియస్​గా తీసుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి వ్యవసాయ మంత్రి రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్న బీటీ కాటన్​పై సర్వే చేయిస్తే ఆయనను పక్కకు తప్పించారు. అలాగే హైదరాబాద్​లో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న కేంద్ర ఆరోగ్య మంత్రి జీఎం ఫుడ్​ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన తన శాఖను కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు టీఆర్ఎస్​ ప్రభుత్వం నుంచి కూడా ఇంతకంటే ఎక్కవు ఆశించలేం. రైతుల గురించి కాకుండా.. రియల్​ ఎస్టేట్​ సంస్థలా నడుస్తున్నట్టు పరిస్థితులు చూస్తే అర్థమవుతోంది. గతంలో టీడీపీ హయాంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో.. ఇప్పుడు టీఆర్ఎస్​లోనూ అలాంటి పోకడలే కనిపిస్తున్నాయి. 

టీఆర్ఎస్.. సూడో టీడీపీ

ప్రస్తుత టీఆర్ఎస్​ ప్రభుత్వంలో ఉన్న వారిలో ఎక్కువ మంది టీడీపీ వారే. అందువల్ల వారి నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించలేం. ఉమ్మడి రాష్ట్రంలో, అలాగే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలో టీడీపీ ఏం చేసిందో.. ఇప్పుడు టీఆర్ఎస్​ కూడా అదే చేస్తోంది. హైదరాబాద్​ చుట్టు పక్కల హైటెక్​ సిటీ/మాదాపూర్, శంషాబాద్​ ఎయిర్ పోర్ట్, ఓఆర్ఆర్ కోసం టీడీపీ సారవంతమైన వ్యవసాయ భూములను నాశనం చేసింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతి చుట్టుపక్కల కూడా అదే పని చేసింది. దీని వల్ల ఎక్కువగా లాభపడింది టీడీపీ బడా నేతలు.. కొన్ని రియల్​ఎస్టేట్​ సంస్థలే. ఇప్పుడు టీఆర్ఎస్​ కూడా అదే దారిలో నడుస్తోంది. ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేకుండా నగరాలను విస్తరించడం, జిల్లాలను విడదీయడం, కొత్తగా రింగ్​ రోడ్లను, రాడికల్​ రోడ్లను ప్లాన్​ చేస్తూ సారవంతమైన భూములను నాశనం చేస్తోంది.

సాగునీటి పేరుతో గేమ్​ ఆడుతున్నరు

మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో టీఆర్ఎస్​ ప్రభుత్వం గోదావరి నీటిని పంచుకోకుండా సాగునీటితో ఆట ఆడుతోందని అందరికీ తెలుసు. ఎందుకంటే కరువు, వర్షాభావం కారణంగా రెండు రాష్ట్రాలకు చాలా సంవత్సరాలుగా కృష్ణా నది నీరు అందుబాటులో లేదు. కానీ, వేల కోట్లు వృధా చేస్తూ ఏపీతో పోరాడుతున్నట్టు టీఆర్‌ఎస్ ప్రభుత్వం గేమ్ ఆడుతోంది. హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వెంచర్లు, రేడియల్ రోడ్లు, మెగా రింగ్ రోడ్లతో పాటు కొత్త జిల్లాల చుట్టూ ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్లకు గోదావరి నీటిని వినియోగించుకోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డ్ 468 ఎంజీడీ(మిలియన్​ గ్యాలన్స్​ పర్​ డే) నీటిని పొందుతోంది. అయితే దానిలో దాదాపు యాభై శాతం వాటా ఎక్కడికి వెళుతోందో తెలియడం లేదు? ఈ మొత్తం అక్రమ నిర్మాణ పనులకు వాడుతున్నారా?

హుజూరాబాద్​ బై ఎలక్షన్స్

మీడియా కూడా రాష్ట్రంలో వ్యవసాయ రంగం పరిస్థితుల గురించి పట్టించుకోకుండా హుజూరాబాద్​ ఎన్నికలపైనే దృష్టిపెట్టింది. దురదృష్టవశాత్తు అందరూ ఇప్పుడు దళితబంధు అమలు గురించి మాట్లాడుతున్నారు, ఎందుకు? రాజకీయ మైలేజీ కోసమే కదా? ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చి ప్రజాధనాన్ని వృధా చేయాలనుకున్నారు వీరంతా. డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్ దళితుల కోసం పదేండ్ల పాటు రిజర్వేషన్లు ఉండాలని ప్రతిపాదించారు. కానీ ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా ప్రతి కులం తమ వాటాను కోరుకుంటోంది. దీనికి అదనంగా ప్రాంతీయ పార్టీలు ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్టుగా పంచిపెడుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. హజీ మస్తాన్​ అనే పేరు మోసిన స్మగ్లర్​ ప్రజా జీవితంలోకి వచ్చి ముంబై స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏడు వార్డుల్లో గెలుపొందాడనే విషయం మీకు తెలుసా? 

నాయకుల టార్గెట్​ డబ్బు సంపాదించడమే.. 

2014 తర్వాత ఏపీలో టీడీపీ అధికారాన్ని ఉపయోగించి వివిధ కమిటీల్లోని వైఎస్సార్​సీపీ నాయకులను చేజిక్కించుకుని, టీడీపీ సభ్యులను వాటికి చైర్మన్లను చేసింది. అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలను కూడా వైఎస్సార్​సీపీ నుంచి లాక్కున్నారు. ఇలాంటి ఘటనపై చర్యలు తీసుకునేందుకు ఎవరూ సాహసించలేదు. ఎందుకంటే జ్యుడీషియరీ చంద్రబాబు జేబులో ఉండటమే కారణం. ఇప్పుడు అలాంటి వారే వేదాలు వల్లిస్తున్నారు. ఇదే పంథాను టీఆర్ఎస్ కూడా అనుసరిస్తోంది. ఇతర పార్టీల వారిని చేర్చుకోవడం ద్వారా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సంఖ్యను టీఆర్ఎస్ పెంచుకుంది. ఎలాంటి సిద్ధాంతాలూ లేవు. ప్రతి ఒక్కరి లక్ష్యం భారీగా డబ్బు సంపాదించడమే. ప్రస్తుత పొలిటికల్​ కల్చర్​ అంతా కూడా ఇలానే ఉంది. అందుకే ప్రతిపక్షాలు కూడా ప్రజా ధనాన్ని వృధా చేసే పాలసీలను అడ్డుకోవడం లేదు. 

కాంగ్రెస్​ లీడర్లలో మెచ్యూరిటీ లేదు

ప్రస్తుతం తెలంగాణలోని కాంగ్రెస్​ లీడర్లలో మెచ్యూరిటీ, పార్టీ కల్చర్​ అనేది కనిపించడం లేదు. ఎవరికి వారే ప్రతి రోజూ ఇష్టానుసారం కామెంట్లు చేస్తున్నారు. దీంతో పార్టీలో ఐక్యత దెబ్బతింటోంది. వారు అధికారం కోల్పోయినప్పటి నుంచి డబ్బు కోసం తమను తాము అమ్ముకోవడానికి తహతహలాడుతున్నారు. ఇంకా దురదృష్టకరమైన విషయం
 ఏమిటంటే, చాలా మంది నాయకులు ఓట్లు పొందడానికి వారి వ్యక్తిగత సామర్థ్యాన్ని అంచనా వేసుకోకుండా “నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని” అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇది పార్టీని మరింతగా దిగజారుస్తోంది.

పరిస్థితులు తెలుసుకోకుండా ప్రకటనలా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో టీడీపీ హయాంలో విజన్​ 2020 పేరుతో కార్పొరేట్​ ఫార్మింగ్​ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు మూడు వ్యవసాయ బిల్లుల్లో భాగంగా బీజేపీ కూడా కాంట్రాక్ట్​ ఫార్మింగ్​ను తెరపైకి తీసుకొచ్చింది. ప్రస్తుతం టీఆర్ఎస్​ ప్రభుత్వం, రాష్ట్ర వ్యవసాయ మంత్రి కోటి ఎకరాల్లో పత్తిని ప్రోత్సహిస్తామని మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో పంటలు పండిస్తున్న మొత్తం 1.5 కోట్ల ఎకరాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది తెలుసుకోకుండా ఇలాంటి ప్రకటన చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. సాగునీటి వసతి కలిగిన భూములు 50 శాతం కంటే తక్కువగానే ఉన్నాయి. మిగతా మెజారిటీ భూములకు బోర్లు, బావులే ఆధారం. సాగునీటి ప్రాజెక్టులు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఇతర ప్రధాన ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం పెద్ద మొత్తంలో వ్యవసాయ భూములను మళ్లించారు. అయినా వ్యవసాయం కింద ఉన్న భూభాగం మాత్రం మారడం లేదు. ఇదెలా సాధ్యం? ప్రస్తుతం రైతులు మంచి విత్తనాల కొరతను ఎదుర్కొంటున్నారు. మార్కెట్‌ అంతా కల్తీ/నకిలీ విత్తనాలతో నిండిపోయింది. అలాగే అంతర్జాతీయంగా నిషేధించబడిన విత్తన అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం బహుళజాతి విత్తన కంపెనీల ప్రయోజనాలను కాపాడుతూ జీఎం విత్తనాలను పండిస్తోంది. ఈ పంటను అధిక రసాయన ఎరువులు, రసాయనాల కింద పండిస్తారు.

పంట మార్పిడి జరగాల్సిందే..

పంట మార్పిడి అనేది తప్పనిసరి. ఎందుకంటే భూమి సారవంతంగా ఉండాలన్నా.. మెరుగైన దిగుబడి రావాలన్నా పంట మార్పిడి చాలా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి ఏపీ టొబాకో బోర్డు కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. పంట మార్పిడి తప్పనిసరిగా చేయాలని, అలా చేయకుండా పండించిన టొబాకోను కొనుగోలు చేయబోమని ప్రకటించింది. అలాగే, పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు, "నాటు పొగాకు" స్థానంలో ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని బహిరంగంగా కోరారు. అయితే అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకోకుండా వ్యవసాయ మంత్రి కామెంట్లు చేయడం సరికాదు. ఇది సరైన పాలసీ కాదు. ఇది రైతులను దెబ్బ తీస్తుందనే విషయం మీకు తెలియదా? మీరు, మీ ప్రభుత్వం గతంలోని టీడీపీ ప్రభుత్వ అడుగుజాడల్లోనే నడుస్తోంది. మీరు ఇలాంటి కామెంట్లు చేస్తుంటే ప్రభుత్వంలో ఉన్న వ్యవసాయ కార్యదర్శి తన చాంబర్​లో నిద్రపోతున్నారా? దురదృష్టకరమైన విషయం ఏమిటంటే చాలా మంది మంత్రులు ప్రజాసమస్యలు పట్టించుకోకుండా నిద్రమత్తులోనే ఉంటున్నారు. పెద్ద సారును వెనకేసుకు రావడానికి మాత్రమే వీరి నోరు పెగులుతోంది. ప్రజా సమస్యలపై మాటమాత్రం రావడం లేదు.

- డాక్టర్ ఎస్. జీవానందరెడ్డి, ఫౌండింగ్​ మెంబర్, తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్