- పాత అర్జీలన్నీ క్లియర్.. లబ్ధిదారులకు చెక్కు లు
- కొత్తగా పిం ఛన్లు.. ఆగిపోయిన పనులన్నీ స్టార్ట్
- పంచాయతీల్లో తీర్మానాలతో మైండ్ గేమ్
- జీహెచ్ ఎంసీలో కేటీఆర్ .. దుబ్బాకలో హరీశ్ బిజీ
- ఖమ్మం , వరంగల్ కార్పొరేషన్లపైనా ఫోకస్
హైదరాబాద్, వెలుగు: ఎలక్షన్ స్టంట్ స్టార్ట్ అయింది. ఎన్నికలు జరగబోయే చోట.. అడగకున్నా అధికార పార్టీ నిధులను కుమ్మరిస్తున్నది. అక్కడి ప్రజలను సంక్షేమ పథకాలతో ముంచెత్తుతున్నది. పెండింగ్ అప్లికేషన్లన్నీ క్లియర్ చేస్తున్నది. శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలతో లీడర్లు హడావుడి చేస్తున్నారు. కొన్నిరోజులుగా గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు దుబ్బాక నియోజకవర్గంపై టీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అక్కడున్న ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. గ్రేటర్‌హైదరాబాద్‌తోపాటు వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల పదవీ కాలం వచ్చే ఫిబ్రవరితో ముగుస్తుంది. ఈలోపు ఎప్పుడైనా వాటికి ఎన్నికలు జరిగే చాన్స్ ఉంది. మరోవైపు బీహార్ ఎన్నికలతోపాటే దుబ్బాక బై ఎలక్షన్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తున్నది. దీంతో టీఆర్ఎస్ లీడర్లు ఆయా ప్రాంతాల్లో జోరుగా పర్యటిస్తున్నారు. హైదరాబాద్‌లో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, దుబ్బాకలో మంత్రి హరీశ్‌రావు పోటాపోటీగా హామీలు ఇస్తున్నారు.
దుబ్బాక నియోజకవర్గంపై టీఆర్ఎస్ గతంలో ఎన్నడూ లేనంతగా ఫోకస్ పెట్టింది. ఇక్కడ గడిచిన పది రోజుల్లో రూ. 26 కోట్లతో వివిధ పనులు చేపట్టింది. వీటికి తోడు డబుల్ బెడ్రూం ఇండ్లు, స్వయం సహాయక సంఘాలకు చెక్కులను పంపిణీ చేయటంతోపాటు పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్లన్నీ వరుస పెట్టి క్లియర్ చేసింది. ఆరు వేల మందికి కొత్తగా ఆసరా ఫించన్లను మంజూరు చేసింది. పెండింగ్‌లో ఉన్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సాయం రిలీజ్ చేసింది. దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో బిజీగా ఉంటున్నారు. గడిచిన పది రోజుల్లో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోలు మండలాల్లో పర్యటించిన ఆయన.. రూ.11 కోట్ల విలువైన 36 పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, రైతు వేదికలు, కూరగాయల మార్కెట్లు, డ్రైనేజీలు, జంక్షన్లు, గోడౌన్లు, మోడ్రన్ టాయిలెట్స్ తదితర పనులు ఉన్నాయి. దుబ్బాక మున్సిపాలిటీతో పాటు మండలాల్లో రూ. 7.30 కోట్లతో 23 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, రూ. 3.70 కోట్లతో 13 అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. వీటికి తోడు నియోజకవర్గంలో ఆర్అండ్ బీ రోడ్ల నిర్మాణం కోసం రూ. 12 కోట్లు, నియోజకవర్గంలోని 19 జీపీ ఆఫీసుల కొత్త బిల్డింగ్స్ నిర్మాణానికి ఒక్కో దానికి రూ. 20 లక్షల చొప్పున రూ. 3.80 కోట్లు మంజూరు చేశారు. మల్లేశంపల్లి గ్రామంలో 20 డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రకటించారు. నియోజకవర్గంలోని 546 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలకు సంబంధించి రూ. 17.8 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. దాదాపు 400 కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.
వచ్చే నెలలో ఖమ్మంలో కేటీఆర్ పర్యటన
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు కూడా టైం దగ్గర పడుతుండటంతో వందల కోట్ల అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దసరా నాటికి ఐటీ హబ్, ధంసలాపురం రైల్వే ఓవర్ బ్రిడ్జి, కొత్త బస్టాండ్ ప్రారంభించేలా ప్లాన్ చేసింది. మంత్రి కేటీఆర్ వచ్చే నెల ఖమ్మంలో పర్యటించనున్నారు. ఆయన రాక సందర్భంగా ఈ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. వీటితో పాటు కార్పొరేషన్ పరిధిలోని టేకులపల్లిలో నిర్మిస్తున్న 1054 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా అదే సమయంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఇండ్ల కోసం గత వారమే లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను తీసుకున్నారు. మొత్తం 50 డివిజన్లు ఉండగా 17 నుంచి 41 డివిజన్లకు చెందిన వారికి ఒక్కో డివిజన్ కు 40 చొప్పున ఇండ్లను కేటాయించారు. మొత్తం 12 వేల వరకు అప్లికేషన్లు రాగా.. లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఈ ప్రారంభోత్సవాలన్నీ ఆగస్టు 15లోపే చేయాలని ముందుగా నిర్ణయించుకున్నా, కరోనా కారణంగా పనులు ఆలస్యం కావడంతో దసరాకు వాయిదా వేశారు.
తీర్మానాలతో మైండ్ గేమ్
ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో ఉన్న రూలింగ్పార్టీ దుబ్బాక నియోజవర్గంలోని గ్రామ పంచాయతీ తీర్మానాలతో మైండ్‌గేమ్ ఆడుతోంది. బై ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీకే మద్దతిస్తామని గ్రామాల్లో తీర్మానాలు జరుగుతున్నాయి. ముఖ్య నేతల కనుసన్నల్లోనే ఈ తతంగం నడుస్తున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దుబ్బాక మండలంలోని వెంకటగిరితాండ, శిలాజీనగర్, పద్మనాభునిపల్లి.. దౌల్తాబాద్ మండలంలోని నర్సంపేట, గువ్వలేగి.. రాయపోలు మండలంలోని ఉదయపూర్, గొల్లపల్లి గ్రామాలు టీఆర్ఎస్కు అనుకూలంగా తీర్మానాలు చేశాయి. దీనిపై ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దుబ్బాక మండలం శిలాజీనగర్ గ్రామ పంచాయతీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
పాత హామీలతో ఇప్పుడు ముందుకు
గ్రేటర్ హైదరాబాద్‌లో స్కైవేలు, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు,
ఆర్వోబీలు, బ్రిడ్జిలు, కేబుల్ బ్రిడ్జిలు నిర్మిస్తామని ఆరేండ్లుగా చెబుతూ వస్తున్న టీఆర్ఎస్ సర్కార్.. మూడు నెలలుగా ఆ హామీలను ముందేసుకుంది. మంత్రి కేటీఆర్ వరుసగా శంకుస్థాపనలతో బిజీబిజీగా ఉంటున్నారు. జులై 11న ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ ఎలివేటేడ్ కారిడార్‌కు, జులై 29న ఫతేనగర్ ఫ్లై ఓవర్ విస్తరణకు శంకుస్థాపన చేశారు. ఆగస్టు 10న ఎల్బీ నగర్ సమీపంలో ఫ్లైఓవర్ ప్రారంభించారు. దుర్గంచెర్వుపై సస్పెన్షన్ బ్రిడ్జి ఫొటోలను ఇప్పటికే పలుమార్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఐదేండ్ల కిందటి స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో (ఎస్ఆర్డీపీ) మిగిలిపోయిన 58 పనులకు వచ్చే నెల రోజుల్లో కొబ్బరికాయలు కొట్టేందుకు టీఆర్ఎస్ లీడర్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముహూర్త దశలో ఉన్న ఈ పనులన్నీ 2021, 2022 డిసెంబర్ నాటికి పూర్తవుతాయని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది.
వరంగల్లోనూ హడావుడి
వరంగల్‌లో ఇప్పటికే సీసీ రోడ్లు, డ్రైనేజీలకు సంబంధించిన శంకుస్థాపనలతో టీఆర్ఎస్ లీడర్లు హడావుడి చేస్తున్నారు. ఆయా పనులకు గత నెలలో జరిగిన కౌన్సిల్ మీటింగ్‌లో రూ. 30 కోట్లతో అభివృద్ధి పనులకు తీర్మానం చేశారు. వాటితోపాటు కార్పొరేటర్లకు రూ. 5 లక్షల నామినేషన్ పనులు అప్పగించారు. దీంతో గ్రేటర్ వరంగల్‌లో డెవలప్ మెంట్ పనులు సందడి మొదలైంది. నగరంలో హృదయ్ స్కీం, కుడా ఫండ్స్ రూ.25 కోట్లతో భద్రకాళి బండ్ ను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించాలని గతేడాది అక్టోబర్ నుంచి అనుకుంటున్నారు. కానీ వివిధ కారణాల వల్ల అదికాస్త వాయిదా పడుతూ వస్తున్నది. దీంతోపాటు మడికొండలో రూ. 5 కోట్లతో ఆక్సిజన్ పార్కు, హంటర్‌రోడ్డులో రూ.20 కోట్లతో శిల్పారామం, నగరానికి నాలుగు వైపులా కళాతోరణాలు, స్మార్ట్ రోడ్లు ఇలా దాదాపు రూ.400 కోట్ల విలువైన వివిధ పనులు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఎదురుచూస్తున్నాయి. గత అక్టోబర్‌లోనే వీటి పనులు ప్రారంభించాల్సి ఉండగా.. ఆర్టీసీ సమ్మె వల్ల వాయిదా పడింది. ఆ తర్వాత కరోనా వల్ల మరింత ఆలస్యమైంది. త్వరలో గ్రేటర్ వరంగల్ ఎలక్షన్స్ జరగనుండటంతో వచ్చే నెలలో మంత్రి కేటీఆర్‌ను నగరానికి రప్పించి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయించి, ప్రజల్లోకి వెళ్లాలని వరంగల్ లీడర్లు ప్లాన్ వేస్తున్నారు.