ఆరేండ్లలో ఎంతో సాధించినం

ఆసరా పెన్షన్లు పెంచినం.. కల్యాణ లక్ష్మి ఇస్తున్నం
కేసీఆర్ కిట్​ అమలు చేస్తున్నం.. 24 గంటల కరెంటు
రూ.5కే పేదలకు కడుపు నిండా భోజనం పెడ్తున్నం
2,72,763 డబుల్‌‌ బెడ్రూం ఇండ్లు మంజూరు చేసినం
ప్రాజెక్టులు కట్టినం.. 303 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసినం
కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేశామని వెల్లడి

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో గత ఆరేండ్లలో చాలా కార్యక్రమాలు చేపట్టామని, ఎన్నో సాధించామని టీఆర్ఎస్​ సర్కారు పేర్కొంది. జూన్​ 2వ తేదీతో తెలంగాణ ఏర్పాటై ఆరేండ్లు పూర్తవుతుండటంతో తమ పాలనపై సోమవారం ప్రత్యేక రిపోర్టు విడుదల చేసింది. 160 పేజీలతో ఉన్న ఈ రిపోర్టులో 20 రంగాలకు సంబంధించి డిపార్ట్​మెంట్ల వారీగా స్కీముల అమలు, పురోగతి తదితర అంశాలను వివరించింది. ‘‘దేశంలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం అమలు చేయని అనేక పథకాలను అమలు చేస్తూ యావత్ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. పలు పథకాలను అధ్యయనం చేయడానికి ఇతర రాష్ట్రాల టీమ్​లు తెలంగాణలో పర్యటిస్తున్నాయి. వాళ్ల రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనప్పటికీ పాలనలో మరెవరూ సాటిలేరని నిరూపించుకుంది..’’ అని పేర్కొంది. ఆ రిపోర్ట్‌‌లోని వివరాలు ఇలా ఉన్నాయి.

భారీగా ఆసరా పెన్షన్లు

‘‘రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు,కల్లు గీత, చేనేత, బీడీ కార్మికులు, ఎయిడ్స్‌‌, బోదకాలు పేషెంట్లకు పెన్షన్లు ఇస్తున్నం. దివ్యాంగులకు రూ. 3,016, ఇతరులకు రూ. 2,016 చొప్పున అందిస్తున్నం. పేదలకు ఒక్కొకరికి ఆరు కిలోల చొప్పున బియ్యం అందిస్తున్నం. లాక్‌డౌన్‌‌ సమయంలో ఉచిత రేషన్‌‌ బియ్యం, రూ.1,500 నగదు, స్టూడెంట్లకు సన్నబియ్యం ఇస్తున్నం. పేదలకు రూ.5కే కడుపునిండా భోజనం పెడుతున్నం.

కొత్తగా 5 మెడికల్‌‌ కాలేజీలు

రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కలిపి 661 రెసిడెన్షియల్‌‌ స్కూళ్లు ఉంటే.. ఇప్పుడు 959కి పెంచినం. స్టడీ సర్కిళ్లను 26కు పెంచాం. కాళోజీ పేరుతో వరంగల్‌‌లో హెల్త్‌‌ యూనివర్సిటీ, కొత్తగా 5 మెడికల్‌‌ కాలేజీలు ఏర్పాటు చేశాం. బీబీ నగర్‌‌లో ఎయిమ్స్‌‌ ప్రారంభమైంది. స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కేలా రాష్ట్రంలో కొత్త జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థ ఏర్పాటైంది. హోంగార్డులు, అంగన్‌‌ వాడీ టీచర్లు, హెల్పర్లు, ఆశా వర్కర్లు, ఐకేపీ, సెర్ప్ ఉద్యోగులు, ఎంజీ నరేగా ఉద్యోగులు, 108 సిబ్బంది, 104 సిబ్బంది, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, వీఆర్ఏలు, వీఏఓలు, కాంట్రాక్టు లెక్చరర్లు, సీఆర్టీలు, అర్చకులకు వేతనాలను పెంచినం.

303 టీఎంసీలు ఎత్తిపోసిన్రు

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇప్పటిదాకా 303 టీఎంసీల నీటిని ఎత్తిపోసినం. ఇటీవలే కొండపోచమ్మ రిజర్వాయర్‌‌ను సీఎం కేసీఆర్, చినజీయర్ స్వామి ప్రారంభించారు. మిషన్‌‌ కాకతీయ కింద ఇప్పటివరకు నాలుగు దశల్లో  26,690 చెరువుల పునరుద్ధరణ చేపట్టినం. ‘మిషన్‌‌ భగీరథ’ ద్వారా జనవరి 2019 నాటికి రాష్ట్రంలోని 23,968 ఆవాసాలకు బల్క్‌‌గా నీళ్లు సరఫరా అవుతున్నాయి. మైక్రో ఇరిగేషన్ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం రాయితీ.. బీసీలు, సన్న, చిన్నకారు రైతులకు 90శాతం రాయితీ, ఇతర రైతులకు 80శాతం రాయితీ ఇస్తున్నం.

2,72,763 డబుల్‌‌ బెడ్రూం ఇండ్లు..

రాష్ట్రంలో తొలి దశలో 2లక్షల 72 వేల 763 డబుల్​ బెడ్రూం ఇండ్లను మంజూరు చేసినం. నిర్మాణ దశలో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటిదాకా ఐదు విడతల్లో 182 కోట్ల మొక్కలు నాటారు. బతుకమ్మ పండుగకు 18 ఏళ్లు నిండిన పేద మహిళలందరికీ సర్కారు చీరలను కానుకగా అందజేస్తోంది.  రూ.40 వేల కోట్లతో 40 ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నం. ఆడబిడ్డ పెళ్లికి లక్షా 116 వేల ఆర్థిక సాయం ఇస్తున్నం. తండాలను, గూడాలను పంచాయతీలుగా మార్చడంతో 3,146 మంది ఎస్టీలు సర్పంచులుగా ఎన్నికయ్యే అవకాశం లభించింది.

24 గంటల కరెంట్‌‌ ఇస్తున్నం

వ్యవసాయం, ఇండ్లు, పరిశ్రమలకు, వాణిజ్య అవసరాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నం. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది. వచ్చే మూడేళ్లలో అదనంగా 10 వేల మెగావాట్ల కరెంట్‌‌ అందుబాటులోకి రానుంది. తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ట్రం 11.34 శాతం వృద్ధి సాధించింది. రాష్ట్రంలో ఆర్‌‌అండ్‌‌బీ శాఖ పరిధిలోని 7,554 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధికి చర్యలు చేపట్టినం.

23 కొత్త జిల్లాలతో..

రాష్ట్రంలో కొత్తగా 23 జిల్లాల ఏర్పాటుతో మొత్తం జిల్లాల సంఖ్య 33 వరకు పెరిగింది. కొత్తగా 76 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లు, 30 రెవెన్యూ డివిజన్లు, 131 మండలాలను ఏర్పాటు చేసినం. కొత్తగా 4,383 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశాం.

కేసీఆర్‌‌ కిట్​

సర్కారీ హాస్పిటళ్లలో డెలివరీలను ప్రోత్సహించేందుకు గర్భిణులకు రూ. 12 వేలు ఆర్థిక సాయం, డెలివరీ తర్వాత రూ. 3 వేల విలువైన కిట్ అందిస్తున్నం. ఆడపిల్ల పుడితే మరో వెయ్యి అదనంగా ఇస్తున్నం. వారికి ఉచిత రవాణా కోసం అమ్మఒడి వాహనాలను నడుపుతున్నం. సర్కారీ బడులు, మోడల్‌‌ స్కూళ్లు, కేజీబీవీల్లోచదువుతున్న 8 లక్షలమంది గర్ల్​ స్టూడెంట్లకు హెల్త్, హైజెనిక్ కిట్స్.. ఆరోగ్యలక్ష్మి పథకం కింద గర్భిణులు, బాలింతలు, పిల్లలకు భోజనం అందిస్తున్నం. ప్రమాద సమయాల్లో వెంటనే సాయమందించేందుకు 108 బైక్ అంబులెన్సులు తీసుకొచ్చినం. రాష్ట్రవ్యాప్తంగా 1.54 కోట్ల మందికి కంటి పరీక్షలు చేసి, 41 లక్షల మందికి కళ్లద్దాలు, మెడిసిన్స్‌‌ ఇచ్చినం.

దిగ్గజ ఐటీ కంపెనీలొచ్చినయ్‌‌

రాష్ట్రం ఏర్పడినపుడు రూ.66,276 కోట్ల ఐటీ ఎగుమతులు ఉంటే.. 2019-–20లో రూ.1,28,807 కోట్ల ఎగుమతులు జరిగాయి. అదనంగా 2.10 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబీఎం, ఒరాకిల్ వంటి అనేక బహుళజాతి సంస్థలు తెలంగాణలో తమ కార్యాలయాల్ని నడుపుతున్నాయి. అమెజాన్ క్యాంపస్‌‌, యాపిల్​ మ్యాప్స్​ డెవలప్​సెంటర్​ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 361 ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు.. 169 ఫార్మా, కెమికల్స్, 87 పవర్, 165 ప్లాస్టిక్, రబ్బర్, 280 ఇంజనీరింగ్, 195 ఆగ్రో బేస్డ్, 46 ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, 166 గ్రానైట్ స్టోన్ క్రషింగ్, 69 పేపర్ ప్రింటింగ్, 63 టెక్స్‌‌టైల్, 117 సిమెంట్, 12 ఏరోస్పేస్, డిఫెన్స్, 820 తదితర పరిశ్రమలు వచ్చాయి. రాష్ట్రంలో భారీగా గోడౌన్ల నిర్మాణం చేపట్టినం. మార్కెట్ కమిటీ పదవుల్లో రిజర్వేషన్లు అమలు చేశాం.” అని సర్కారు నివేదికలో పేర్కొంది.

For More News..

మద్దతు ధరలు పెరిగినయ్..

సికింద్రాబాద్ నుంచి 9 రైళ్లలో 13 వేల మంది

చైనా సైనికులకు ఆయుధాలను మనమే కొనిస్తున్నం