ఉమ్మడి మహబూబ్​నగర్ సంక్షిప్త వార్తలు

ఉమ్మడి  మహబూబ్​నగర్ సంక్షిప్త వార్తలు

అనంతశయన ఆలయాన్ని  సందర్శించిన ఫ్రెంచ్​ దేశస్తురాలు

నారాయణపేట, వెలుగు:  నారాయణపేటలో ఎంతో పురాతనమైన అనంతశయన ఆలయాన్ని ఫ్రెంచ్​దేశస్తురాలు తఖీమా శనివారం  సందర్శించారు. జిల్లాలో గతంలో పనిచేసిన కలెక్టర్​ హరిచందన  జిల్లాలోని పాత కట్టడాల  పై డాక్యుమెంటరీ చేయగా .. దానిని చూసి జిల్లా లోని ఆలయాల విశిష్టతలు తెలుసుకునేందుకు వచ్చినట్లు తఖీమా చెప్పారు. 4,800  ఏండ్ల కింద పాండవుల ముని జనమేజయ మహారాజు నిర్మించిన ఆలయంలో ప్రతిష్ఠించిన విగ్రహం ఎలాంటి ఆధారం లేకుండా గాలిలో తేలియాడడం చూసి అద్భుతమని  కొనియాడారు. 

భక్తి భావాన్ని  పెంచుకోవాలి

ఆమనగల్లు, వెలుగు: ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం కడ్తాల్​ మండలం అన్మాస్​పల్లి గ్రామంలోని వీరాంజనేయస్వామి ఆలయంలో  సర్పంచ్​లక్ష్మీ నర్సింహారెడ్డి దంపతులు నిర్వహించిన మహాపడి పూజలో ఆమె ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్​యాదవ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  సమాజంలో శాంతి స్థాపనకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు దోహదం చేస్తాయని చెప్పారు.  జడ్పీటీసీలు దశరథ్​నాయక్​, విజితారెడ్డి, జంగారెడ్డి, పీఏసీఎస్​చైర్మన్​ వెంకటేశ్  పాల్గొన్నారు. 


సమస్యల నిలయాలుగా యూనివర్సిటీలు

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: తెలంగాణ ఏర్పడితే యూనివర్సిటీల్లో సమస్యలు తీరుతాయనుకున్నామని, కానీ సీఎం కేసీఆర్ హయాంలో మరిన్ని సమస్యలు పెరుగుతున్నాయని  ఏబీవీపీ యూనివర్సిటీల కన్వీనర్ సుమన్ శంకర్ విమర్శించారు. శనివారం పీయూలో ఏబీవీపీ ముఖ్య కార్యకర్తల మీటింగ్​లో ఆయన మాట్లాడారు. పేరుకే ప్రభుత్వ యూనివర్సిటీలు  ఉన్నాయని, సెల్ఫ్​ఫైనాన్స్ కోర్సుల పేరు మీద స్టూడెంట్స్​నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఎనిమిదేండ్లుగా యూనివర్సిటీలో ఖాళీ కుర్చీలు వెక్కిరిస్తున్నా అధ్యాపక పోస్టులు భర్తీ చేయడం లేదన్నారు. పీయూ ఏర్పడి ఏండ్లు గడుస్తున్నా.. కొత్త కోర్సులు ప్రవేశపెట్టకపోవడం స్టూడెంట్లను విద్యకు దూరం చేయడమేనన్నారు. యూనివర్సిటీల్లో సమస్యలు పరిష్కరించకపోతే  ఉద్యమిస్తామని హెచ్చరించారు. నరేశ్, శోభన్, రామకృష్ణ  పాల్గొన్నారు. 

ప్రభుత్వం ఆదుకోకపోతే చావే దిక్కు

అమ్రాబాద్, వెలుగు: నకిలీ సీడ్స్​తో  తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోకపోతే చావే దిక్కని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పదర మండలం ఉడిమిళ్ల గ్రామంలో శనివారం మద్దిమడుగు హైవేపై  రైతులు రాస్తారోకో చేశారు. ప్రదీప్ (ఎక్కువ మొత్తంలో నష్టం వచ్చిన సీడ్), గీత, పత్తి, బాహుబలి, తులసి జవాన్, బసవ, తదితర విత్తనాలు రైతులు వాడినట్లు తెలిపారు. చేను ఏపుగా పెరిగినా పూత, కాత పట్టలేదన్నారు. రేగడి భూముల్లో  ఏటా ఎకరాకు 10 నుంచి15 క్వింటాళ్ల పత్తి వచ్చేదని, ఈ ఏడు రెండు, మూడు క్వింటాళ్ల పత్తి కూడా కష్టమే అని వాపోయారు.   కలుపు, గుంటుక తదితర లెక్కలు చూస్తే ఎకరాకు రూ.1లక్ష వరకు పెట్టుబడి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.  అధికారులు, డీలర్లు  కుమ్మక్కై తమకు నాసిరకం సీడ్స్​అంటగట్టారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే వారిపై చర్యలు తీసుకుని  న్యాయం చేయాలని కోరారు. దాదాపు రెండు గంటల పాటు మద్దిమడుగు హైవేపై వెహికిల్స్​భారీగా నిలిచాయి.  పదర ఎస్సై తిరుపతి రెడ్డి రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.

రాజీ మార్గమే రాజ మార్గం
 జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమావతి

మహబూబ్​నగర్ /వనపర్తి/గద్వాల/నాగర్​కర్నూల్, వెలుగు : రాజీ మార్గమే రాజమార్గమని, రాజీపడి లోక్​ అదాలత్​ ద్వారా కేసులను  పరిష్కరించుకోవాలని మహబూబ్​నగర్​ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. ప్రేమావతి అన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు  శనివారం మహబూబ్​నగర్​ జిల్లా కోర్టులో 5 బెంచీలు, జడ్చర్ల కోర్టులో 2 బెంచీలు ఏర్పాటు చేశారు. సాయంత్రం వరకు మొత్తం 3,735 కేసులను పరిష్కరించినట్లు జడ్జి ప్రేమావతి తెలిపారు. ఫస్ట్​అడిషనల్​జిల్లా జడ్జి బోయ శ్రీనివాసులు,3వ, 4వ అడిషనల్​జిల్లా జడ్జిలు పి.నీరజ, వై.పద్మ  పాల్గొన్నారు.

వనపర్తిలో 754 కేసులు రాజీ

జిల్లా ప్రధాన కోర్టులో శనివారం నిర్వహించిన లోక్​అదాలత్​లో 754 కేసులు రాజీ చేసినట్లు ప్రిన్సిపల్​సీనియర్​సివిల్​జడ్జి రజిని చెప్పారు.  53 క్రిమినల్, 8 సివిల్, 15 ప్రీ లిటిగేషన్ , 678 నేరం అంగీకరించిన కేసులు మొత్తం 754 కేసులు రాజీ కాగా రూ.19,69, 600 అమౌంట్ రికవరీ అయినట్లు చెప్పారు. ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి రవికుమార్, సెకండ్ అడిషనల్ జూనియర్​జడ్జి జానకి, లోక్​అదాలత్​మెంబర్లు పాల్గొన్నారు. 

గద్వాలలో 618 కేసులు పరిష్కారం
   
లోక్ అదాలత్ లో 618 కేసులు పరిష్కరించినట్లు జిల్లా జడ్జి  కనకదుర్గ తెలిపారు. శనివారం కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ ను నిర్వహించామని,  క్రిమినల్ కేసులు 559, బ్యాంకు ప్రిలిటిగేషన్ కేసులు20,  యాక్సిడెంట్ కేసులు 2, ఎక్సైజ్ కేసులు 
35 పరిష్కరించామన్నారు. ఫస్ట్​అడిషనల్​ జిల్లా జడ్జి అని రోజ్ క్రిస్టియన్,  అడిషనల్​సీనియర్ సివిల్ జడ్జి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. 

నాగర్​కర్నూల్​లో  2,789 కేసులు..

జిల్లా కోర్టులో  ఏర్పాటు చేసిన  లోక్ అదాలత్ ద్వారా 2,789 కేసులు పరిష్కరించినట్లు ప్రిన్సిపల్ జిల్లా సివిల్ జడ్జి డి. రాజేశ్​బాబు తెలిపారు.  నాగర్ కర్నూల్ ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో మొత్తం7 బెంచీలు ఏర్పాటు చేసి లోక్ అదాలత్ నిర్వహించినట్లు చెప్పారు. వివిధ కేసుల్లో రూ.46.05 లక్షల  పరిహారంగా ఇప్పించినట్లు జడ్జి  తెలిపారు.   నాగర్ కర్నూల్ సీనియర్ సివిల్ జడ్జి సబిత, జూనియర్ సివిల్ జడ్జి స్వరూప తదితరులు పాల్గొన్నారు.  


మరో ఇద్దరు నిందితుల పోలీస్​ కస్టడీ


గద్వాల, వెలుగు: జిల్లాలో సంచలనం రేపి న న్యూడ్ కాల్ వ్యవహారంలో ఏ2, ఏ3 నింది తులు కాసేపు నిఖిల్, ధీర వినోద్ కుమార్ లను  ఆది, సోమవారాలలో పోలీ సులు కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. జిల్లా కోర్టు నుంచి పోలీసులు శనివారం పర్మిషన్ తీసుకున్నారు.  ఇప్పటికే ఈ వ్యవహారంలో కీలక నిందితుడైన ఏ1  తిరుమలేశ్​ అలియాస్ మహేశ్వర్ రెడ్డిని రెండు రోజులపాటు పోలీస్​ కస్టడీలోకి తీసుకొని విచారించారు.

దళారులకు వడ్లు అమ్మొద్దు
 వ్యవసాయ శాఖ మంత్రి సి. నిరంజన్ రెడ్డి

వనపర్తి, వెలుగు: రైతులు దళారులకు వడ్లు  అమ్మి నష్టపోకుండా.. వడ్ల కొనుగోలు కేంద్రాల లో మద్దతు ధర పొందాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శని వారం వనపర్తి పరిధిలోని శ్రీనివాసపురంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ప్రతి రైతు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వడ్లను కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. అనంతరం వివిధ గ్రామాల నుంచి  రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన వడ్లను  పరిశీలించారు.  జడ్పీ  చైర్మన్​లోక్ నాథ్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీధర్,  ఎంపీపీ కిచ్చారెడ్డి,  సింగిల్ విండో చైర్మన్ మధుసూదన్ రెడ్డి  పాల్గొన్నారు. 

మోడీ స్పీచ్​ను  చూసేందుకు ఎల్​ఈడీ స్క్రీన్లు

నెట్​వర్క్​, వెలుగు: ప్రధాని మోడీ శనివారం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, రాష్ట్రంలోని  3 హైవే రోడ్లకు శంకుస్థాపన చేసిన కార్యక్రమాన్ని వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లా కేంద్రాల్లో డిజిటల్ తెరపై రైతులు, బీజేపీ లీడర్లు  వీక్షించారు. ఆయా చోట్ల ప్రత్యేకంగా ఎల్​ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ప్రధాని ప్రసంగం ఆద్యంతం యువత మోడీకి జైకొట్టారు.  ఈ కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.రతంగ్​పాండురెడ్డి, జిల్లాల అధ్యక్షులు పగుడాకుల శ్రీనివాస్, రాజవర్ధన్​రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్​వర్ధన్, జిల్లా లీగల్​సెల్​కన్వీనర్​నందు నామాజీ తదితరులు పాల్గొన్నారు.  

కొనుగోలు కేంద్రాలు  ప్రారంభించాలి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు :  జిల్లాలో వడ్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని తెలంగాణ రైతు సంఘం నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి ఎం శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శనివారం సీపీఎం ఆఫీస్​లో  రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. హాజరైన ఆయన మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లాలో వరి కోతలు ప్రారంభమై 15 రోజులు కావస్తున్నా.. నేటికీ  కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగి సీజన్ షురూ కావడంతో బ్యాంకుల ద్వారా పంట రుణాలు ఇచ్చే విధంగా  కలెక్టర్ చొరవ తీసుకోవాలని, రైతుబంధు  వెంటనే ఇవ్వాలని కోరారు. జిల్లాలో పత్తి రైతులను  దళారులు నిలువునా ముంచుతున్నారని,  విజిలెన్స్ ఆఫీసర్లు చొరవ తీసుకొని పత్తి రైతులు మోసపోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  రైతు సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుడు నాగరాజు గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, శివశంకర్, బాలపేరు పాల్గొన్నారు.

వాల్మీకి బోయలకు ఇచ్చిన హామీలు ఏమైనయ్?
 రాచాల యుగంధర్ గౌడ్

వనపర్తి, వెలుగు: వాల్మీకి బోయలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, వెంటనే  సమాధానం చెప్పాలని రాష్ట్ర బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. వనపర్తిలో వాల్మీకి బోయలు  చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరానికి శనివారం సంఘీభావం తెలిపారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  సీఎం కేసీఆర్ వాల్మీకి బోయలను ఎస్టీ ల్లో  చేర్చేందుకు చెల్లప్ప కమిటీని వేశారని, ఆ కమిటీ రిపోర్టు  ఇచ్చినా నేటికీ ఆ సూచనలు  అమలు చేయటం లేదని యుగంధర్ ​మండిపడ్డారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించినట్లు  సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారని, కేంద్రం మాత్రం రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం తమకు రాలేదని చెప్తోందన్నారు. వెంటనే వాల్మీకీ బోయలను ఎస్టీల్లో చేర్చాలని డిమాండ్​చేశారు.  జిల్లా నాయకులు భీమన్న నాయుడు, వాల్మీకి బోయ ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు  కుర్మన్న, రామ్మూర్తి నాయుడు,  దేవన్న నాయుడు  పాల్గొన్నారు.