ఖమ్మం, వెలుగు : టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూతురు సప్నిరెడ్డి, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్‌రెడ్డి మనువడు అర్జున్‌రెడ్డి పెండ్లి రిసెప్షన్ గ్రాండ్‌గా జరిగింది. బుధవారం ఖమ్మంలోని ఎస్ఆర్ గార్డెన్స్‌లో జరిగిన ఈ వేడుకకు రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, శంకర్ నాయక్, రాములు నాయక్, మెచ్చా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఏపీ నుంచి సామినేని ఉదయభాను, మేకా ప్రతాప అప్పారావు, ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు వారియర్, జడ్పీ చైర్మన్లు లింగాల కమల్ రాజు, కోరం కనకయ్యతో పాటు పలు రంగాల ప్రముఖులు తరలివచ్చారు.
హాజరైన 3 లక్షల మందికిపైగా జనం
వంద ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన రాజస్థాన్ ప్యాలెస్ సెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉదయం పది గంటలకు వేడుక ప్రారంభం కాగా సాయంత్రం నాలుగు గంటల వరకు కోలాహలం కొనసాగింది. రిసెప్షన్ కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 6.50 లక్షల కుటుంబాలకు వాల్ క్లాక్, పెండ్లి పత్రిక ఇచ్చి ఆహ్వానించగా.. మూడు లక్షల మందికి పైగా హాజరయ్యారని పొంగులేటి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. జనం భారీ సంఖ్యలో రావడంతో ఎస్ఆర్ గార్డెన్స్ కు వెళ్లే ప్రధాన రహదారులన్నీ ట్రాఫిక్ తో స్తంభించిపోయాయి. సినీ నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి నేతృత్వంలో నిర్వహించిన సంగీత విభావరి అందరినీ అలరించింది. సింగర్ లిప్సిక తన పాటలతో ఉర్రూతలూగించారు. సుమారు నాలుగు గంటల పాటు జరిగిన సంగీత విభావరిని యాంకర్ శ్యామల ఉత్సాహంగా నిర్వహించారు. కాగా, వైరా నియోజకవర్గం నుంచి రిసెప్షన్‌కు హాజరైన ఏసుమణి అనే గర్భిణి ఫంక్షన్ హాల్లోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. భోజనం చేసే సమయంలో నొప్పులు రావడంతో అక్కడే ఉన్న డాక్టర్ మట్టా దయానంద్ గర్భిణికి పురుడుపోశారు. ఆ తర్వాత ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.