గౌడ సంక్షేమంపై కేటీఆర్ హామీ ఇచ్చారు : స్వామి గౌడ్ 

బీజేపీతో గౌడ సామాజిక వర్గానికి, మధ్య తరగతి కుటుంబాలకు న్యాయం జరగదని.. అందుకే టీఆర్ఎస్ లో చేరానని శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ తెలిపారు. ఇవాళ నల్గొండ జిల్లా చండూరులో టీఆర్ఎస్ గౌడ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్వామి గౌడ్ మాట్లాడారు. అన్ని కులాలకు బతకడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని ఆయన అన్నారు. గీత కార్మికులు చనిపోతే బీమాతో పాటు.. వారు బతికుండగా పని చేసుకునేందుకు ఒక పథకం ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. రోడ్డు ప్రమాదం జరిగితే ఏ విధమైన బీమా కల్పిస్తున్నారో.. గీత కార్మికులకు తాటి చెట్టుపై నుండి పడితే అదే తరహా ప్రయోజనం కల్పించాలని కేటీఆర్ ను కోరామని తెలిపారు.

హైదరాబాద్ కు కల్లు సరఫరా చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి కల్పించాలని..వేరే కులస్తులకు ఏ విధంగా వ్యాపార అవకాశాలు కల్పిస్తున్నారో అదే విధంగా గౌడ కులస్థులకూ అవకాశాలు కల్పించాలని కేటీఆర్ ను కోరినట్లు వివరించారు.  గౌడలకు వ్యాపార నిమిత్తం వాహనాలు ఇవ్వాలని అడిగామన్నారు. వీటన్నింటికి కేటీఆర్ హామీ ఇవ్వడంతోనే టీఆర్ఎస్ లో చేరానని వివరించారు. కల్లు అమ్ముకునే వద్దనే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి గౌడలను ఇబ్బంది పెడుతున్న విషయం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళామని స్వామి గౌడ్ గుర్తు చేశారు. ఏ ఒక్కనాడు ప్రజల కోసం పని చేయని రాజగోపాల్ రెడ్డి ఇవాళ తన స్వార్ధం కోసం రాజీనామా చేసి ఎన్నికలకు వచ్చిండని బూడిద భిక్షమయ్య గౌడ్ విమర్శించారు.