- కుప్పకూలిన టీఆర్ఎస్ గ్రాఫ్
- 12 రెట్లు పెరిగిన కమలం సీట్లు
- పట్టు నిలుపుకున్న ఎంఐఎం
- రెండింటికే కాంగ్రెస్ పరిమితం
- పత్తా లేని టీడీపీ, లెఫ్ట్ పార్టీలు
పోయినసారికంటే ఇంకో ఐదారు సీట్లను ఎట్లన్న తెచ్చుకుందమని గ్రేటర్లో ముందుకు ఉరికిన కేసీఆర్ ‘కారు’.. బీజేపీ ‘బండి’ని గుద్దుకొని పల్టీలు కొట్టింది. ఉన్నదాంట్లకెంచే సగం దాకా సీట్లను ఊడగొట్టుకుంది. దుబ్బాక గెలుపుతో జోరు మీదున్న బీజేపీ.. మునుపటికంటే పన్నెండు రెట్లు ఎక్కువ సీట్లు తెచ్చుకుంది. మజ్లిస్ ఎప్పటిలెక్కనే పాతబస్తీలో పట్టు నిలుపుకుంది. కాంగ్రెస్ కథ ఏడున్నదో ఆడనే ఉన్నది. ఇగ టీడీపీ, లెఫ్ట్ పార్టీలు సోదిల లేకుండ పోయినయ్. హైదరాబాద్ జనం ఇచ్చిన ఈ తీర్పు స్టేట్ పాలిటిక్స్‌ను కూడా టర్న్ చేసే అవకాశాలు కనిపిస్తున్నయ్. త్వరలో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్పైనా గ్రేటర్ ఎఫెక్ట్ ఉంటదని లీడర్లు అనుకుంటున్నరు.
దుబ్బాక బై ఎలక్షన్ గెలుపు జోష్.. ఆ విజయం నుంచి గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్ నాటికి కేవలం 20 రోజులే గ్యాప్.. అంతకుముందు గ్రేటర్లో వచ్చింది నాలుగు డివిజన్లే.. మరి ఇప్పుడు ఏకంగా 48 డివిజన్లలో గెలుపుతో సంచలనం. ఇంకా ఎన్నో డివిజన్లలో సెకండ్ ప్లేస్‌లో నిలిచి పెద్ద సంఖ్యలో ఓట్లనూ బీజేపీ పెంచుకుంది. తక్కువ రోజుల్లోనే బీజేపీకి పెరిగిన గ్రాఫ్ ఇది.రాష్ట్రంలో పవర్లో ఉన్న పార్టీ. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏకంగా మూడింట రెండొంతుల డివిజన్లు గెల్చుకుంది. 99 సీట్లతో బలంగా నిలబడిన ప్లేస్ నుంచి.. ఇప్పుడు 55 సీట్లకు పడిపోయింది. అదీ చాలా చోట్ల బొటాబొటీ మెజార్టీతో గెలిచింది. ఎలక్షన్లలో క్రమంగా తగ్గుతున్న టీఆర్ఎస్ గ్రాఫ్ ఇది.
హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్కు వరుసగా మరో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణలో ప్రత్యామ్నాయం తానేనని బీజేపీ మరోసారి చాటుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో డీలా పడ్డ కాంగ్రెస్ మళ్లీ ఫెయిలైంది. దుబ్బాక ఓటమి నుంచి తేరుకోకముందే.. గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లు గులాబీ లీడర్లకు షాక్ ఇచ్చారు. ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు మొగ్గు చూపారు. హోరాహోరీగా సాగిన జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో హైదరాబాద్ ఓటర్లు టీఆర్ఎస్ను ఓడగొట్టినంత పనిచేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని 150 డివిజన్లలో 55 సీట్లను టీఆర్ఎస్ గెలుచుకోగా.. 48 సీట్లలో బీజేపీ విజయం సాధించింది. 44 సీట్లను ఎంఐఎం కైవసం చేసుకుంది. రెండు సీట్లను మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. నేరేడ్మెట్ రిజల్ట్ పెండింగ్‌లో పడింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీఆర్ఎస్ నిలిచినా.. గత ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీ గ్రాఫ్ అమాంతం పడిపోయింది. 2016 ఎన్నికల్లో 99 డివిజన్లను టీఆర్ఎస్ గెలుచుకుంటే.. ఈ సారి అందులో దాదాపు సగం సీట్లకు పరిమితమైంది. దుబ్బాక విన్నింగ్ జోష్‌లో ఉన్న బీజేపీ గ్రేటర్‌లోనూ అదే ట్రెండ్ కొనసాగించింది. గత ఎన్నికల్లో 4 డివిజన్లను గెలుచుకున్న ఆ పార్టీ.. ఈ సారి 12 రెట్లు ఎక్కువగా సీట్లు సాధించింది. ఈ నెల ఒకటిన జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్లను శుక్రవారం లెక్కించారు. క్షణక్షణం ట్రెండ్స్ మారుతూ వచ్చాయి. టీఆర్ఎస్, బీజేపీ మధ్య ‘నువ్వా నేనా’ అన్నట్లు పోటీ సాగింది. చివరి వరకూ ఇదే ట్రెండ్ కొనసాగింది.
మేనిఫెస్టో ఆకట్టుకుంది
గ్రేటర్లో బీజేపీ దూకుడు సక్సెసయింది. సర్జికల్ స్ట్రయిక్ అంశం మొదలు ఎంఐఎంను టార్గెట్‌గా చేసుకొని బీజేపీ లీడర్లు రోజుకో తీరుగా రాజకీయ వేడి రగిలించటం, ఆ పార్టీ జాతీయ స్థాయి లీడర్లు ప్రచారానికి రావటం అనుకూలించింది. టీఆర్ఎస్ ఆరేండ్ల పాలనపై బీజేపీ లేవనెత్తిన చార్జ్‌షీట్, అన్ని అంశాలతో విడుదల చేసిన మేనిఫెస్టో సిటీ జనాన్ని ఆకట్టుకుంది.
ఎస్ ఈసీ చేసిన తప్పులు, అధికార పార్టీ ప్రచారాన్నిఎండగట్టడంలో బీజేపీ నేతలు అనుసరించిన తీరుప్లస్ పాయింట్ అయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతల ముప్పు ఉందని చెప్తూ మతకల్లోలాల బూచీ చూపడం..తన సంతకాన్ని టీఆర్ఎస్ ఫోర్జరీ చేసిందని బండి సంజయ్ చెప్పడం.. భాగ్యలక్ష్మి టెంపుల్ కు రావాలని కేసీఆర్ కు ఆయన సవాల్ విసరటం.. ఇలా అనేక అంశాలు బీజేపీ అభ్యర్థులకు ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. గ్రేటర్ ఫలితాల్లో పోస్టల్ బ్యాలెట్ నుం చే బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చింది. బ్యాలెట్ పేపర్ల లెక్కింపు మొదలైన తర్వాత కూడా అదే ట్రెండ్ కొనసాగించిం ది. ఒకానొక దశలో 50కి పైగా సీట్లు గెలుస్తుందని అనుకున్నా.. కొన్ని సీట్లను స్వల్ప ఓట్ల తేడాతో కోల్పోయింది. ఓల్డ్ సిటీలో ఏకంగా పది సీట్లు గెలుచుకొని ఎంఐఎం కోటాలోనూ బీజేపీ సత్తా చాటింది. ఎల్ బీనగర్, మహేశ్వరం, గోషామహల్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ఏకపక్షంగా విజయం సాధించింది. 48 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది.