కరీంనగర్49వ డివిజన్ కార్పొరేటర్ కమల్జిత్ కౌర్తోపాటు ఆమె భర్త సోహెన్ సింగ్ లకు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు(జీవీ) షోకాజ్ నోటీసు జారీ చేశారు. టీఆర్ఎస్ పార్టికీ, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తమకు వచ్చిన ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. తాగునీటి సమస్యపై ఎవరినీ సంప్రదించకుండా గత మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఖాళీ బిందెలతో నిరసన తెలపడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని నోటీసులో పేర్కొన్నారు.
ఇటీవల విడుదలైన ఆడియోలో సోహెన్ సింగ్ రోడ్డును తవ్వేసి మంత్రి గంగుల కమలాకర్ కు చెడ్డపేరు వచ్చేలా ప్రవర్తించినట్టు తెలిసిందన్నారు. అదేవిధంగా స్మార్ట్ సిటీ పనులకు సంబంధించి వీడియోలు తీస్తూ... పనులలో నాణ్యత లేదంటూ అసత్య ప్రచారం చేస్తూ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడంపై వివరణ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్న కార్పొరేటర్ కమల్జిత్ కౌర్, సోహెన్ సింగ్ ను ఎందుకు సస్పెండ్ చేయరాదో మూడు రోజుల్లోగా లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించారు.