సదువు మీద సర్కారు సోయి ఇదేనా?

సదువు మీద సర్కారు సోయి ఇదేనా?

ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ ​ప్రభుత్వ పాలనలో విద్యారంగంలో ఆశించిన స్థాయిలో మార్పు రాలేదు. దేశంలోని 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం 36 ఉండగా తెలంగాణ విద్యాభివృద్ధి సూచిల్లో 32వ స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. విద్యారంగానికి ఏటా బడ్జెట్​కేటాయింపులు పెంచాల్సిన రాష్ట్ర ప్రభుత్వం తగ్గిస్తూ వస్తోంది. ఎన్నికల ముందు చెప్పిన కేజీ టు పీజీ విద్య అమలు కావడం లేదు. విద్యారంగంలో ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీ చేపట్టడం లేదు. స్కాలర్​షిప్​లు, ఫీజు రీయింబర్స్​మెంట్ ​బకాయిలు పేరుకుపోయాయి. ‘మన ఊరు - మన బడి’ ముందుకు కదులతలేదు. సమైక్య రాష్ట్రంలో ఉన్న వెనుకబాటు తనమే ఇప్పుడూ కొనసాగుతోంది. ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేయడంతోపాటు ప్రైవేటు, కార్పొరేటు స్కూళ్లు, యూనివర్సిటీలను ప్రోత్సహించడం దుర్మార్గం. విద్యావ్యవస్థను మెరుగుపరిచేందుకు సమగ్ర ప్రణాళికతో యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని, విద్యార్థుల సమగ్ర వికాసాన్ని దృష్టిలో పెట్టుకొని గురుకులాలను ఏర్పాటు చేస్తామని, కుల, మత భేదాలు లేకుండా అన్ని వర్గాల పిల్లలు ఒకే చోట చదువుకునేలా చూస్తామని టీఆర్ఎస్​పార్టీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ప్రైవేట్‌‌ విద్యా సంస్థల్లో సుమారు 20 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, మిగిలిన 40 లక్షల మంది విద్యార్థులకు గురుకుల పాఠశాలల ద్వారా ఉచ్చిత నిర్బంధ విద్యను అందించనున్నట్లు పేర్కొంది. కానీ అందులో పేర్కొన్న ఏ ఒక్కటీ సరిగా అమలు చేయడం లేదు. మేనిఫెస్టోలో పేర్కొన్న దానికి భిన్నంగా కులాల వారీగా (ఎస్సీ 134, ఎస్టీ 50, బీసీ119, మైనార్టీ182) గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసింది. వాటిలో చేర్చుకున్న మొత్తం విద్యార్థుల సంఖ్య రెండున్నర లక్షలు మాత్రమే. కొత్త గురుకులాలు అద్దెభవనాల్లో అరకొర వసతులతోనే నడుస్తున్నాయి. సరిపోను సిబ్బంది లేరు. ఈ గురుకులాలు 5 నుంచి12వ తరగతి వరకే కొనసాగుతున్నాయి. ఎన్నికల ముందు చెప్పినట్లుగా కింద కేజీ లేదు.. పైన పీజీ లేదు. ఆ దిశగా ప్రభత్వ చర్యలేమీ లేవు.

బడ్జెట్‌‌ కేటాయింపుల్లో కోత

రాష్ట్రంలో విద్యారంగ దుస్థితి మారాలంటే బడ్జెట్‌‌లో ఆ రంగానికి కేటాయింపులు పెరగాలి. కానీ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బడ్జెట్‌‌ కేటాయింపులు పెరగకపోగా తగ్గిపోతున్నాయి. 2021–2022 వార్షిక బడ్జెట్‌‌లో బడుల్లో సౌలత్​ల కోసం రూ. 4 వేల కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ బడ్జెట్‌‌ పత్రాల్లో ఈ పద్దు ఎక్కడా కనిపించలేదు. 2022–2023 ఏడాదికి రూ. 2,56,958 కోట్ల రాష్ట్రబడ్జెట్‌‌లో విద్యారంగానికి కేవలం రూ.16,085 (6.26%) కోట్లు మాత్రమే కేటాయించింది. విద్యకు బడ్జెట్​ కేటాయింపుల్లో దేశంలో 17 రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం చివరి వరుసలో ఉంది. ఇతర రాష్ట్రాల్లో విద్యారంగానికి సగటున13 శాతం నుంచి 20 శాతం నిధులు కేటాయిస్తుండగా మన ప్రభుత్వం కేవలం 6.26 శాతం మాత్రమే కేటాయించింది. 2014లో రాష్ట్ర బడ్జెట్​లో విద్యారంగానికి 10.28 శాతం నిధులు, 2015లో 9.68%, 2016లో 8.23%, 2017లో 8.49%, 2018లో 7.61%, 2019లో 6.76%, 2020లో 6.63%, 2021లో 6.76%, 2022లో 6.26 % శాతం కేటాయించింది. ఇలా క్రమంగా విద్యారంగానికి నిధుల కేటాయింపులు తగ్గుతూ వస్తోంది. 2014 బడ్జెట్‌‌ నుంచి 2022-23 వార్షిక బడ్జెట్‌‌ వరకు విద్యారంగ కేటాయింపుల్లో ప్రభుత్వం 4.62 శాతం కోత విధించింది. మనకంటే చిన్న రాష్ట్రాలైన ఢిల్లీ 20.45%, అస్సాం 19.61%, చత్తీస్‌‌గఢ్ 17.79%, హిమాచల్‌‌ప్రదేశ్‌‌16.87% నిధులను విద్యకోసం కేటాయిస్తున్నాయి. ప్రైవేట్‌‌, కార్పొరేట్‌‌ విద్యను ప్రోత్సహించడం కోసమే టీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం ప్రభుత్వ విద్యను పూర్తిగా విస్మరించినట్లుగా కన్పిస్తోంది. దీంతో కార్పొరేట్​స్కూళ్లు, ప్రైవేటు యూనివర్సిటీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పేద, మధ్య తరగతి తల్లిదండ్రుల ఆకాంక్షలను సొమ్ము చేసుకుని ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయి.

విద్యారంగంలో పోస్టుల భర్తీ ఏది?

ఎనిమిదేండ్ల టీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వ పాలనలో విద్యారంగంలో ఖాళీ పోస్టుల భర్తీకి ప్రయత్నమే జరగలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్‌‌ మాటలు నీటిమీద రాతల్లా మిగిలిపోయాయి. వనపర్తిలో మార్చి 7న నిర్వహించిన బహిరంగ సభ సందర్భంగా నిరుద్యోగులకు ప్రభుత్వంవైపు నుంచి తీపి కబురు చెప్తామని ఊరించారు. రాష్ట్రంలోని ఆయా ప్రభుత్వ శాఖల్లో లక్షా 91 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని బిశ్వాల్‌‌ కమిటి పేర్కొంది. అయితే 80,039 ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. అసెంబ్లీలో చేసిన ఈ ప్రకటన లక్షలాది మంది నిరుద్యోగులను నిరాశకు గురిచేసింది. రాష్ట్రంలో 584 మండలాలు ఉంటే.. కేవలం ఏడింటికి మాత్రమే రెగ్యులర్‌‌ ఎంఈవోలు ఉన్నారు. 62 డిప్యూటీ డీఈవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెగ్యులర్ ​డీఈవోలు 10 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 23 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సెకండరీ విద్యలో13,086 టీచర్‌‌ పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇవి గాక మరో 8 వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి. 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌‌ చేస్తామని ప్రకటించినా.. వాటిలో ఇంత వరకు ఎలాంటి పురోగతి లేదు. కేజీబీవీ, సమగ్ర శిక్ష, రెసిడెన్షియల్‌‌ స్కూళ్లు, యూనివర్సీటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌‌సోర్సింగ్‌‌ ఉద్యోగులను రెగ్యులర్‌‌ చేయాలి. 

మన ఊరు– మన బడి

బడుల్లో సౌలత్​లు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మన ఊరు– మన బడి’ కార్యక్రమానికి కేంద్రం నిధులే ఎక్కువ. ఈ పథకానికి అవసరమైన నిధులను సమగ్ర శిక్షా అభియాన్‌‌(ఎస్‌‌ఎస్‌‌ఎ), ఎన్​ఆర్ఈజీఎస్, ఐసీడీఎస్‌‌, నాబార్డ్‌‌, ఎస్సీ, ఎస్టీ సబ్‌‌ప్లాన్‌‌, జిల్లా పరిషత్‌‌, మండల పరిషత్‌‌ గ్రంథాలయ సంస్థల నుంచి సేకరిస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 26,065 బడుల్లో సౌలత్​ల కోసం రూ.7,289.54 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పింది. అయితే బడ్జెట్‌‌ పద్దులో ఎక్కడా ఈ వివరాలు కనిపించలేదు. సొమ్ము ఒకరిది సోకు ఇంకొకరిది అన్న చందంగా మొదటి దశలో ఈ విద్యా సంవత్సరం 9,123 బడుల్లో 12 రకాల పనులు ప్రారంభించాలని ప్రభుత్వం ఉత్తర్వులు(జీవో నెం.4) ఇచ్చింది. వసతుల కల్పనకు మొదటి దశలో ఖర్చు చేసే సుమారు నిధులు రూ.3,497.62 కోట్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నవే రూ.2,500 కోట్లకు పైగా ఉండటం గమనార్హం. రాష్ట్రంలో 12 వేల బడుల్లో అదనపు తరగతి గదులు అవసరమని, సుమారు 300 పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కేంద్రం నిధులు ఇస్తే తప్ప ఈ పనులు పూర్తిచేసే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. 

స్కాలర్‌‌షిప్‌‌ బకాయిలు 

ధనిక రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ విద్యార్థులకు స్కాలర్‌‌షిప్‌‌, ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌‌ అందించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. 2020–21 విద్యాసంవత్సరంలో రూ.900 కోట్లు, 2021–22 విద్యా సంవత్సరంలో రూ. 2300 కోట్లు స్కాలర్‌‌షిప్‌‌, ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌‌ బకాయిలు ఉన్నాయి. విద్యార్థులకు స్కాలర్‌‌షిప్స్‌‌, ట్యూషన్ ​ఫీజులు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టోకెన్లు ఇచ్చింది. కానీ విద్యార్థుల అకౌంట్లలో డబ్బులు జమకాలేదు. ఆర్థిక సంవత్సరం ముగియడంతో టోకెన్లు లాప్స్‌‌ అయ్యాయి. దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని విద్యార్థులను 
యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. 

రాష్ట్రంలో ఫీజుల దోపిడీ..

రాష్ట్రంలో ప్రతీ జిల్లాకు ఒక సాంకేతిక కళాశాల(గవర్నమెంట్‌‌ ఇంజనీరింగ్‌‌ కాలేజ్​) ఏర్పాటు చేస్తామని, నియోజకవర్గానికొక పాలిటెక్నిక్‌‌ కాలేజ్​, హెల్త్‌‌ వర్సిటీ, వెటర్నరీ వర్సిటీ, ట్రైబల్‌‌ వర్సిటీ, కల్చరల్‌‌ వర్సిటీ  స్థాపనకు కృషిచేస్తామని మేనిఫెస్టో 2014 పేజీ నెంబర్​12 లో టీఆర్‌‌ఎస్‌‌ పేర్కొంది. కానీ ఎక్కడా అవి అమలుకు నోచుకోలేదు. విద్యారంగంలో ప్రైవేట్‌‌ వ్యాపారం విపరీతంగా పెరిగిపోతున్నది. దేశంలో 43 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్‌‌ స్కూళ్లలో ఉంటే, తెలంగాణలో 51.70 శాతం (60.33 లక్షల్లో 31.19 లక్షలు) మంది ఉన్నారు. మన దగ్గర ఫీజులు కూడా ఎక్కువ. రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్లు, తరగతులను బట్టి సగటున రూ. 40 వేల నుంచి రూ.4.5 లక్షల వరకు ఉన్నాయి. తల్లిదండ్రుల కష్టార్జితంలో సగభాగం పిల్లల చదువులకే ధారపోయాల్సి వస్తోంది. ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ప్రజాసంఘాలు, తల్లిదండ్రుల సంఘాలు చేసిన ఉద్యమాల ఫలితంగా ఫీజుల నియంత్రణకు, మార్గదర్శకాల రూపకల్పన కోసం ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. అయితే ఆ కమిటీ సిఫార్సులు కూడా ప్రైవేట్‌‌ విద్యా వ్యాపారులకే అనుకూలంగా ఉండటం బాధాకరం. 
- బండి సంజయ్‌‌ కుమార్‌‌,
ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు