పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల కొత్త ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తాం. కానీ, ఆయా పరిశ్రమల ఏర్పాటు వల్ల ఉన్న ఉపాధి పోతున్న పరిణామాన్ని పట్టించుకోకపోవటం రాష్ట్ర ఆర్థిక విధానంలోని ప్రధాన లోపం. కొన్ని పరిశ్రమల వల్ల ఉపాధి కోల్పోయి గ్రామీణులు వలస బాట పడుతున్నారు. ఆర్థికాభివృద్ధి లెక్కల్లో ఉపాధి పోతున్న కుటుంబాల ప్రస్తావన ఉండకపోవటం వల్ల, పారిశ్రామికీకరణ పట్ల సానుకూల దృక్పధం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటోంది. ఒక విధానం వల్ల వస్తున్న ఫలితాలు, దాని పర్యవసానాలు సమగ్రంగా చర్చించినప్పుడే అర్థవంతమైన నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో అటువంటి చర్చే లోపించింది.
రాష్ట్రంలో టీఎస్ఐపాస్ ద్వారా ఎన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యాయని ఇటీవల అసెంబ్లీలో సభ్యులు అడిగిన ఒక ప్రశ్నకు పరిశ్రమల మంత్రి సమాధానం ఇచ్చారు. 15,326 పరిశ్రమలు వచ్చాయని చెబుతూ.. మరికొన్ని వివరాలు కూడా వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధానమని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వేదిక మీదా చెబుతున్న ఈ టీఎస్ఐపాస్ స్కీమ్ ప్రధాన ఉద్దేశం అనుమతుల సరళీకరణ. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సింగిల్ విండో పద్ధతిలో అన్ని అనుమతులకు నిర్దిష్ట కాల పరిమితి విధించారు. దీని ద్వారా 50 రకాల సేవలు అందుతాయి. ఆన్ లైన్లో దరఖాస్తులు చేసుకుంటే రూ.200 కోట్ల లోపు ప్రాజెక్టులకు అనుమతులు 30 రోజుల లోపు, ఆ పై ప్రాజెక్టులకు 15 రోజుల్లో అనుమతులు అందేలా ఈ వ్యవస్థ ఏర్పాటైంది. అనుమతులు సరళతరం చేసినా ఆశించిన మేరకు పరిశ్రమలు రాకపోవటం గమనార్హం. పరిశ్రమల ప్రోత్సాహక విధానం చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అనుకూలంగా లేదన్నది ఆయా వర్గాల నుంచి వస్తున్న ఫిర్యాదు.
విధానం, రాయితీలపై సమీక్ష లేదు
టీఎస్ఐపాస్ విధానాన్ని గానీ, ఇస్తున్న రాయితీ పథకాలను గానీ పారదర్శకంగా రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష చేసినట్లు లేదు. ఆయా పక్షాలు, ప్రజలతో సంప్రదింపులు జరపకపోగా, సమీకృత పారిశ్రామిక విధానం తయారు చేసే ప్రక్రియ కూడా చేపట్టలేదు. 24 గంటల కరెంటు, చార్జీలు తక్కువున్న కరెంటు, పుష్కలంగా భూమి, నీరు, రాయితీలు, సరళీకృత అనుమతుల ప్రక్రియ మొదలైనవి ఇచ్చిన తర్వాత కూడా పరిశ్రమలు ఎందుకు రావడం లేదనేదే ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న. పెద్ద, విదేశీ పెట్టుబడిదారులు అనేక కోణాలు అలోచించి వస్తారు. లాభాలు తీసుకుని పోతారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పూర్తిగా వారి మీదనే ఉంది. స్థానిక పెట్టుబడుల ద్వారా స్థానిక వినియోగానికి అవసరమైన వస్తువుల ఉత్పత్తి మీద దృష్టి లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక విధాన లోపం. రాష్ట్రంలో వస్తు వినిమయ విపణి మీద అవగాహన లేకపోవడం కూడా ఇంకో లోపం. దూర ప్రాంతాల నుంచి దిగుమతులు పెరుగుతున్న పరిస్థితుల్లో, రాష్ట్రంలో ఎటువంటి పరిశ్రమల ఏర్పాటుకు ఆస్కారం ఉందని ఒక్కటంటే ఒక్క అధ్యయనం కూడా చేయలేదు. ఉన్న పరిశ్రమలు దెబ్బతినకుండా, మూతపడకుండా చేయాల్సిన ప్రయత్నాలను ఈ విధానంలో సమీక్షించలేదు.
చెప్పింది 15.5 లక్షలు.. వచ్చింది 7.6 లక్షలు
ప్రపంచీకరణ నేపథ్యంలో, ప్రపంచ వాణిజ్యం పెరుగుతున్న క్రమంలో, సాంకేతిక మార్పులు పెరుగుతున్న సందర్భంలో, పరిశ్రమల జీవితకాలం తగ్గుతున్నది. అందుకని, ప్రభుత్వ విధానాలు ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ స్థిరమైన పారిశ్రామికీకరణ వైపు అడుగులు వేయాల్సిన ఆవశ్యకత తెలంగాణకు ఉంది. ఉద్యోగ కల్పన కొరకే పరిశ్రమలు అనుకోవడం ఒక భ్రమ. ఆ ఉద్యోగ కల్పన కూడా ప్రణాళికపరంగా లేకపోతే దుష్ఫలితాలు వచ్చే అవకాశమే ఎక్కువ. అసెంబ్లీలో పరిశ్రమల మంత్రి ఇచ్చిన డేటా ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ విధానం వల్ల 2015 జనవరి 1 నుంచి 2021 మార్చి 17 వరకూ 15,326 పరిశ్రమలు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడితో వచ్చాయి. ఈ పరిశ్రమల వల్ల 15,52,677 ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ లెక్కల ప్రకారం సగటున ప్రతి పరిశ్రమ పెట్టుబడి రూ.14 కోట్లే. సగటున ప్రతి పరిశ్రమ కల్పించిన ఉద్యోగాలు 100 మాత్రమే. అయితే ఈ ఏడేండ్లలో ఇప్పటికి వచ్చిన ఉద్యోగాలు 7.67 లక్షలే. ఇవి కూడా అంచనాలే. వాస్తవంగా వచ్చిన ఉద్యోగాల సంఖ్య ఇంత కంటే తక్కువే ఉండవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం చూపెడుతున్న ఫలితాల మీద అనుమానాలు ఉన్నాయి. టీఎస్ఐపాస్ ద్వారా వచ్చిన ఫలితాలను పారదర్శకంగా ప్రజలతో ప్రభుత్వం పంచుకోవడం లేదు. అందుకే, ప్రభుత్వం చెబుతున్న 15 వేల పరిశ్రమలు ఎటువంటివి, ఎక్కడ వచ్చాయనే ప్రశ్నలు వస్తున్నాయి. సేవల రంగంలో వస్తున్న సంస్థలను కూడా ఈ ఫలితాల్లో చూపిస్తున్నట్టుంది. ఉత్పత్తి రంగంలో పరిశ్రమలు పెద్దగా రాలేదు. ఎక్కువగా ప్రకృతిని విధ్వంసం చేసే మైనింగ్, ఫార్మా రంగంలోనే పెట్టుబడులు కనిపిస్తున్నాయి.
కాకి లెక్కలుగా మారిన ఉద్యోగాల సంఖ్య
మరోవైపు, పారిశ్రామికాభివృద్ధిని అంచనా వేసే కొలమానాలు తలకిందులు చేయటం రాజకీయ నేతలకు అలవాటుగా మారింది. పరిశ్రమల్లో ఉద్యోగాల సంఖ్యను కాకి లెక్కలుగా మార్చారు. అందుకే, ఇప్పుడు స్థూల రాష్ట్ర ఆదాయం(జీడీపీ) జపం చేయటం మొదలు పెట్టారు. ఇది కూడా పనికి రాని ఆర్థిక కొలమానం. తెలంగాణ పారిశ్రామిక వృద్ధి కొలమానాలను పారదర్శకంగా ప్రజల ముందు చర్చించాల్సిన అవసరం ఉంది. ఈ పాటి పురోగతికి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రయాస పడింది. తెలంగాణ పరిశ్రమల శాఖకు 2014–-15 నుంచి 2020-–21 మధ్య ప్రభుత్వం బడ్జెట్లో రూ.8,009 కోట్లు కేటాయించింది. గంపగుత్తగా చూస్తే, టీఎస్ఐపాస్ ద్వారా ఆశిస్తున్న 15.52 లక్షల ఉద్యోగాల కొరకు ప్రభుత్వ పెట్టుబడి సగటున ప్రతి ఉద్యోగానికి రూ.51,604. లేదంటే, వచ్చిన 7.67 లక్షల ఉద్యోగాలకుగానూ పెట్టిన పెట్టుబడి రూ.1,04,420. ఈ నిధులే కాక, ఇంకా అనేక రూపాల్లో పరిశ్రమలకు రాయితీలు ఇస్తున్నారు.
మన ప్రయోజనాలపై సమాచారం లేదు
పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ప్రధానమైన పెట్టుబడి భూమి. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వ పద్ధతులకు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాల పద్ధతులకు పెద్ద తేడా లేదు. రైతులు, గ్రామీణుల నుంచి భూమిని గుంజుకుని పారిశ్రామికవేత్తలకు అప్పజెప్పే పనిని తెలంగాణ ప్రభుత్వం కూడా నెత్తికెత్తుకున్నది. తెలంగాణలో అత్యంత ఖరీదైన నీళ్లను కూడా స్థానికులకు, స్థానిక అవసరాల కంటే ముందే ఆయా పరిశ్రమలకు ఇచ్చేలా ప్రభుత్వం చేసింది. చేస్తున్నది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, భారీ సాగు నీటి ప్రాజెక్టుల్లో పరిశ్రమల అవసరాలు మిళితమైన విషయం బయటకు చెప్పరు. తెలంగాణ భూమి, నీరు, నిధులు, ఇంకా ఇతర వనరులను పరిశ్రమల వృద్ధికి కైంకర్యం చేస్తున్నప్పుడు, ఆయా పెట్టుబడుల నుంచి ఆర్థిక వ్యవస్థకు ఒనగూరే ప్రయోజనాల మీద సమగ్ర సమాచారం లేదు. కేవలం ఉద్యోగాల లెక్క ఇస్తారు. అది కూడా అంచనాలు మాత్రమే. వాస్తవ సమాచారం ఉండదు. ఇప్పటికైనా తెలంగాణ సమాజం ఆమోదించని పెట్టుబడులు, వారికి అందని ప్రయోజనాల నేపథ్యం గురించి విధానపరమైన చర్చ జరగాలి. తోటోడు తొడ కోసుకుంటే, నేను మెడ కోసుకుంట అన్న చందంగా ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తున్న ప్రభుత్వానికి, దాని పరిణామ స్వరూపాలను పట్టించుకునే ఆలోచన కూడా లేకపోవటం దారుణం. తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి ప్రణాళికను ప్రజల ముందు ముసాయిదా రూపంలో పెట్టి, అర్థవంతమైన చర్చ జరిపి, అవసరమైన అధ్యయనాలు చేసి, సుస్థిర విధానాలు ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అభివృద్ధి ప్రణాళికల్లో లోతు ఉండాలె
వస్తు ఉత్పత్తి ప్రక్రియ సాంకేతికతను అంది పుచ్చుకుంటున్న తరుణంలో, ఆ మేరకు సాంకేతిక సామర్థ్యం ఉన్న వ్యక్తులకే పరిశ్రమల్లో ఉద్యోగాలు వస్తాయి. ఈ కోణంలో ఆలోచిస్తే, పారిశ్రామిక అభివృద్ధి ప్రణాళికల్లో ఎంత లోతు ఉండాలో మనం అర్థం చేసుకోవాలి. రాబోయే కాలంలో తెలంగాణలో ఆశిస్తున్న పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతను తయారు చేసే శిక్షణ సంస్థల వ్యవస్థ ముందు రూపుదిద్దుకోవాలి. అప్పుడే, స్థానిక యువతకు స్థానికంగా ఉద్యోగాలు దొరుకుతాయి. ఉన్నత విద్యకు, సాంకేతిక విద్యకు, పారిశ్రామికాభివృద్ధికి మధ్య అనుసంధానం చేయాల్సిన ప్రభుత్వాలు, అది మరిచిపోయి పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇస్తే పరిశ్రమలు వస్తాయని, తద్వారా పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందని భ్రమలు కల్పిస్తున్నాయి.
ప్రజలను మభ్యపెడుతున్నరు
పారిశ్రామికీకరణ వల్ల ఉద్యోగాలు వస్తాయనేది పాత ఆర్థిక సూత్రం. కానీ, ఇప్పటికీ ఈ సూత్రం మీదనే తెలంగాణలో రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ఉంటే, ఇతర రాజకీయ నాయకులు దానిని ఎండగట్టకపోగా, దాని పెంపొందించేలా మాట్లాడుతున్నారు. ఇది ప్రజలను మభ్యపెట్టడంగా మనం భావించాలి. ఈ కంపెనీల్లో వచ్చిన ఉద్యోగాలన్నీ తెలంగాణ వాసులకే ఇచ్చారని కూడా అనుకోవద్దు. సాధారణంగా, అనేక కారణాల రీత్యా, పరిశ్రమలు ఎక్కడైనా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఇష్టపడవు. తెలంగాణలో ఏటా లక్షలాది మంది యువత పట్టాలు సాధించి ఉద్యోగాల వేటలో పడుతున్నారు. ఈ లెక్కన పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగం తగ్గదు. పారిశ్రామిక విధానంలో లోపాల వల్ల పరిశ్రమల సంఖ్య ఎంత ఉన్నా, నిరుద్యోగం తీరే అవకాశం లేదు. అసలు ఈ విధానంలో నిరుద్యోగం తగ్గించే లక్ష్యమే లేదు. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసే వారు ఆధునిక మెషినరీ అవసరమని భావిస్తారు. అందు వల్ల సగటున ఒక్కో పరిశ్రమలో ఉద్యోగాల సంఖ్య మారుతూ ఉంటుంది. - దొంతి నరసింహారెడ్డి, ఎకనమిక్ ఎనలిస్ట్