‘బీఆర్ఎస్’ అంటే బార్ అండ్  రెస్టారెంట్ పార్టీ: షర్మిల

కామారెడ్డి జిల్లా : భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అంటే బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణ మోడల్ అంటే ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చాడమా..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీగా మారిన టీఆర్ఎస్.. వచ్చే ఎన్నికల తర్వాత వీఆర్ఎస్ తీసుకుంటుందని చెప్పారు. పాదయా త్రలో భాగంగా కామారెడ్డి రైల్వే స్టేషన్ వద్ద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అధ్వాన్న పాలన సాగుతోందని షర్మిల ఆరోపించారు. 

ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయిన కేసీఆర్.. దేశాన్ని ఏం ఉద్దరిస్తారని షర్మిల ప్రశ్నించారు. తన తండ్రి దివంగత వైఎస్సార్ కామారెడ్డి నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, ఇవాళ ఆయనే బతికి ఉంటే ప్రాణహిత -చేవెళ్ల ద్వారా లక్షల ఎకరాలకు నీరు అందించేవారని చెప్పారు. ప్రాజెక్టు రీ డిజైన్ పేరుతో కేసీఆర్ కామారెడ్డి జిల్లాకు తీర‌ని అన్యాయం చేశారని ఆరోపించారు. ప్రాజెక్ట్ రీ డిజైన్ పేరుతో ఒక్క చుక్క నీరు రాకుండా చేశారని అన్నారు. 

కామారెడ్డి జిల్లాలో తాగునీటి సమస్యను ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలో గుర్తించి..సమస్య పరిష్కారం కోసం రూ.200 కోట్ల ఖర్చుతో ప్రతి ఇంటికి నల్లా ఇచ్చారని షర్మిల చెప్పారు. ‘మిష‌న్ భ‌గీర‌థ’ కామారెడ్డి నుంచి కాపీ కొట్టిందేనని అన్నారు. కామారెడ్డి నియోజకవర్గానికి వైఎస్ఆర్ 20వేల ఇందిరమ్మ ఇండ్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్, 22 సబ్ స్టేషన్లు నిర్మించారని చెప్పారు. 

‘‘బీఆర్ఎస్ జాతీయ పార్టీ పేరుతో తెలంగాణ మోడల్ ను దేశం మొత్తం అమ‌లు చేస్తారట‌. తెలంగాణ మోడ‌ల్ అంటే ఏంటో తెలుసా..? మిగులు బ‌డ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేయ‌డ‌మా..? ఆడ‌వారికి ర‌క్షణ లేకుండా చేయ‌డం తెలంగాణ మోడ‌లా..? ఇచ్చిన ఏ ఒక్క హామీని నిల‌బెట్టుకోకపోవ‌డం తెలంగాణ మోడ‌లా..? రైతులు చ‌నిపోయినా పట్టించుకోకపోవడం తెలంగాణ మోడలా.. ? ఏనాడూ రైతులను పట్టించుకుంది లేదు. విద్యార్థుల్లో భరోసా నింపింది లేదు. రాష్ట్రాన్ని పట్టించుకోరు గానీ, దేశాలు ఏల‌బోతారట‌’’ అంటూ షర్మిల వ్యాఖ్యానించారు.

కేసీఆర్ కు రిటైర్ మెంట్ ఇచ్చి ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టాలని షర్మిల అన్నారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నియోజకవర్గం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. సొంత ఇళ్లు కూడా లేదని జాలిపడి ఓట్లు వేస్తే.. సర్కారు స్థలాలు కబ్జాలు చేశాడని ఆరోపించారు. అన్నింటిలోనూ కమీషన్లు వసూలు చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. పథకాల పేర్లు చెప్పి తెలంగాణకు చేసిన మోసం అంతా ఇంతా కాదన్నారు. బ్యాంకుల్లో రుణమాఫీ చేయకపోవడం వల్ల ఇచ్చే రైతుబంధు కూడా వడ్డీలకే సరిపోతోందన్నారు.

2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 20వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చారని షర్మిల చెప్పారు. కేసీఆర్ రాష్ట్రాన్ని లూటీ చేస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ అవినీతిని ఏనాడు ప్రతిపక్షాలు ప్రశ్నించలేదన్నారు. ‘16వేల కోట్ల మిగులు బ‌డ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారు. ఇంత అప్పు చేసినా తెచ్చిన అప్పులు మొత్తం క‌మీష‌న్ల రూపంలో తినేశారు. పెద్ద పెద్ద ప్రాజెక్ట్ ల పేరుతో మొత్తం దోచేశారు. ఇదేనా బంగారు తెలంగాణ‌..? బంగారు తెలంగాణ అని చెప్పి బతుకే లేని తెలంగాణగా మార్చారు’’ అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ‌లో ప్రజల  కోసం కొట్లాడే పార్టీనే లేదని, అందుకే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టామని షర్మిల చెప్పారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వస్తే..వైఎస్సార్ అమలు చేసిన ప్రతి ప‌థ‌కాన్నీ అమ‌లు చేస్తామన్నారు.